Tuesday, October 7, 2014

My Article "Swachchatatone Parishubhrata" in Today's Andhrabhoomi Daily (07.10.2014) Bhoomika's Main-feature-- Rani Sandhya
Online Link: http://www.andhrabhoomi.net/content/feature

‘స్వచ్ఛ’తతోనే పరిశుభ్రత

  • -రాణి సంధ్య aranisandhya777@gmail .com
  • 07/10/2014
 మార్నింగ్ వాకింగ్‌కి బయలుదేరిన సంజనకి అనుకోని సంఘటన ఎదురై వీధిలోకి వెళ్లాలంటేనే భయం పట్టుకుంది. రోడ్డుపై ఎటు చూసినా చెత్తా చెదారం, అడుగడుగునా గుంతలు, మురికి కంపు, వాహన కాలుష్యం ఆమెను కలవరపరిచాయ.
ఈ అడ్డంకులన్నీ ఎలాగో ఎదుర్కొంటూ వాకింగ్ చేస్తున్న సంజన ఉన్నట్టుండి ఎర్రని పదార్థం ఏదో మీద తనమీద పడబోతే తప్పించుకునే ప్రయత్నంలో కిందపడింది. ఏమిటో అని చూస్తే అది- పాన్ తింటున్న వ్యక్తి నోట్లోంచి విసిరేయపడ్డ ఉమ్మి. పక్కకి తిరిగి చూస్తే అతను రోడ్డుపై ఉన్న ఓ కిళ్లీకొట్టు యజమాని. దుకాణంలో కూర్చొనే రోడ్టుపై ఉమ్మేస్తున్నాడు. కోపంగా సంజన అతన్ని నిలదీయగా ‘ మిమ్మల్ని చూడలేదు.., ఎందుకు గొడవ?’ అని సర్ది చెప్పే ప్రయత్నం చేసాడు.
***
ఇలాంటి చేదు అనుభవాలు ఏ పల్లెటూరులోనో, చిన్న పట్టణంలోనో ఎదురైనవి కావు. తెలుగు ప్రజల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో మార్నింగ్ వాకింగ్‌కి వెళ్ళే అదృష్టం కూడా లేదా? పరిశుభ్రత, పారిశుద్ధ్యం పట్ల మహా నగరాల్లోనూ జనాలకు తగిన అవగాహన లేదా? అని బాధ పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయ. రోడ్లపై గోతుల్లో మురికినీరు ఒక వైపు, పాన్లు తింటూ దారినపోయే వారిమీదే ఉమ్మేసే పరిస్థితులు మరో వైపు. ఇంట్లో చెత్తని పారేసేంత తేలికగా నోట్లోని పదార్థాన్ని మనుషుల మధ్యే ఉమ్మేస్తుంటారు. ఇంతకుముందు రోడ్డుపై, గోడలపై మాత్రమే కనిపించేవి కిళ్లీ ఉమ్ములు. ఇప్పుడు మనుషులున్నారనే ధ్యాసే కూడా మరిచిపోయి ఎక్కడ పడితే ఉమ్మేస్తున్నారు. ఒక వ్యక్తి నడుస్తున్న ఆటోలోంచి ముందూ వెనుకా చూడకుండా ఉమ్మేస్తాడు, అది ఎక్కడ ఎవరిమీద పడుతుందో తెలియదు, ఏ వాహనంమీద పడుతుందో తెలీదు. ఒక డ్రైవర్ నడుస్తున్న బస్సులోంచి ఉమ్మేస్తాడు. అది మీద పడకున్నా, కొన్నిసార్లు పక్కనే ఆగి ఉన్న వారికి చాలా అసహ్యంగా అనిపిస్తుంది. బస్సుల్లో పాన్ మరకలు ప్రయాణీకులకు అసహ్యం కలిగిస్తాయ. ఇక ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే- మెట్లపై, గోడలపై పాన్ మరకలు దర్శనమిస్తాయి. ఇలాంటి చిన్న విషయాలు జనం ఎవరితో చెప్పుకుంటారు? ఏమని చెప్పుకుంటారు? పల్లెలు, నగరాలనే తేడా లేకుండా పరిసరాలను పాడు చేస్తున్న వారిని ఎవరు కట్టడి చేస్తారు?
ప్రజల సౌకర్యార్థం భారీగా నిధులు ఖర్చు చేసి మూత్రశాలలు, మరుగుదొడ్లను కట్టిస్తున్నా, అవి ఎంత శుభ్రతగా ఉంటాయో? వాటిలోకి వెళ్లినవారికే తెలుస్తుంది. పబ్లిక్ టాయలెట్లలో ప్రతి ఒక్కరూ శుభ్రత పాటిస్తే ఏ సమస్యా రాదు. మనకెందుకులే.. అక్కడి ఉద్యోగస్తులో, మున్సిపాలిటీ వారో చూసుకుంటారులే అని వీటి శుభ్రత గురించి చాలా మంది పట్టించుకోరు. సినిమా హాళ్ళు సైతం ఇందుకు విరుద్ధం కాదు. ప్రేక్షకులు ఏ స్థాయివారైనా సరే.. మన పని అయితే చాలని భావిస్తారు. టాయలెట్ ఖాళీ లేదని తెలిసినా, చదువుకున్న వారు సైతం చిన్న పిల్లలను ఆరుబయట కాలకృత్యాలకు కూర్చోబెడతారు. అలా ఒకరిని చూసి ఇంకొకరు పరిసరాలను పాడు చేస్తుంటారు. ఇక, మగమహారాజులకైతే రోడ్లన్నీ మరుగుదొడ్లే. ఎక్కడ పడితే అక్కడ మూత్రవిసర్జన చేసి కాలుష్యాన్ని అధికం చేస్తున్నారు. హైదరాబాద్‌లో నగర పాలక సంస్థ వారు ఫుట్‌పాత్‌లను, రోడ్లను ఎంతో అందంగా చెట్లతో తీర్చిదిద్దితే- అక్కడే దారిపోయేవారు మూత్ర విసర్జన చేసి కంపు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఉన్నత న్యాయస్థానాల చెంతనే ఇలా ఆరుబయట మూత్రవిసర్జన చేస్తున్నా ఎవరూ పట్టించుకోరు. అందరూ తెలివిగల వారే. అంతా చదువుకున్న వారే. అందంగా ముస్తాబైతే సరిపోతుందా? పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్న అవగాహన ఉండాలి కదా! జనమే సరిగా లేకుంటే- ప్రభుత్వం, ఉద్యోగస్తులు మాత్రం ఏం చేయగలరు?
కనీస సౌకర్యాలు లేవని బాధపడతాం కానీ, ఉన్నవాటిని నిజాయితీగా వాడుకుని మన వంతు కర్తవ్యం నిర్వహిద్దామన్న బాధ్యత ఎంతమందిలో ఉంది? ఎవరో ఒక నాయకుడు పుట్టుకు రావాలి, జనాన్ని సమాజాన్ని ఉద్ధరించాలని ఎదురుచూస్తాం. ప్రతి ఒక్కరం సమాజ శ్రేయస్సుకు సైనికుల్లా పనిచేయాలని ఎందుకు ఆలోచించం? సినిమా హీరోలు ఏది చెపితే దానిని చాలామంది గుడ్డిగా అనుకరిస్తారు. మనకూ ఒక బాధ్యత ఉందని, సమాజం అంటే నాయకులు కాదు, అని జనం అని ఎప్పుడు అర్థం చేసుకుంటారు?
ఏ పద్ధతైనా ముందుగా మన ఇంటినుంచే పుడుతుంది. ప్రతి కుటుంబం ముందుగా ఒక పద్ధతి అవలంబిస్తే అది సమాజానికి మేలు చేస్తుంది. చాలామంది తమ ఇళ్లలో చెత్తను రోడ్డుపై అస్తవ్యస్తంగా పడేస్తారు. ఇంట్లో అందరికీ చెత్తని పడేసే పద్ధతి నేర్పిస్తే ఎక్కడ పడితే అక్కడ చెత్తని విసిరేయడం మానుకుంటారు. వ్యర్థ పదార్థాలను చెత్తకుండీలో వేసే ముందే ఒక ప్లాస్టిక్ కవర్‌లో మూటగట్టి చెత్తకుండీలో వేయాలి. పారవేసే ఆహార పదార్థాలను, ద్రవ రూపంలో ఉండేవాటిని వడకట్టి ఒక ప్లాస్టిక్ కవర్‌లో వేయాలి. పార్క్‌కి వెళ్లినా, ప్రయాణాల్లో ఏది తిన్నా వ్యర్థ్యాలను ఓ కవర్లో చుట్టివేయడం మంచిది. కాగా, మున్సిపాలిటీ వాళ్లు మాత్రం ఓపెన్ టబ్‌లో చెత్తని తీసుకెళ్తారు. రోడ్లపై వెళుతున్న చెత్త వాహనాల నుంచి కొంత చెత్త కిందనే పడుతుంటుంది. ఇలా కాకుండా భారీ ప్లాస్టిక్ డంపింగ్ బ్యాగులు వాడితే సమస్య చాలావరకు తగ్గుతుంది. రోడ్లపై చెత్తకుండీల వద్ద కూడా డంపింగ్ కవర్ బ్యాగ్స్ పెట్టడం మంచిది. చాలా చోట్ల డస్ట్ బిన్‌లు నిండిపోయి చెత్త రోడ్డుపైకి వచ్చేస్తుంది. చెత్తను తగ్గించేందుకు ఎవరికి వారు ప్రయత్నించడం మంచిది. కూరగాయలు, పండ్లు, ఉల్లిపాయలు తరిగాక వచ్చే వ్యర్థాలను ఇంట్లో మొక్కలకు ఎరువుగా వేయొచ్చు. ఇలా కొంత చెత్తని మనం ఇంట్లోనే అవసరానికి వాడుకుంటే, చెత్తని కొంతవరకైనా తగ్గించగలం. చెత్తను ఎంత మేరకు తగ్గిస్తే అంత శుభ్రత సాధ్యమని అందరూ గ్రహించాలి. ఇక పిల్లలకు చిన్నప్పటి నుంచే పరిశుభ్రత గురించి చెప్పాల్సిందే. స్కూల్లో అన్ని విషయాలు చెబుతారని ఆశించలేం. ఇంట్లో దేన్నయనా ఆచరిస్తే వీధిలో ఆచరించడం సులువు.
ఇలా గృహాలలోనే కాదు.. విద్య, వాణిజ్య, వ్యాపార సంస్థలలోనూ చెత్తని తగ్గించొచ్చు. అనవసరమైనవి తయారుచేసి అవి వాడకం జరగక- మళ్లీ పడేస్తున్నాం. ఉదాహరణకు మనం బ్యాంకు ఖాతా తెరిచినపుడు లేదా కళాశాలలో ప్రవేశం పొందినపుడు లేదా ఏ వస్తువైనా కొన్నప్పుడు పలురకాల బ్రోచర్స్, లీఫ్‌లెట్స్‌ని ముద్రించి పంచుతారు. నిజానికి వీటిని చదివే తీరిక ఎవరికీ ఉండదు. అదంతా చెత్త కిందే లెక్క. ఈ ఖర్చు మొత్తం వినియోగదారునిపైనే వేస్తారు. ఇలా చాలా సంస్థలు తమ వనరులను దుర్వినియోగ పరచడంతో చెత్త కూడా వృద్ధి చెందుతోంది. వినియోగదారులకు తగిన సమాచారాన్ని వెబ్‌సైట్ల ద్వారా అందిస్తే పలురకాల బ్రోచర్ల అవసరం ఉండదు. చెత్త సమస్య చిన్నదే అని భావించక, అందరిలోనూ అవగాహన పెరిగినపుడే పరిసరాలు కళకళలాడుతాయ.

Saturday, June 28, 2014

My Article "సవాళ్ల దారిలో సాధికారతే లక్ష్యం.." about DWCRA groups published in today's (28.06.14) Adhrabhoomi Daily in Bhoomika Main feature ~~ Rani Sandhya
 
Online Link: http://www.andhrabhoomi.net/content/main-feature-21

సవాళ్ల దారిలో సాధికారతే లక్ష్యం..

  • -రాణి సంధ్య
  • 28/06/2014
వాళ్లలో చదువుకున్నవారు తక్కువ... చదువుకోవాలనే ఆశ ఉన్నా అందుకు అవకాశం లేనివారు ఎక్కువ...
వారు కనీస వసతులు కోరుకోవటం కూడా అత్యాశే... బతుకు బండి నడిపేందుకు నిత్యం కాయకష్టం చేస్తూ వారు కాలంతో పోటీ పడుతుంటారు...
అయినా మాకేం తక్కువ? మేమూ లీడర్లమే..! అంటూ డ్వాక్రా సంఘాలను తమ శక్తికొలదీ చేయూతనిస్తూ ముందుకు నడిపిస్తున్నారు... వారంతా సాధారణ మహిళలే..!
హైదరాబాద్ నగరంలోని కర్మన్‌ఘాట్‌కు చెందిన డ్వాక్రా సంఘాల నేతలు 34 మంది ప్రతి నెలా క్రమం తప్పక కలుసుకుంటారు. అప్పులు, వడ్డీలు, వసూళ్లు ఇలా లెక్కలు చూసుకుని కష్టాలు చెప్పకుని భవిష్యత్ కార్యాచరణ గురించి వారు తీర్మానించుకుంటారు. ఒక్కొక్కరి కింద పదిమంది సభ్యులు కాగా మొత్తం 340 మందికి వారు నేతృత్వం వహిస్తున్నారు. 34 మంది నేతలకు ఏడేళ్లుగా ఇద్దరు మహిళలు దారిచూపిస్తున్నారు. వారే- గండ్లూరి జానకి, హనుమాయమ్మ. ఈ ఇద్దరి పర్యవేక్షణలో చెరి నలభై సంఘాలు ఉన్నాయి.
మహిళలంతా కలిసి ఒక ఆశయ సాధన కోసం కట్టుబడి ఉన్నారు. వారి సమయపాలన, సిద్ధాంతాలు అందరికీ ఆదర్శమే. వారి మీటింగుల్లో జిలుగువెలుగులుండవు, టైంపాస్ స్నేహాలుండవు, తినుబండారాలు, కాఫీ టిఫిన్లు అసలే వుండవు. వారు కలుసుకునేందుకు సొంత స్థలం కూడా లేదు. దగ్గరలో ఉన్న గుడి లేదా పార్కులో ఏడాదికోసారి వీరందరికీ వసతి కల్పించాలంటే పెద్ద కష్టం అంటున్నారు మహిళా నేతలు. హనుమాయమ్మ చదువుకోలేదు కానీ వ్యవహారం చేయగలదు. ఆమెకు గండ్లూరి జానకి చేయూతనిస్తూ గత ఏడేళ్లుగా కలిసి మెలిసి ఎనభై సంఘాలను నడిపిస్తున్నారు. జానకి చదువు, వ్యవహారం రెండింటిలోనూ మేటి. బ్యాంకు లావాదేవీలు చూసుకుంటూ, గ్రామసర్పంచ్‌తో కలిసి పనిచేస్తూ ఎన్ని సమస్యలు ఎదురైనా డ్వాక్రా సంఘాలను నడిపిస్తూ ఆనందాన్ని, తృప్తిని ఆస్వాదిస్తున్నారు.
దేశంలో 1982-83లో డ్వాక్రా సంఘాలు మొదలైనప్పటి నుంచి ఎంతోమంది మహిళలు బ్యాంకుల ద్వారా పావలా వడ్డీ రుణాలు పొందారు. ఎన్ని డ్వాక్రా సంఘాలు వెలిసినా వాటిలోని మహిళలకు గుర్తింపు తక్కువే. వారి ఆర్థిక స్థాయిలో కాని, జీవన విధానంలో కానీ పెద్దగా మార్పులు లేవు. ప్రభుత్వము చెప్పేదొకటి, చేసేదొకటి అనే మాటను నిజం చేస్తూ ఇప్పుడు పావలా వడ్డీ కాస్తా రూపాయి వడ్డీగా మారింది. సంఘాలు స్థాపించిన మొదట పావలా వడ్డీకే రుణాలిచ్చినా, తరువాత దాన్ని రూపాయి వడ్డీగా మార్చేసారని మహిళలు చెబుతున్నారు. తమకు రుణ మాఫీలు అక్కర్లేదని, పావలా వడ్డీకే రుణాలిస్తే చాలంటున్నారు మహిళా నేతలు. గండ్లూరి జానకి ‘క్రాంతి’ పేరుతో 2007న డ్వ్రాక్రా సంఘం స్థాపించగా, హనుమాయమ్మ ‘సమైక్య గణపతి’ పేరుతో స్థాపించారు. ఈ సంఘాలు రుణావసరాలున్న మహిళలను కష్టకాలంలో ఆదుకుంటున్నాయి.
నాయకత్వ లక్షణాలు నిజానికి ఎవరి సొంతం కాదు. చదువుకుని బట్టో, నడిపించే సంఘాన్ని బట్టో వాటిని నిర్ణయించలేము. ఈ సంఘాల్లో నియమ నిబంధనలు ఎంత ముఖ్యమో వీరు ఆచరించి చూపిస్తున్నారు. వార్షిక సభ్యత్వ రుసుము వంద రూపాయలే అయినా, సభకు ఆలస్యంగా వస్తే అపరాధ రుసుము వసూలు చేస్తూ, ఆ మొత్తాన్ని కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ఉపయోగిస్తున్నారు. సమాజ సేవ కూడా మిళితమైతే నలుగురికి సాయపడినట్టు ఉంటుందని, ఓ మహిళకు రెండు మూత్రపిండాలు పాడైపోతే ఆమెకి నగదు ఇచ్చి అవసరానికి ఆదుకున్నారు. తమ సమావేశాలకు వసతి కల్పిస్తున్న గుడికి ఐదు వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. జానకి ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను సంఘం సభ్యుల కోసం నిర్వహించారు. ప్రతి సమావేశంలో అందరూ తమను తాము పరిచయం చేసుకుని తమ గురించి తెలియజేయాలి. ఈ పద్ధతి నూతన సభ్యులకు చక్కటి అవగాహన కల్పిస్తుంది. పరస్పరం అభిప్రాయాలను పంచుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి నూతనోత్సాహాన్ని కలిగిస్తుందని వారి నమ్మకం.
డ్వాక్రా సంఘాలు మహిళల అభ్యున్నతికి చిహ్నంగా నిలుస్తున్నాయ. ఇవి చాలాకాలంగా పని చేస్తున్నా పూర్తి స్థాయలో మహిళల ఆర్థిక కష్టాలను నిలువరించలేకపోతున్నారు. మైక్రో ఫైనాన్సు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వృద్ధాప్య పెన్షను వంటివి కొంత చేయూతనిస్తున్నా ఇంకా ప్రగతి బాటకి వీరు దూరమే. నెలకి వంద పొదుపు చేస్తూ వీరు తమ ఆర్థిక భారాన్ని తామే బాధ్యతగా పంచుకుంటున్నారు. ఆర్థిక అవసరాలే వీరందరినీ ఒక్కటిగా కలిపింది, నిలిపింది. ఇంత చేసినా వీరికి తాగునీరు, సొంత ఇళ్లు వంటివి కలగానే మిగిలాయి.
ఒకరా ఇద్దరా..? 34 సంఘాలంటే 340 మంది సభ్యులు..! ఎవరైనా సరే తీసుకున్న అసలుకు ఒక్క నెలలో వడ్డీ ఎగ్గొడితే? అసలుకే ఎసురు వస్తే? పదుల సంఖ్యలో ఉన్నా ఫర్వాలేదు కానీ వందల సంఖ్యలో ఎగ్గొట్టేవారు ఉంటే సంఘాల పరిస్థితి ఏంటి? ఇలాంటి సంఘటనలు కూడా ఎదుర్కొన్నామని, మీటింగులకు రాని మహిళల ఇంటికి వెళ్లి వాకబు చేస్తే వారు ఊరు విడిచి వెళ్లినట్లు, లేదా అకస్మాత్తుగా కొందరు జబ్బు పడడం, రుణం తీసుకున్న మహిళ చనిపోవడం.. ఇంట్లో భర్త లేదా అత్తమామల సాధింపులు, అనుమానాలు.. ఇలా ఎన్నో సమస్యలు చూసామని, కొన్ని తమ పరిధిలో ఉన్నా లేకున్నా తామే బాధ్యత వహించాల్సిందేనని జానకి చెబుతున్నారు. గత ఏడేళ్లలో ఇలాంటి సవాళ్లనెన్నో ఎదుర్కొన్నామని, బ్యాంకులకు తామే జవాబుదారి అని అందుకే చాలా జాగ్రత్తగా సభ్యులని ఎన్నుకోవటం, వారి పూర్తి వివరాలు కనుక్కోవటం, ఎప్పుడైనా అనుకోని సమస్య వస్తే ఆర్థిక భారం ఎక్కువైనా భరించేలా తమని తాము ముందే సిద్ధం చేసుకుంటామని ఆమె చెప్పారు. ఈ బాధ్యత కేవలం సభ్యుల మధ్య మాట సర్దుబాటు వరకే పరిమితం. డ్వాక్రా సంఘాలు తామున్న ప్రాంతంలో డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ దీపాలు లాంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళతారు. పిల్లల చదువులు, వారికి ఉచితంగా పుస్తకాల పంపిణీ లాంటి సమాజ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాయి. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, బ్యాంకులు, డ్వాక్రా సంఘాల సభ్యులు ఇలా అందరూ కలిసి ఒకరికొకరు సహకరించుకుంటేనే అభివృద్ధి సాధ్యం. అభిప్రాయ భేదాలున్నా అవసరాలు వాటిని అధిగమించేలా చేస్తాయని ఈ మహిళలను చూసి అర్థం చేసుకోవచ్చు. ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా సభ్యులకు ఎలాంటి కష్టం రాకుండా చూడడం డ్వాక్రా నేతల ముఖ్యమైన బాధ్యత.
జాతిపిత మహాత్మాగాంధీ తన ఆత్మకథలో- ‘‘ఏ సంఘానికైనా తప్పులు లేని లెక్కలే ప్రాణం.. లెక్కలు సరిగా లేకపోతే సంఘానికి పెద్ద అపకీర్తి వస్తుంది. లెక్కల్ని సరిగాను, శుద్ధంగాను ఉంచకపోతే సత్యాన్ని రక్షించలేము’’ అని పేర్కొన్నారు. మరి అలాంటి లెక్కలు చూసే బాధ్యత డ్వాక్రా సంఘాల సభ్యులదే. ప్రతి సంఘంలో ముగ్గురు సభ్యులు ఈ లెక్కలు, జమాఖర్చులు రిజిస్టరు, సంరక్షణ, రుణాలు- వడ్డీలు చూసే బాధ్యతను తీసుకుంటారు. వీరు ఏ చిన్న తప్పు చేసినా ఆ తప్పును సంఘం సభ్యులందరూ పంచుకుని సరి చేయవలసిందే. నిజానికి ఈ సంఘాల నిర్వహణ ఒక వ్యాపార సంస్థను నడిపినట్టే లెక్క. ఈ బాధ్యత ఓ అకౌంటెంట్, ఓ వ్యాపారి చేసే పనికన్నా తక్కువేం కాదు.
డ్వాక్రా సంఘాల ద్వారా తాము గొప్పగా బాగుపడింది లేకున్నా, స్వశక్తిపై నమ్మకంతో ఏదో ఒకటి సాధించాలనే తపనతో, నలుగురికి సాయపడాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నారు వీరు. సంపన్న మహిళలు క్లబ్బుల చుట్టూ, పబ్బుల చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేస్తుంటే, వీరు మాత్రం ఆ డబ్బు కోసమే బృందాలుగా ఏర్పడి ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. ఈ మహిళలు నిజంగానే స్ఫూర్తి ప్రదాతలు. ముఖ్యంగా మధ్య తరగతి మహిళలకు వీరు ఎంతో ఆదర్శప్రాయులు. ఉచితంగా డబ్బు ఇస్తామని ఎర వేసి, ఎంతోమందిని నిలువునా ముంచేసిన మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల వైపు కాకుండా, ప్రభుత్వమిచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని నెమ్మదిగానైనా పురోగతిని సాధించే ప్రయ త్నం ఈ మహిళలది. వీరి అడుగులు చిన్నవే కానీ- చిరకాలం నిలిచిపోయే ఘన చరిత్రకు అవి గట్టి పునాదులు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు మరిన్ని సంక్షేమ పథకాలను, ప్రో త్సాహాలను ఇవ్వాల్సిన తరుణం ఇది.
 
 

Friday, May 9, 2014

My Article "Mundu Evaru Maaraali..." published in Andhrabhoomi Daily Bhoomika's Mainfeature on 08.05.14.

Online Link: http://www.andhrabhoomi.net/content/first-whos-change 

మేం మారితే సరిపోతుందా? మిగతావారి సంగతేంట’ని ప్రశ్నించేవారే గానీ
ఒక తప్పుని ప్రశ్నించేవారు తక్కువ. తప్పుకుని తిరిగేవారే ఎక్కువ. తాను కోల్పోయిందే పక్కవారూ కోల్పోవాలి, తాను పొందింది మాత్రం పక్కవారికి దక్కకూడదు అనే స్వార్థపూరిత ధోరణి మారనంతవరకు మనమింతేనా...?
,,,,,,,,,,,,,,,,,,,,,,,,
ఉదయం లేవగానే చూసిన ప్రతీది, చేసే ప్రతీది ‘మారాలి.. మారాలి..’ అని లేదా మార్చుకోవాలని రోజూ మనం పదే పదే కోరుకుంటాం. కానీ- అసలు ఏం మారాలో, ఎందుకు మారాలో తెలిసినా అమలు చేయలేని పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయనే సం దేహం వెంటాడుతుంది. ఉదాహరణకి అన్ని ప్రభు త్వ ఆసుపత్రుల్లో ‘మా సిబ్బంది ఎవరైనా మి మ్ములను డబ్బులు అడిగితే ఫలానా ఫోన్ నెంబరులో మమ్మల్ని సంప్రదించి మాకు తెలి యపరచగలరు’ అనే ప్రకటన కనపిస్తుంది. నిజానికి ఎంతమంది ఆ ప్రకటన చదివి అమలు పరుస్తారు? అది చూసిన తరువాత కూడా సిబ్బంది డబ్బులు అడగడం, సామాన్యులైనా, సంపన్నులైనా, ఇంకెవరైనా సరే కళ్లు మూసుకుని డబ్బులిచ్చేస్తాం. ‘సిబ్బందికి డబ్బులివ్వకపోతే వారు జబ్బు పడిన మా అమ్మాయిని సరిగా చూడరు, పిలిచిన ప్రతిసారీ విసుక్కుంటారు, పైవారికి చెబితే ఇంకా కోపంతో అసలు పట్టించుకోరు, ఉన్న నాలుగు రోజులు వారు మాకు సహకరించాలంటే ఇలా చాయ్ పైసలు ఇవ్వాల్సిందే, తప్పదు’- అని ఓ తల్లి బాధపడుతుంది. ఇలాంటి వారు ఇంకా పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్నా ‘చేతి చమురు’ వదిలించుకోక తప్పదు. మారాలని కోరుకునే సామాన్య జనమే మార్పుకి భయపడుతుంటే- ఇక మార్పు ఎలా సాధ్యం?
రోజూ మనం రోడ్డుపై అడుక్కునేవారిని చూ స్తుంటాం. అసలు వీరికి ప్రభుత్వం ఎన్నో ఆశ్రమాలు నిర్మించి, వసతులు కల్పించినా వారు అక్కడ ఉండడానికి నిరాకరిస్తారు, స్వతంత్ర జీవనానికి అల వాటుపడ్డవాళ్లు అక్కడ ఉండలేక మళ్లీ అడుక్కుంటూనే సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. అడుక్కోవడం తప్పని తెలిసినా వారు మానడం లేదు. పైగా అడుక్కునే ముసుగులో ఎందరో సంపాదనపరులున్నారు, దం దాలు చేసేవారు ఉన్నారు. అడుక్కోవడం కూడా ఒక వ్యాపారం కావడానికి పరోక్షంగా మనమే కారణం అని తెలిసినా సరే కొందరు సానుభూతితో డబ్బు వేస్తారు, కొందరు తమ డాబు చూపించుకోవడానికి వేస్తారు. ఇలాంటి పరిస్థితులలో ఎవరు ముందు మారాలి? అనే ప్రశ్న అందరినీ వెంటాడుతూనే ఉంటుంది. రాను రాను ఫిర్యాదు చేసేవారు కూడా కరవవుతారేమో! అసలు మారాలి, మార్పు రావాలి అనే తపన చచ్చిపోయి, మారినా, మారకపోయినా ఫరవాలేదు అనే స్థితికి సమాజం మారిపోతుందేమో?
ఆ మధ్య టీవీలో ప్రసారమైన ‘సత్యమేవ జయతే- 2’లో ఒక అధికారి మాట్లాడుతూ, హర్యానాలో పోలీసులకు ఫోన్‌కాల్ ద్వారా అందే ఫిర్యాదుల సంఖ్య ‘సున్నా’ అని, అదే కేరళలో రోజుకు వంద చొప్పున నెలకు ముప్ఫైవేలుగా చెప్పుకొచ్చారు. పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యే నేరాల సంఖ్య కేరళలో లక్ష కాగా, హర్యానాలో సున్నా. ఇలాంటి సంగతులు విన్న తరువాత అసలు ప్రజలకు ఈ వ్యవస్థపై ఎంత నమ్మకం ఉందో అంచనా వేయొచ్చు. అసలు ఫిర్యాదు ఇవ్వడమే వృథా అనే భావనలో అందరం ఉన్నామని నమ్మాల్సిందే. ఫిర్యాదు ఇచ్చి సమయం వృథా చేసుకునేకన్నా సర్దుకుపోయి పని జరిగేలా చూసుకోవడం మంచిదని, అందుకు అవసమైతే కొంత డబ్బు ఖర్చైనా ఫర్వాలేదని అందరూ భావిస్తున్నారు.
కొత్తగా అరంగేట్రం చేస్తున్న ఒక రాజకీయ నాయకుడు అతని బాధ ఇలా చెప్పుకున్నాడు- ‘అసలు ఓటు వేయడానికి నోటు ఇవ్వడం మాకు సరదానా? మా దగ్గర నిజంగా అంత డబ్బు లేదు. అప్పు చేసి మరీ పంచుతున్నాం. ఓటరుని మెప్పించడానికి ఇంతకన్నా వేరే మార్గం లేదు’’ అని. ఇదే ప్రశ్న ఓటరుని అడిగితే ‘‘ఎవరికి ఓటు వేసినా ఇంతే, అంతా రాజకీయాలకొచ్చి సంపాదించుకుంటారు తప్ప సమాజానికి చేసేది ఏమీ లేదు. అందుకే ఓటుమీద ఆసక్తి, నమ్మకం రెండూ లేవు. ఇక వారు ఇచ్చే డబ్బు మాకు చిన్న ఆశ, ఆసరా’’ అని.
ఒక పనిమనిషిని ‘‘నువ్వెందుకు నాలుగు రోజులు పనికి రాలేదు’’ అని అడిగితే, ‘‘మా ఊరిలో ఎన్నికల సభకు వెళ్తున్నా, దారి ఖర్చులు, భోజనం అన్నీ వారే ఇస్తారు’’ అంది. మరి ఇక్కడ పని పోతుంది కదా, నీ జీతం నాలుగు రోజులు కూడా రాదు అంటే- ‘‘్ఫర్వాలేదు.. వాళ్లు ఇచ్చే పైసలుకన్నా నా నాలుగు రోజుల జీతం చాలా తక్కువ అంది. పైగా పని పోతే ఇంకో ఇల్లు వెతుక్కుంటా, నాకేం..!’’ అంది ధీమాగా. ఇక్కడ ముందు ఎవరు మారాలి? ఓటరా?? నాయకుడా? వ్యవస్థా? అసలు చట్టాన్ని కానీ, నిబంధనలని కానీ పాటించాలనే తపన ఎంతమందికి ఉంది? ఒక నిబంధన మనకు అనుకూలంగా లేకపోతే, దానివల్ల పొందే లాభం లేకపోతే ఆ నిబంధనని ఉల్లంఘించడానికి అందరం ముందే ఉంటాం. మాటల్లో చెప్పే నీతి చేతల్లో చూపలేని వారెందరో. అలాగే, తాము చేసేది ప్రజాసేవ అని మనలను నమ్మించేవారు ఎందరో. ఎవరి సమస్యలు వారివి, ఎవరి చెల్లుబాటు వారిది. ఇదే సమస్యకు మూలకారణం అని చెప్పలేం. సమస్యకు ఇదే పరిష్కారం అనీ చెప్పలేము. మొత్తంగా మనం తీసుకున్న గోతిలో మనమే పడి లేవలేక, లేపేవారిని కూడా అందులోకి లాగి అందులోనే కొట్టుకుంటున్నాము. ప్రతి మనిషీ పరిపూర్ణంగా మారిన రోజు మన వ్యవస్థ కూడా మారుతుంది.
దట్టమైన అడవిలో దొడ్డిదారులెన్నో, కాదీ ముందు ఏది అంటే కనుక్కోవటం కొంచెం కష్టమే. రహదారి కనుక్కోవటమే కష్టం, మరి అసలైన దొడ్డిదారి ఎలా కనుక్కోవటం? రాజకీయాలలో దారిని కనుక్కోవటం కూడా అంతే కష్టం. వ్యవస్థే మనిషిని విడదీసి వేరుగా చూస్తుంటే ఇక మనిషి మరో మనిషిని తోడుగా ఎలా చూస్తాడు? మనిషికి మనిషికి అడ్డుగోడ ఈ వ్యవస్థే! వ్యవస్థని మార్చాలని ప్రయత్నించి మనిషి మారిపోతున్నాడు. మనిషిని మార్చాలని తాపత్రయపడి వ్యవస్థ మారిపోతుంది. మనిషి, వ్యవస్థ ఒకేలా ఆలోచించి రెండూ కలిసి పని చేయాల్సింది పోయి విడివిడిగా ఆలోచిస్తూ కలిసి ఓడిపోతున్నాయి.
దయలేని దరిద్రం రమ్మని పిలుస్తుంటే ఎవరికి మాత్రం ఇష్టం? ప్రతీది డబ్బుతో ముడిపడి ఉన్నప్పుడు, దళారీలు నడుపుతున్న దందాలకు మంచితనం, మానవత్వం, నీతి, నిజాయితీ దాసోహం అంటున్నాయి. అడ్డదారులే దొడ్డిదారులే రహ దారులుగా చెలామణి అవుతున్నాయి, రాజ్యమే లు తున్నాయి. కోడిపిల్ల ముందా? గుడ్డు ముందా? అంటే చెప్పడం ఎంత కష్టమో అలాగే ముందు సగటు మనిషి మారాలా వ్యవస్థ మారాలా అంటే చెప్పడం కూడా అంతే కష్టం. ఒక మహా సముద్రం ఎక్కడ ఎలా పుట్టిందో, దాని లోతు ఎంతో మన నిపుణులు తేల్చగలరేమో గాని సమాజానికి చేటు చేసే తప్పు, నిర్లక్ష్యం, ఎపుడు ఎక్కడ మొదలయ్యాయో మాత్రం చెప్పలేరు. ‘మేము మారితే సరిపోతుందా? మిగతావారి సంగతేంట’ని ప్రశ్నించేవారే గానీ ఒక తప్పుని ప్రశ్నిం చేవారు తక్కువ, తప్పుకుని తిరిగేవారే ఎక్కువ. తాను కోల్పోయిందే పక్కవారూ కోల్పోవాలి, తాను పొందింది మాత్రం పక్కవారికి దక్కకూడదు అనే స్వార్థపూరిత ధోరణి మారనంతవరకు మనమింతేనా..?


Wednesday, February 5, 2014

My Article "Avamaanaalaku aatmahatye sharanyama....!" published in Today's (01.02.14) Andhrabhoomi Daily in Bhoomika~~ Rani Sandhya


అవమానాలకు ఆత్మహత్యే శరణ్యమా??
-రాణీ సంధ్య  01/02/2014


 కొంతమంది మనని అవమానించినా భరించగలం కాని కొంతమంది అవమానిస్తే తట్టుకోలేం. మరికొందరి విషయంలోనైతే అవమానిస్తారేమో అనే భావనే వారిని కృంగదీస్తుంది.
చిన్న చిన్న కారణాలు హత్యలకు, ఆత్మహత్యలకు దారి తీయడం మనం రోజూ వార్తలలో చూస్తు న్నాం. అయ్యో అని ఆశ్చర్యపోతూ అందరిలో అధైర్యాన్ని నూరిపోస్తున్నాం. సినీతారల నుండి సామాన్యుల వరకు రైతుల నుండి రాజకీయ నాయకుల వర కు ఆలోచనలేని అదుపు చేయలేని నిర్ణయాలు తీసుకునేలా మానసిక దృఢత్వాన్ని కోల్పోతున్నారు. జియాఖాన్, నఫిసా జోసెఫ్, సిల్క్ స్మిత, ఉదయ్‌కిరణ్ వంటివాళ్ళు మానసిక సమతుల్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నా, దివ్యభారతి ప్రత్యూష, సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి అయినా, వారి ప్రాణార్పణకు ముఖ్య కారణాలు మానవ సంబంధాల మాధు ర్యం కోల్పోవటమే అని అందరికీ తెలుసు. విపి సత్యన్ అనే ఫుట్‌బాల్ ఆటగాడు కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా రైలు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నా, ప్రమోద్ మహాజన్‌ని సొంత సోదరుడే హత్య చేసినా ఇలాంటి ఘటనల వెనుక మానవ సంబంధాల విలువలు తగ్గిపోవడం ముఖ్య కారణమే.

డాక్టర్స్ ఇన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా అండ్ కెనడా వారు నిర్వహించిన అధ్యయనంలో భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకునేవారు అధిక శాతం యువతీ యువకులే అని తేల్చింది. 2010వ సంవత్సరంలో 1,87,000 మంది భారతీయులు ఆత్మహత్యలతో చనిపోగా అందులో 40 శాతం మగవారు, 59 శాతం ఆడవారు కాగా వీరు అందరూ 15 నుండి 29 సంవత్సరాలలోపు వారే అవడం గమనార్హం.

ఇక రైతులు, నిరుద్యోగులు, విద్యావంతులు కూడా ఏదో ఒక కారణంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2004లో బ్రిటీష్ మెడికల్ జర్నల్ ‘లానె్సట్’లో ప్రపంచానికి ‘దక్షిణ భారతదేశం’ ఆత్మహత్యల రాజధాని అని ప్రచురించారు. అందుకు కారణాలు వారు చేసిన సర్వేలు. అత్యుత్తమ విద్యార్థులకు నెలవైన కేరళ వంటి రాష్ట్రంలో కూడా రోజుకు 30 మంది యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడతారని తెలియడమే. ఆంధ్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరిలలో ప్రతి సంవత్సరం 50వేలమంది ఆత్మహత్యలతో చనిపోతున్నారని పేర్కొంది. ఈ పది సంవత్సరాలలో పై సంఖ్యలు గణనీయంగా పెరగటం సాధ్యమే.
ఎలాంటి సమస్య ఉన్న మనను ఆదుకునేవారు ఉన్నారు, మనని ప్రేమించి మన కోసం బ్రతికేవారు ఉన్నారు అనే భావన చాలు మనిషికి జీవితంపై ఆశలు చిగురింపజేయడానికి. మనిషిని కాకుండా డబ్బుని మాత్రమే కోరుకుంటున్నారనే చిన్న విష బీజం చాలు అతి తక్కువ కాలంలో మహావృక్షమై మనసుని చంపేసి మనిషిని మింగేస్తుంది. మనని మనం ప్రేమించుకుంటూ బ్రతికేయటం అనే పద్ధతి అందరికీ వర్తించదు. అందరూ ఒకే స్వభావం కలిగి ఉండరు.

ఆత్మహత్యలకు లేదా హత్యలకు మూలకారణాలు వెతికినపుడు మనం తరచూ వినేది ‘వత్తిడి’. వృత్తి, ఉద్యోగం, వ్యక్తిగత జీవితాలలో సమన్వయ లోపంతో ఒత్తిడి, విద్యార్థులలో పరీక్షలూ, మార్కుల భయంతో ఒత్తిడి, లాభనష్టాల ఒత్తిడి, సమాజంలో పరువు - మర్యాద, గౌర వం సంపాదించడంలో వత్తిడి, ప్రేమ పెళ్లి వ్యవహారంలో గెలుపు ఓటమి వత్తిడి. ఇలా చెప్పుకుం టూ పోతే అసలు వత్తిడి సవాళ్లు లేని జీవితం ఎవరికి ఉండదు?? కాని అసలు కారణం నిజంగా ఒత్తిడి అని సరిపెట్టుకోగలమా? ఎంత ఒత్తిడి ఉన్నా మనని ప్రేమించే వారి చిరునవ్వు, ఒక తియ్యని పలకరింపు మనలో వెయ్యి ఏనుగుల బలాన్ని నింపుతుంది, ఎలాంటి ఒత్తిడిని అయినా దూదిలా తేలికపరుస్తుంది. మన చుట్టూ ఉన్నవారు అలాంటి తియ్యని వ్యక్తులే అయితే అసలు ఏ ఒత్తిడి మనని ఏమీ చేయలేదు. అయితే దురదృష్టశాత్తు ప్రతి మనిషికీ డబ్బు, పేరు ప్రఖ్యతులు ప్రాముఖ్యం అయిపోయి మనసులేని రాతి బొమ్మలుగా మారిపోతున్నారు. అవమానం, ప్రతీకారం అనే పదాలు కూడా సిగ్గుపడేలా మనుషులు ప్రవర్తిస్తున్నారు.

మనం ఒత్తిడిలో ఉన్నాం అనే విషయం విచిత్రంగా మనకే ముందు తెలుస్తుంది. అప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం సినిమాలు, స్నేహితులు, షికారులు ఒత్తిడిని దూరం చేయలేవు. మన కష్టం ఏంటో, దానికి పరిష్కారం ఏంటో, ప్రత్యామ్నాయం ఏంటో మనమే పదాల రూపంలో రాసి చదువుకోవాలి. ప్రతిరోజూ అలా చేయడంవలన ఒత్తిడి తగ్గి నిజాన్ని స్వీకరించే గుణం మెల్లమెల్లగా అలవడుతుంది. అహానికి పోకుండా మనని ఇష్టపడేవారితో స్నేహపూర్వకంగా మాట్లాడడం సంతోషంగా గడపగడం అలవర్చుకోవాలి. అన్నిటికీ మించి అసూయాద్వేషాలకు తావు లేకుండా, ఎదుటివారిని అవమానించడానికి స్వస్తి చెప్పాలి. వృత్తిరీత్యా అందరు కలిసి పనిచేస్తున్నప్పుడు కలిసిమెలిసి జీవితం కొనసాగిస్తున్నప్పుడు, అందరూ పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఎదుటివారు చెప్పింది వినటానికి సమయం కేటాయిస్తే చాలు, మీరు వారి సమస్య తీర్చకున్నా, వారి మనసులోని భారం దిగిపోతుంది, అదే సగం రోగం నయం చేస్తుంది. కాని ఇక్కడి విషయాలు అక్కడ, అక్కడి విషయాలు మరెక్కడికో మోయకుండా ఉండే స్నేహితులని ఎంచుకోండి చాలు. ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే మనమే స్వయంగా చెప్పడం చాలా అవసరం. ప్రతిదానికి మధ్యవర్తిని ఉపయోగించడంవలన బంధం మీద నమ్మకంపోయి, స్నేహం విడిపోవడానికే ఎక్కువ ఆస్కారం.

ఇలాంటి చేదు అనుభవాలు రెండు మూడు తగిలితే చాలు, ఎవరికైనా జీవితంమీద విరక్తి కలుగుతుంది. అందుకే ఈ రోజుల్లో కుటుంబ పాత్ర చాలా ఉంది. ఎలాంటి పరిస్థితులలో అయినా మేమున్నామనే భరోసా అవసరం. స్నేహం ప్రాధాన్యత ఎంతో కుటుంబం ప్రాధాన్యత కూడా అంతే. నేడు ప్రతి ఒక్కరూ మానవీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసూయాద్వేషాలే మనిషిని మృగంగా మార్చేస్తున్నాయి. మన జీవితాల్లో డబ్బు ప్రాధాన్యత తగ్గించి, త్యాగగుణం అలవర్చుకుంటే అసలు సమస్యలు మన చుట్టూ ఉన్నా మనకు తెలియకుండానే మాయం అయిపోతాయి. పోటీతత్త్వం ఉండాలి కాని అది మన ప్రాణం తీసేంతగా మాయ చేయకూడదు.
ఎన్ని గొడవలున్నా రక్తసంబంధీకులు కలిసి ఉంటే ఆ తోడు ఏ స్నేహానికైనా మంచిందే. అందుకే వౌనం వీడండి, వౌనంతో అవతలివారు ఎక్కువగా ఊహించుకోవడం, భయపడడం, ఆలోచనలేని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. వాదనకు చర్చకు అవకాశం ఇవ్వద్దు అనుకుంటే అవతలివారి కోసం కొంచెం తగ్గి వారికి ఏం కావాలో అది చేయలేకున్నా నీ కోసం కాబట్టి ఈ మాత్రం చేయగలను అన్నా చాలు, వారు సంతోషిస్తారు. ఆ చిన్న మాటే నమ్మకం అవుతుంది. నా కోసం ఒకరు ఉన్నారు అనే నమ్మకాన్ని పెంచుతుంది. వారికి జీవితంపై ఆశ కలిగిస్తుంది.

Thursday, January 23, 2014

My Article "Shramadanam...Vellivirise chaitanyam...!" published in Today's (07.01.14) Andhrabhoomi Daily in Bhoomika~~ Rani Sandhya

శ్రమదానం.. వెల్లివిరిసే చైతన్యం
-రాణి సంధ్య 07/01/2014

Online Link: http://www.andhrabhoomi.net/content/shrama
...
రోజూ లక్షలాదిమంది హైదరాబాద్ నగర రోడ్లపై ప్రయాణిస్తుంటారు. కాని మనకెవ్వరికి రోడ్డుపై ఉన్న గుంతలు పెద్ద ఇబ్బందిగా అనిపించదు, అసలు వాటివలన దారినపోయేవాళ్లకి కలిగే ఇబ్బంది, జరిగే ప్రమాదాలు కనిపించవు. మామూలుగా గుంతలు ప్రమాదాలకి హేతువుగా మారుతుంటే వర్షపునీరు నిండి అవి మృత్యువు ఒడికి చేరుస్తున్నాయి.

అసలు ఈ గుంతలు పూడ్చి ప్రమాదాలను ఆపేస్తే??- ఈ ఆలోచన ఓ వ్యక్తిని చైతన్యపరిచింది. ముందుకి నడిపించింది. రైల్వే ఉద్యోగిగా విరమణ పొందాక తిరిగి ఇన్ఫోటెక్‌లో ఉద్యోగరీత్యా హైదరాబాదు వచ్చారు కాట్నం బాలగంగాధర తిలక్. ఉద్యోగంలో చేరడానికి వెళ్తున్న మొదటి రోజే ఆయనకు హైదరాబాదు రోడ్లు తమ గజిబిజి గతుకుల ప్రతాపాన్ని చవి చూపించాయి. హైదర్షాకోట్ సమీపంలో వర్షంనీరు నిండిన గుంతలతో స్వాగతం పలికాయి. సర్దుకుపోయే లోపే పక్కనే వెళ్తున్న బడి పిల్లలపై బురద నీరు చిమ్మడంతో పాపం వాళ్లు బిక్క మొహాలు వేసి సిగ్గుతో అక్కడినుంచి పరుగు తీశారు. ఈ సంఘటన ఆయన్ని చాలా బాధించింది. అదే రోజు గతుకుల రోడ్డు మూలంగానే ఇద్దరు యువకులు ప్రమాదానికిగురి అవ్వడం ఆయన్ని మరింత కృంగదీసింది. ఆ రోజే ఆయన దృఢంగా నిర్ణయించుకున్నారు- ఈ గుంతలని తానే స్వయంగా పూడ్చాలని. దాంతో తర్వాత రోజు పదివేలుపట్టి స్వయంగా ఆరు లారీల మొరం (మట్టి) తెప్పించి 300 ఎంటిఎస్ రోడ్డు మొత్తం గుంతలు పూడ్చారు. అది చూసి బడి పిల్లలు సంతోషంతో ధన్యవాదాలు తెలపడం ఆయనకు చాలా తృప్తిని, విశ్వాసాన్ని కలిగించింది.
ఈ సంఘటన జరిగి నాలుగేళ్లు గడిచింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్విరామంగా ఎక్కడ ఏ రోడ్డుపైన గుంతలు కనిపించగానే ఒక పార, పలుగు, రెండు గంపలు, గన్నీ బ్యాగులలో మిక్స్చరు కారులో తీసుకుని వెళ్లి తన భార్య సహాయంతో గుంతలు పూడ్చేవారు.

లక్ష రూపాయల జీతంతో చేసే ఉద్యోగం కూడా ఆయనకు ఈ సేవను మించిన సంతృప్తిని ఇవ్వలేదు. దాంతో తన సమయాన్ని మొత్తం శ్రమదానానికే కేటాయించడానికి నిర్ణయించుకుని ఉద్యోగం వదిలేసి తనకొచ్చే పెన్షన్ డబ్బుతో నిర్వహించారు. మొదటి రెండేళ్ళు తన సొంత డబ్బుతో గడిచినా, మెల్లమెల్లగా డబ్బుకు ఇబ్బందవ్వడంతో రోడ్డు ప్రక్కన మున్సిపాలిటీ వారి లారీలోంచి డాంబరు మిక్స్చరు తీసుకెళ్లడం, వారు అడ్డుకోవడం, తరువాత కమిషనర్ సహాయంతో రెండేళ్లుగా సాఫీగా నిర్వహించారు. అయితే ఈమధ్యే కమిషనరు మారటం, కొత్త కమిషనర్‌కూడా తనకు సహాయం కొనసాగిస్తాననడం తనకు చాలా ఆనందం కలిగించిందని చెప్పారు తిలక్. తనకంటూ ఒక సహాయ బృందం కూడా లేకుండా ఇప్పటివరకు దిల్‌సుక్‌నగర్, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, మలక్‌పేట, రాయదుర్గం, మెహదీపట్నం, నానక్‌రాంగూడా, బోయిన్‌పల్లి, సనత్‌నగర్, బాలానగర్, ఇలా నగరమంతా తిరిగి నాలుగేళ్లలో మొత్తం 762 గుంతలు పూడ్చారు. మొదట్లో తను ఒక్కడే వెళ్లి ఇలా చేయడం ప్రజలు వింతగా చూసే వారని, ఎవరో మున్సిపాలిటీ వ్యక్తీ అనుకోని పట్టించుకునేవారు కాదని, సహాయానికి కూడా ముందుకొచ్చేవారు కాదని తెలిపారు. కొంచెం లోతుగా ఆలోచించగా తానూ చేస్తుంది తనకే తెలుస్తుంది కాని మిగతావారికి అర్థం కావట్లేదు అని గమనించి ‘శ్రమదానం’ అనే బోర్డు పెట్టడంతో ప్రజలు బాగా స్పందించి తనతోపాటు శ్రమిస్తున్నారని, వారిలో ఆడ మగ చిన్నా పెద్దా తేడా లేకుండా, చదువుతో సంబంధం లేకుండా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నుంచి రోజు కూలీల వరకు ప్రతి ఒక్కరు ఇప్పుడు ముందుకొచ్చి శ్రమదానంలో పాల్గొంటున్నారని వివరించారు తిలక్.

తనకు ఎవరూ సహాయానికి రాని సమయంలో ఆ దేవుడే మనిషి రూపంలో వచ్చి సాయపడ్డాడని ప్రగాఢంగా విశ్వసిస్తారు తిలక్. ఒక రోజు ఎవరు లేక తను ఒంటరిగా రోడ్డు పూడుస్తున్నప్పుడు, పైగా అత్యవసరంగా పెళ్లికి కూడా వెళ్లాల్సిన సమయంలో ఇద్దరు వ్యక్తులు తమకు తాముగా వచ్చి సాయపడ్డారని, అందువలన తన పని చాలా సులువుగా, తొందరగా అయిపోయిందని, వారు వెళ్తున్నప్పుడు పేర్లు అడగగా ఒకరు బసవయ్యా అని ఇంకొకరు శివయ్యా అని, పైగా మేము ఒకే చోట నివసిస్తామని చెప్పటంతో తానూ చాలా ఆశ్చర్యపోయానని, ఈ సంఘటనతో తనలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపిందని, తానూ నిర్విరామంగా కృషి చేయడానికి అదే కారణం అని చెప్పారు.

తల్లిదండ్రులు లోకమాన్యుడి పేరు పెట్టగా ఆ పేరుని ఆయన నిజంగానే సార్థకం చేసుకున్నారు. అరవై ఐదు ఏళ్ళు నిండినా కూడా ఆయన చురుకుగా నవ యువకుడిలా పనిచేస్తారు. అదే ఉత్సాహం అదే సామర్థ్యం అదే నిరాడంబరత. తానూ చేసిన సేవకు గుర్తింపుగా 2013లో ప్రభుత్వం నుండి ఉగాది పురస్కారం, జస్టిస్ చంద్రశేఖర్‌గారి చేతుల మీదుగా సన్మానం పొందారు.

ముంబై పూనె వంటి నగరాల్లో గుంతలు ఏర్పడితే ఫిర్యాదు చేయడానికి హెల్ప్‌లైన్లు ఉన్నాయి. హైదరాబాదుకి ఆ సౌకర్యం లేదు కాని తిలక్ గారికి ఫోన్ చేసినా ఈమెయిల్ చేసినా ఆయన వెంటనే స్పందిస్తారు. ఎంతదూరమైనా ప్రయాణించి గుంతలు పూడుస్తారు. ‘‘దేశానికి యువత మూలాధారం, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కూలీ అయినా ఉద్యోగి అయినా వ్యాపారస్తుడైనా వారి వారి కుటుంబాలను పోషించుకుంటూ దేశంపై భారాన్ని తగ్గిస్తున్నారు, దేశానికి ఆదాయం పెంపొందిస్తున్నారు. వారిని రక్షించుకోవాలి’’- ఇదే ఆయన లక్ష్యం!

Tuesday, November 12, 2013

My Article "Jorugaa Hushaarugaa Saagipodamaa...!" published in Today's (12.11.13) Andhrabhoomi Daily in Bhoomika~~ Rani Sandhya

To Read Online follow this Link : http://www.andhrabhoomi.net/content/j-63


జోరుగా..హుషారుగా సాగిపోదమా..

  • -రాణి సంధ్య
  • 12/11/2013
మెట్రో రైలుపుణ్యమా అని కాల చక్రం తిరుగుతూ తిరుగుతూ తొక్కుడుబండికి కలిసొచ్చే కాలాన్ని తీసుకొచ్చినట్టుంది! ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రులు, ముఖ్యంగా తాతయ్యలు నాన్నలు విశేషంగా చెప్పుకుంటుంటారు ‘మా రోజుల్లో మా ఊరి నుంచి పక్క ఊరి బడికి లేదా చుట్టుపక్కల నలభయ్ యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి సైకిల్ తొక్కుతూ వెళ్లివచ్చేవాళ్లం’’ అని. ఇప్పటితరం కార్లలో తిరగడం ఎంత గొప్ప అనుభవంగా భావిస్తున్నారో వెనకటి తరం వారు సైకిల్ తొక్కడం కూడా అంత గొప్ప అనుభవంగా భావిస్తారు. రోడ్లుకూడా సరిగా లేనప్పుడు సైకిల్‌పై ఏకంగా ఊర్లే తిరిగినవారు, నేడు కార్లలో తిరిగి కూడా ఆ రోజుల్లో సైకిల్‌పై తిరిగిన ఆ మజానే వేరు అని చెప్పుకుంటారు. ఆ కాలం వారు ఏ వయస్సులో చేయాల్సిన ముచ్చట్లు ఆ వయసులో చేసారు. వాటిని పదిలంగా దాచుకున్నారు. ఇప్పటి పిల్లలకు సైకిల్ తొక్కడం అంటేనే ఒక బాధ, భయము. మన రోడ్లు, వాహనాల రద్దీ చూసి తల్లిదండ్రులు కూడా పిల్లలకు సైకిల్ ఇవ్వడంపై ఎక్కువ మక్కు చూపించడంలేదు. వారు వీరు, వీరు వారు అయ్యారు అని ఊరికే అనలేదు పెద్దలు. పిల్లలకు సైకిల్ స్థానంలో బుల్లికార్లు వచ్చేసాయి. ఇక యుక్తవయస్సు వారు, నడి వయస్కులు సైకిల్ తొక్కే రోజులు వచ్చేసాయి.
ఈ వాహనాల రద్దీ, కాలుష్యం తప్పించుకోవడానికి, అలాగే ఇంధనాన్ని పొదుపు చేయడానికి ముఖ్యంగా ఐటి నిపుణులు సమయాన్ని, డబ్బుని ఆదా చేయడానికి, ప్రయాణ వ్యయ ప్రయాసలు తగ్గించుకోవటానికి మెట్రో రైలు కోసం ఎదురుచూస్తున్నారు. మరి వారు స్టేషన్లో రైలు బండి దిగగానే ఉద్యోగ స్థలానికి వెళ్లాలన్నా తిరిగి రైలు స్టేషన్‌కి రావాలన్నా మళ్లీ ఏ ఆటోనో ఆశ్రయించాలి.
నిజంగా ఇది చాలా మంచి ప్రయత్నం అనే చెప్పాలి. అందరూ ఇష్టపడతారని చెప్పలేము. అలాగే కొందరికి ఇష్టం ఉన్నా వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా సైకిల్ తొక్కలేకపోవచ్చు. ఉద్యోగం అనగానే ఒక దర్జా, ఒక అధికార దర్పం ఉంటుంది. మరి సైకిల్ తొక్కుతూ ఉద్యోగానికి వెళ్లటం అంటే కొంతమందికి నామూషిగా కూడా అనిపించవచ్చు. కార్ పూలింగ్ అనే ఒక పద్ధతి ఎప్పటినుంచోన్నా, ఆది ఆచరణలో ఎవరూ పెట్టలేదు, ఆసక్తి చూపలేదు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఒక్కో వాహనం. ఇంట్లో నలుగురు ఉంటే నాలుగు వాహనాలు తప్పని పరిస్థితి. మరి రోడ్డుపై వాహనాల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగి అవసరాన్ని మించిపోయి భరించలేని సమస్యగా తయారయింది. వాహనాల రద్దీ కాలుష్యం వెదజల్లుతూ ఆరోగ్యంతోబాటు సమయాన్ని, సహనాన్ని, డబ్బుని హరించి వేస్తుంది. ఇది విపరీత పరిస్థితుల్ని స్పృశించి ప్రమాదాలకు దారితీస్తుంది.
ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చౌకగా ఉద్యోగస్తుల సౌకర్యం కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి), హైదరాబాద్ బైసికిలింగ్ క్లబ్ (హెచ్‌బిసి) సంయుక్తంగా గచ్చిబౌలిలో సెప్టెంబర్ 28, 2013న బైక్ స్టేషన్‌ని ఆరంభించారు. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక బైక్ స్టేషన్ భవనాన్ని నిర్మించగా, హైదరాబాద్ బైసికిలింగ్ క్లబ్ (హెచ్‌బిసి) ఈ స్టేషన్‌ని ఎటువంటి లాభాన్ని ఆశించకుండా నిర్వహించడానికి ముందుకొచ్చింది. హైదరాబాద్ మెట్రోరైలు (హెచ్‌ఎంఆర్)వారు 300 బైసికిళ్లు తమ వంతు సాయంగా అందించారు. అలాగే ఎపి ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేష్ వారు ఐటి కంపెనీ జోన్ల కోసం మొత్తం 60 కి.మీ సైకిల్ ట్రాక్‌ని, సైకిళ్లు తొక్కటానికి ఎనిమిది ట్రాక్‌లుగా రూపొందించి, 40 కి.మీ ట్రాక్‌ని ఉచితంగా నిర్మించి వారి తోడ్పటుని అందిస్తున్నారు.
ముందుముందు ఈ బైక్ స్టేషన్లో అన్ని హంగులు ఉంటాయి. ప్రతి మెట్రో రైలు స్టేషన్‌లో ఒక బైకు స్టేషన్ నిర్వహించేలా, అలాగే ఏ స్టేషన్లోనైనా సైకిలు తీసుకుని, ఏ స్టేషన్లోనైనా తిరిగి ఇచ్చే విధంగా ఏర్పాట్లు ఉంటాయి. సైకిళ్లు తీసుకోవడానికి కార్డ్ స్వైపింగ్ టెక్నాలజీ, రెస్ట్‌రూములు, ఛేంజింగ్ రూములు, ఫుడ్ కోర్టులు, ఇంకా ఎన్నో సదుపాయాలను ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా వీలు కల్పిస్తున్నారు. ప్రయాణీకులు రైలుబండి దిగగానే అక్కడ బైకు స్టేషన్లోకి సైకిలు అద్దెకు తీసుకుని ఉద్యోగ స్థలానికి వెళ్లి తిరిగి రైలు స్టేషన్‌కి రాగానే సైకిలు తిరిగి ఇచ్చేసి రైలు ఎక్కి వెళ్లిపోవచ్చు.
ఈ బైక్ స్టేషన్లు ఇరవై నాలుగు గంటలు, ఏడు రోజు పనిచేస్తాయి. ప్రయాణికుల సహాయం, రక్షణ కోసం మంచి అనుభవజ్ఞులైన సుశిక్షితమైన సిబ్బందిని నియమిస్తారు.
వినడానికి చాలా బాగుంది, ఆదాతోబాటు ఆరోగ్యం అందరికీ. ఇలాంటి ప్రయోగాలకి అందరూ చేయూతనిచ్చి ముందుకు వచ్చి ప్రోత్సాహం ఇవ్వాలి. మన వంతు బాధ్యతగా కాలుష్యాన్ని, ఇంధనాన్ని, వాహన రద్దీని అదుపు చేయాలి, పొదుపు చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మార్పు చాలా అవసరం. అయితే మగవారైతే త్వరగానే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు. మరి మహిళలు ముఖ్యంగా మధ్య వయస్కులు, చీరలు ధరించే అలవాటు ఉన్నవారు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఐతే ఐటి ఉద్యోగస్తులకి ఎక్కువగా షిఫ్టులు ఉంటాయి కాబట్టి, రాత్రిళ్ళు ప్రయాణించేవారికి కాస్త ప్రమాదం అనే చెప్పాలి. కార్లో వెళ్తున్నా అమ్మాయిలకు భద్రత లేనప్పుడు ఈ సైకిల్ ప్రయాణం ఎంతవరకు సురక్షితమో చెప్పలేము. వెళ్ళేటప్పుడు వచ్చేప్పుడు అందరితో కలిసి ఉండేలా చూసుకోవాలి.
ఇలాంటి చిన్న చిన్న సమస్యలని పక్కన పెడితే, ఈ బైసికిల్ స్టేషన్ నిజంగా చాలామందికి వరం అనే చెప్పాలి. ఇక ఉద్యోగస్తులైన యువతకైతే రోజూ ఒక పండుగ అనే అనుకోవాలి. అందరూ కలిసిమెలిసి సైకిల్ తొక్కుతూ హుషారుగా ఆడుతూ పాడుతూ వెళ్ళే అవకాశం. చెలిమికి, సరదాకి ఎక్కువ ఆస్కారం ఈ ప్రయాణం. దారిలో వెళ్ళే బాటసారుల కళ్లకి మంచి ఆహ్లాదం, వినోదం, ఆనందం. డాక్టర్లు రోజూ టీవీల్లో చెప్తున్నారు, సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి చాలా మంచిది అని. చాలామంది అసలు సైకిల్ తొక్కడానికి మంచి రోడ్లేవి, పచ్చని వాతావరణం ఎక్కడుంది అని బాధపడుతుంటారు. ఈ విధంనైనా అలాంటివారికి మంచి అవకాశం అని ఆశిద్దాం.

Wednesday, October 2, 2013

  • My Article "ఆంటీ..అని పిలవొద్దు ప్లీజ్..!" published in Today's (02.10.13) Andhrabhoomi Daily in Bhoomika's Mainfeature~~ Rani Sandhya

    To Read Online follow this Link : http://www.andhrabhoomi.net/content/aunty
     

  • -రాణి సంధ్య aranisandhya777@gmail.com
  • 02/10/2013
‘ఆంటీ’ అని పిలిస్తే ఎంతమంది మహిళలు ఇష్టపడతారు? ఇది అంత త్వరగా తేలే సంగతీ కాదు, అలా అని అంత పెద్ద విషయమూ కాదు. నేటి ఆధునిక అమ్మాయిలు,అబ్బాయిలు ఆడవారు కనిపిస్తే చాలు వయసును సైతం చూడకుండా ఆంటీ అనే బిరుదు అంటించేస్తారు. ఇది చాలామంది ఆడవారికి మింగుడుపడని వి షయమనే చెప్పాలి. ఐదేళ్ల బాలుడి నుంచి మొదలుపెడితే కుర్రాళ్లు, నడివయస్కులు కూడా ఈ పదాన్ని అవలీలగా వాడేస్తుంటారు. ఇద్దరు ఆంటీలు మాట్లాడుకుంటున్నారని చెప్పడానికీ, ఇద్దరు మహిళలు మాట్లాడుకుంటున్నారని చెప్పడానికీ తేడా లేదా? ఊరు, పేరు తెలియక పోతేపోనీ, అంతమాత్రాన ఆంటీ అనే ఎందుకు అనాలి? మర్యాదగా ‘మేడమ్’ అని పిలవవచ్చుగా..? చదువుకున్న వారు, చదువులేనివారు అందరూ సులువుగా పిలిచే పదం ‘ఆంటీ’.
ఉదయం లేచిన దగ్గరనుంచి మహిళలు ఎంతోమందిని చూస్తుంటారు. అన్ని వర్గాల వారూ మహిళను పలకరిం చేందుకు వాడే పదం ఆంటీ. టైలర్ దగ్గరికి వెళ్తే ఆంటీ.. కిరాణా దుకాణానికి వెళ్తే ఆంటీ... చుట్టాలు, స్నేహితులు, పక్కింటివాళ్లు, అపరిచితులు అందరూ మహిళలను పలకరించే పదం ఆంటీ. సినిమాకి వెళితే అక్కడ టికెట్లు ఇచ్చేవారు, చిప్స్ అమ్ముకునే వారు.. ఎవరు ఆంటీ అని పిలిచినా మహిళలు పలకాల్సిందే. ఇక వేరే దారేది..?
ఎందుకిలా..? ఇంగ్లీషులో ఆంటీ అంటే- తెలుగులో అర్థం అత్తయ్య అని చెబుతారు. అత్తయ్య అనే పిలుపులోని తీయదనం ఆంటీలో ఎక్కడుంది? పైగా చాలామంది ఆడవారికి ఆ ఆంటీ అనే పదమే నచ్చదు. దానికి కారణం- ఆ మధ్య వచ్చిన ఆంటీ అనే సినిమా అని, ఆ సినిమాలో ఆంటీ అనే దృక్పథం ఆడవారికి అస్సలు నచ్చలేదని గొంతెత్తి చాటాలనుకుంటారు చాలామంది ఆడవాళ్లు. ఇలా అనిపించినపుడు నేను కొంతమందిని ప్రశ్నించగా వారు కూడా ఇదే భావన తెలియజేసారు. ఒక మహిళ ఇలా తన అభిప్రాయం ఇలా చెప్పారు. ‘అసలు ఆ ఆంటీ అనే పదమే చాలా జుగుప్సగా అనిపిస్తుంది’!
సరే.. తప్పేముందిలే.. అని కాసేపు అనుకుంటే, ఆంటీ అని పిలవడానికి, పిలిపించుకోవడానికి ఏదైనా వయసు కొలమానం ఉందా? ఉంటే ఇద్దరి మధ్య వయసు తేడా కనీసం పదిహేను ఇరవై ఏళ్లు ఉండాలా వద్దా? అవతలి వారు వయసు తేడా లేకుండా అపుడే పెళ్లయిన వారు కనిపిస్తే చాలు ఆంటీ అంటారు. కాస్త బొద్దుగా, లావుగా వుంటే పెళ్లయినా, కాకున్నా ఆంటీ అనే అంటారు. ఇది ఆడవారికి ఒక మానసిక యాతనే అని చెప్పొచ్చు. వద్దంటే ఇంకా పరిహసిస్తారు.
ఆ పదాన్ని అష్ట వంకర్లు తిప్పి వ్యంగ్యానికి, హాస్యానికి వెటకారానికి కొందరు ఉపయోగిస్తారు. ఇక ఇంటర్నెట్‌లో ఆంటీ అని కొడితే చాలు- వేల రకాల బూతు సైట్లు తెరుచుకుంటాయి. ఇది మరింత బాధాకరమైన విషయం. ఆంటీ అంటేనే బూతు పదం అని భావిస్తున్నారు కొంతమంది మహిళలు. చాలామంది ఆ పదాన్ని అసహ్యించుకుంటామని చెబుతారు. ఈ సమస్య చాలా జటిలమైనది . మమ్మల్ని ఆంటీ అని పిలవద్దు అని చెప్పలేరు మహిళలు. అలా అని ఆ పిలుపుని భరించలేరు కూడా. సరే చెప్తే పిలవడం మానేస్తారు కదా అని అనుకుంటే ఎంతమందికి చెప్పగలరు. ఉదయం లేచిన దగ్గరనుంచి ఎంతోమందిని కలుస్తాం. అలా పిలిచిన ప్రతి ఒకరికి చెప్పాలంటే కూడా విసుగే మరి. మధ్యలో మొహమాటం అనే ముసుగు కూడా ఉంటుందిగా.
మిమ్మల్ని ఎవరైనా ఆంటీ అని పిలిస్తే మీరెలా స్పందిస్తారు..?- అని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని అయిన మహిళని ప్రశ్నించగా...‘నాకు వరసకు కోడలో, అల్లుడో అయితేనో లేదా నాకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉండి, మా కుటుంబంలో కలిసిపోయిన వారి పిల్లలు పిలిస్తేనో నేను సంతోషంగా పలుకుతా. కానీ బయటివారు, అసలు పరిచయం లేనివారు ఏదో ఒక అవసరానికి ఐదు నిముషాలు కనిపిస్తే ఆంటీ అని పిలిస్తే మాత్రం చాలా ఎబ్బెట్టుగా, అసహ్యంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఈ విషయంలో వాగ్వివాదం కూడా జరిగింది. మనం గట్టిగా మాట్లాడితే మానసిక పరిపక్వత లేదు, అనుకూల దృక్పథం (పాజిటివ్ థింకింగ్) లేదు అంటారు’- అని వివరించారు.
ఒక గృహిణిని అడిగితే- ‘మా పక్కింటి వారు ఆహ్వానిస్తే నేను వారి పాప పుట్టిన రోజు పండగకు వెళ్లాను. ఆంటీ భోంచేసి వెళ్లండని ఆ పాప అంది. అంతే నా మనస్సు చివుక్కుమంది. అక్కడ ఒక్క నిముషం కూడా నిలవాలనిపించలేదు. మా బాబు కన్నా వారి పాప ఐదేళ్లు చిన్న. అంత మాత్రాన నేను వయసు మళ్లిన దానిలా కనిపిస్తున్నానా? అనిపించింది. చాలా కోపం కూడా వచ్చింది. అసలు వారికి సంస్కారం ఉందా? అని అడగాలనిపించింది. నువ్వు నాకన్నా చాలా పెద్ద అని మొహం మీదే చెప్పినట్టు అనిపించింది. ఇక ఆ తరువాత ఆవిడ ఎప్పుడు కలిసినా నేను మనస్ఫూర్తిగా మాట్లాడలేదు. అదేదో శత్రువుని చూ సిన భావన నాకు’ అని చెప్పుకొచ్చారు.
నేటి కాలంలో ఆంటీ అనే పిలుపు మర్యాదకు చిహ్నం కాదు. నేటి మహిళ ఆ పదాన్ని విభిన్న కోణంలో చూస్తోంది. ఆ పిలుపు మానసికంగా మనుషులని దూరం చేస్తున్నది. ఎలాంటి పరిచయం లేకపోతే ‘మేడం’ అనే పదం ఉత్తమమైనది అని నేటి మహిళ భావిస్తున్నది. ఈ పోటీ ప్రపంచంలో ఆడ, మగ యవ్వనంగా కనిపించాలి. యువతలో కలిసిపోవాలని తమను తాము ఎంతో ప్రయాసపడి తీర్చి దిద్దుకుంటున్నారు. నేడు భార్యాభర్తలు, అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ములు అందరూ ఒకరినొకరు పేర్లతోనే సంబోధించుకుంటున్నారు. ఇది నేటి సినిమాల్లో కూడా మనం చూస్తున్నాం. హాయిగా నువ్వు, నేను ఒక్కటే అనే భావన కోసం. నీకు, నాకు వయసులో తేడాలేదని చెప్పడం కోసం పేర్లతో పిలుచుకుంటున్నాం. మన భావాలు కలుస్తాయి, మన ఆలోచనలు ఒక్కటే అని కూడా చెప్పకనే చెబుతాయి. అలాంటిది ముక్కు మొహం తెలియని వారు ఎదురుపడి ఆంటీ అంటే భరించడం కష్టమే. ఆ పిలుపు వెంటనే వయసు తేడాని గుర్తు చేస్తుంది. అలాగే, ముఖ్యంగా మగవారు పిలిస్తే కొందరు మహిళలకు జుగుస్సాకరంగానూ అనిపిస్తుంది.
ముందుగా మనం తెలుసుకోవాల్సినవి ముఖ్యంగా మూడు విషయాలు. ఇవి ఆడవారికి, మగవారికి వర్తిస్తాయ.
1. నా పిల్లలు నీ పిల్లల వయసు కావచ్చు లేదా కొంచెం తేడా ఉండొచ్చు. అయినా మనం మొదటిసారి కలిస్తే, తరువాత కలిసి పనిచేయవలసి వస్తే నేను నీకు ఆంటీని కాను, ఒకరిని ఒకరు పేర్లతో పిలుచుకోవడం ఉత్తమం.
2. నా కొడుకు లేదా కూతురుది నీ వయసే కావచ్చు లేదా నీకన్నా పెద్ద వయసే కావచ్చు. మనం మొదటిసారిగా కలిస్తే నువ్వు నన్ను ఆంటీ అని పిలిస్తే నాకు నచ్చదు. ఆ అవసరం లేదు, పేరు తెలుసుకుని పేరుకు ‘గారు’ చేర్చి పిలిస్తే సంతోషం.
3. నువ్వు నాకు చిన్నతనం నుంచి తెలియదు, నిన్ను చూడడం ఇదే మొదటిసారి. వయసు తేడాతో సంబంధం లేదు. ఎలా సంబోధించాలో తెలియకపోతే అడిగి తెలుసుకో, నీకు నీవుగా ఊహించుకుని ఆంటీ అని పిలవద్దు. ఇదీ నేటి మహిళల ఆలోచనా సరళి.
ఆంటీ అనే పిలుపుని కుటుంబ సభ్యులకి మాత్రమే నియంత్రిస్తే చాలా సంతోషమని మహిళలు భావిస్తున్నారు. ఇక ఫేస్‌బుక్‌లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ గ్రూప్స్‌లో ఇది సర్వసాధారణం అయింది. ఫ్రెండ్‌గా కలుపుకోగానే ‘ఆంటీ’ అనేస్తారు. కేవలం ఇలా పిలిచినందుకే రోజూ ఎంతోమందిని ఫేస్ బుక్‌లో మహిళలు వారిని బ్లాక్ చేస్తారని తెలిస్తే నిజంగానే వింతగా అనిపిస్తుంది. కానీ- ఇది నమ్మాల్సిన సత్యం. ఫేస్‌బుక్ అంటేనే ఫ్రెండ్షిప్ మరి. అలా ఫ్రెండ్ అయ్యాక అక్కా, చెల్లీ, ఆంటీ అంటే మహిళలకు అది చిరాకు కలిగించే విషయమని అందరూ గమనించాలి. మన భావాలు, ఆలోచనలు తెలుసుకోవడానికి, పంచుకోవడానికే మాత్రమే ఫేస్‌బుక్. అంతే కానీ చుట్టరికాలు కలుపుకోవడానికి కాదని వారు తెలుసుకోవాలి.
మనం రైళ్లలో, బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా కనిపించిన ప్రతి వారిని ఆంటీ, అంకుల్ అని కాకుండా మేడం, సార్ అని పిలుచుకుంటే వారు వెంటనే స్పందిస్తారు. కావాల్సిన సహాయం త్వరగా చేస్తారు. తిరిగి ఎక్కడైనా కనిపించినా మళ్లీ మాట్లాడతారు. మర్యాదలకు సంబంధించిన ఈ విషయాలను నేటి యువత గమనించి మసులుకుంటే మంచిది.