Tuesday, April 21, 2026

 

శీర్షిక: ఆడవాళ్ళూ మీకు జోహార్లు!!

రచన : ఏ. సంథ్యారాణి సిరిప్రగడ(రాణి సంధ్య)  

గమనిక: ఈ కథ నా స్వీయ రచన  

ఆడవాళ్ళూ మీకు జోహార్లు!!

"మీరు పాడటం బాగున్నా లేకున్నా, మీకు పాడాలనిపిస్తే పాడండి. ఇది కూడా ఒక వ్యాయామం. ఊపిరితిత్తులకి మంచి ఎక్సర్సైజ్ కాబట్టి ఎవడో వెక్కిరించాడని పాడటం ఆపేయకండి. పాడటం అనేది మీ ఒత్తిడిని సడలిస్తుంది, అంటే మీ బాడీ కే కాదు బ్రెయిన్ కి కూడా. నేను పాడేటప్పుడు ఒకటే అనుకుంటాను, ఇప్పుడు నేను ఎలాంటి పోటీలకైతే వెళ్ళడం లేదు, నా గొంతు చాలా బాగుండాల్సిన అవసరం లేదు, నేను సినిమాలలో పాటలు పాడడానికి వెళ్ళడం లేదు, చక్కగా పాడుతున్నానో లేదా చూసుకోవడానికి. నాకు పాడటం ఇష్టం కాబట్టి

పాడుతాను! పైగా ఒక ప్రశాంతత మనకి. ఇష్టమైన పనులు చేస్తే ఖచ్చితంగా మనం ఆనందంగా ఉంటాం. సో మన మైండ్ పీస్ కోసం, బాడీ స్ట్రెస్ రిలీజ్ కోసం, మన ఆనందం కోసం పాడాలి అంతే! పాడింది నా ప్రొఫైల్ లో నేను పెట్టుకుంటా, నచ్చకపోతే పక్క నుంచి వెళ్ళిపోవాలి! దాన్ని వెక్కిరించాల్సిన పనిలేదు." అంటూ జుంబా క్లాస్ ముగించింది మల్లిక.

అందరూ చప్పట్లు కొడుతూ, ఆమె చెప్పింది ఆమోదిస్తున్నట్టుగా చిరునవ్వులు చిందిస్తూ... 'హమ్మయ్య ఈరోజుకి ఎక్సర్సైజ్ సరిపోయింది' అనుకుంటూ క్లాస్ నుంచి బయటికి వచ్చేసారు.

మల్లిక ఒక జుంబా ట్రైనర్. ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు క్లాసెస్ తీసుకుంటూనే ఉంటుంది. ఆమె ట్రైనింగ్ అంటే స్టూడెంట్స్ కి చాలా ఇష్టం! ప్రత్యేకంగా

పెళ్ళి అయిన వాళ్ళు, పిల్లల తల్లులు ఎక్కువగా ఆమె క్లాసు ఇష్టపడుతూ ఉంటారు. కేవలం జుంబా క్లాసే కాకుండా ఎన్నో మంచి మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ మాటలు చెప్తూ ఉంటుంది. చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది!

రోజూ ఇంటికి రాగానే మల్లికని పలకరించి, "డిన్నర్ రెడీగా ఉంది, త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి రా! నీకు ఇష్టమైన కర్రీ చేశాను" అంటూ చెప్తుంది ఆమె వదిన పల్లవి. వదిన చూపించే ప్రేమకి, అభిమానానికి మల్లిక ఎప్పుడూ ఫిదా అయిపోతూ ఉంటుంది.

"మల్లి! వచ్చావానే" మంచం పైన కూర్చుని టీవీ చూస్తూ అడిగింది మల్లిక వాళ్ళ అమ్మ సుమతి.

"వచ్చాగాని!! ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? నా పేరునలా ముక్కలు చెక్కలు చేసి పిలవద్దనీ! నా పేరు మల్లిక. పూర్తి పేరుతో

'మల్లిక' అని పిలువు!" గట్టిగా చెప్పింది మల్లిక.

"సరేలేవే! నీకు పేరు పెట్టింది నేను! ముద్దుగా 'మల్లి' అని పిలిస్తే ఏం పోయింది నీకు" అంది సుమతి మూతి తిప్పుతూ... రాగాలు తీస్తూ.

"మల్లికా! ఈ వాదన రోజు ఉండేదేగా. పద, త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి రా. ఇప్పటికే చాలా లేట్ అయింది." అంది పల్లవి.

మల్లిక లోపలికి వెళ్ళగానే, టీవీ సీరియల్స్ చూడడంలో నిమగ్నమయింది సుమతి.

ఇంతలో మెయిన్ బెడ్ రూమ్ లో నుంచి ఆమె భర్త జగదీష్ నుంచి ఫోన్ వచ్చింది సుమతికి."హలో" అంది సుమతి.

"ఎందుకే దాన్ని ఏడిపిస్తావు? ఇంటికి రాగానే! నీ పని నువ్వు చేసుకోరాదు. ఆ టీవీ సీరియల్స్ చూస్తున్నావుగా! పొద్దున్నుంచి కష్టపడి రాత్రికి

ఇంటికి వస్తుంది, రాగానే దాన్ని ఏదో అంటావ్. కాస్త దాన్ని ప్రశాంతంగా భోజనం చేసి పడుకోనీ! మళ్ళీ పొద్దున్నే ఉరకాలి 5 గంటలకి." అన్నాడు జగదీష్.

"ఓ!! నువ్వు ఇంకా పడుకోలేదా జగదీష్ మాస్టారు! నాకేమన్నా దాన్ని ఏడిపించడం సరదానా ఏమిటి? పొద్దున వెళ్తుంది, రాత్రికి వస్తుంది. మధ్యలో ఫోన్ మాట్లాడడానికి కూడా దానికి టైం ఉండదు. ఏదో కొద్దిసేపు దాంతో మాట్లాడాలి అనిపిస్తుంది. ఆ పేచీలో అయినా, వాదనలో అయినా దాంతో మాట్లాడినట్టు ఉంటుంది కదా! రోజు తిన్నావా! పన్నావా! అని మాత్రమే అడుగుతే ఏ బాగుంటుంది!" అంది సుమతి రాగాలు తీస్తూ... మూతి తిప్పుతూ!.

"ఏడ్చినట్టే ఉంది. నువ్వూ, నీ తిక్క ఆలోచన! ముద్దుగా దగ్గర కూర్చోబెట్టుకుని నాలుగు ప్రేమ

మాటలు మాట్లాడరాదే!! ఇదేం పద్ధతి!" ఆశ్చర్యంగా అన్నాడు జగదీష్.

"బాగుంది! నీకు తెలియదా ఏంటి? దాన్ని ప్రేమగా దగ్గరకు తీసుకున్నా చిరాకు పడుతుంది, చిటపటలాడుతుంది. 'అమ్మ నేను పెద్దదాన్ని అయ్యాను నా గురించి ఆలోచించక్కర్లేదు! ఈ ప్రేమ దోమ అన్ని పక్కన పెట్టు. హాయిగా తిని పడుకో, టీవీ చూడు' అని నీతి బోధలు చేస్తుంది. షీ ఇస్ సో ప్రాక్టికల్. నాట్ ఎమోషనల్." అంది సుమతి.

"అవునే! దాని ప్రేమ అంతా చిరాకులో, కోపం లోనే ఉంటుంది! పిచ్చిది దాని గురించి, దాని జీవితం గురించి ఆలోచించట్లేదు. మన గురించి మాత్రమే ఆలోచిస్తుంది. కష్టపడుతుంది. ఏమిచ్చినా దాని రుణం తీర్చుకోలేం మనం!" జగదీష్ ఇలా అంటుండగానే, "ఏంటీ! మీ ఇద్దరూ ఇంకా పడుకోలేదా! ఆయన అక్కడ

రూమ్ లోంచి, నువ్వు ఇక్కడ హాల్లోంచి! ఎంతసేపు ఫోన్లో మాట్లాడుకుంటారు? నాలుగు రోజులు అవగానే రీఛార్జ్ అయిపోయింది అంటూ గోల మొదలెడతారు. ఒక దగ్గర కలిసి కూర్చుని, కలిసి టీవీ చూస్తూ, కలిసి మాట్లాడుకోవచ్చు కదా!" భోజనం చేసి వస్తూనే తల్లిదండ్రులని ఉద్దేశించి అరిచింది మల్లిక.

మల్లిక గొంతు వినగానే ఇద్దరు ఫోన్ పెట్టేశారు!!

అత్తమామలకు ఇద్దరికీ గ్లాసులో పాలు తీసుకొస్తూ "ఇద్దరూ కలిసి చూసే ప్రోగ్రాం లేవన్నా ఉంటే కదా మల్లికా టీవీలో! ఒకరికి న్యూస్, క్రికెట్ కావాలి, ఇంకొకరికి సీరియల్స్, సినిమాలు కావాలి. అందుకే కదా బెడ్ రూమ్ లో కూడా ఒక టీవి పెట్టించాము." అంటూ అత్తమామలిద్దరికీ పాలు అందించింది పల్లవి.

"వదిన, రేపు రాత్రి నేను డిన్నర్ చేయను. నా

ఫ్రెండ్ సారిక కూతురు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంది. రాగానే తయారయ్యి డిన్నర్ కి అక్కడికే వెళుతున్నాను." చెప్పింది మల్లిక.

"అలాగే మల్లికా!" అంటూనే, "మల్లికా పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలి, లాస్ట్ డేట్ దగ్గరికి వస్తోంది. వీలైనంత త్వరగా డబ్బు అరేంజ్ చేయాలి." అంది పల్లవి.

"సరే వదినా. వీలైనంత త్వరగా అరేంజ్ చేస్తా." అంటూ పడుకోడానికి తన రూమ్ లోకి వెళ్ళింది మల్లిక.

 ఎంగేజ్మెంట్ ఫంక్షన్ భారీ ఎత్తున జరుగుతోంది! ఫ్లవర్ బొకే తీసుకొని మల్లిక స్టేజ్ ఎక్కి తన స్నేహితురాలిని కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ, కాబోయే పెళ్ళి కూతురికి బొకే అందించి కిందికి దిగింది.

భోజనం హాల్ కి వచ్చింది మల్లిక. ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. మల్లిక సింపుల్గా పప్పన్నం, అప్పడాలు, వడియాలు, ఆవకాయ, కాస్త బిర్యానీ, 'కద్దు కా కీర్' స్వీట్ ప్లేట్లో వేసుకొని భోజనం ముగించింది. ఐస్క్రీం, గులాబ్ జామ్ కాంబినేషన్ తింటూంది. ఇంతలో తన కాలేజ్ ఫ్రెండ్స్ ముగ్గురు ఒక టేబుల్ దగ్గర కూర్చుని తింటున్నారు. తనని పిలిచేసరికి అటు వెళ్ళింది మల్లిక.

చాలా ఏళ్ళ తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసే సరికి మంచి-చెడు మాట్లాడుకుని, సెల్ఫీలు తీసుకుని, ఎంతో ఆనందంగా కాసేపు గడిపారు. ఇద్దరు స్నేహితులు లేటవుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. అక్కడ తన క్లోజ్ ఫ్రెండ్ సరిత మాత్రమే ఉంది.

"ఏంటి మల్లికా! మన స్నేహితులందరిలో, నీకు తప్ప అందరికీ పెళ్ళిళ్ళు అయి, పిల్లలు పుట్టి,

వాళ్ళ చదువులు కూడా అయిపోవస్తున్నాయి. సారిక కూతురుకి పెళ్ళి కూడా అవుతోంది. నువ్వు మాత్రం ఇంకా ఒంటరిగానే ఉన్నావ్!" అంది సరిత.

"హా... అవును! నేను ఒంటరిగానే ఉండాలనుకుంటున్నాను. మీరు పెళ్ళిళ్ళు చేసుకుని సంతోషంగా ఉన్నారు. నేను చేసుకోకుండా సంతోషంగా ఉన్నాను. అంతే తేడా!" అంది మల్లిక.

"ఏంటే ఒంటరిగా ఎందుకు ఉండాలి అనుకుంటున్నావు? ఇంతకుముందు కూడా చాలా సార్లు అడిగాను నిన్ను, నువ్వు అసలు కొంపదీసి ఆ టైపా?" అడిగింది సరిత.

ఇద్దరి మధ్య సీరియస్ గా సంభాషణ మొదలైంది!

"ఆ టైపా? అంటే?"

"అదే లెస్బియన్ టైప్ ఆ?"

"అలాంటిదేమీ లేదు."

"మరెందుకు ఒంటరిగా ఉండాలనుకుంటున్నావ్? లవ్ ఫెయిల్యూరా?"

"లేదు!"

"మరెందుకే?"

సమాధానం చెప్పకుండా మల్లిక మౌనంగా ఉంది!

"సారీ మల్లికా నిన్నేమైనా బాధపెట్టి ఉంటే! జస్ట్ అవుట్ అఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా. అందరం పెళ్ళిళ్ళు చేసుకున్నాము కదా నువ్వు మాత్రం ఇలా ఒంటరిగా ఉండేసరికి కొంచెం బాధగా ఉంది."

"హే ఇట్స్ ఓకే! నేను ఒంటరిగా ఉండడానికి నా కారణాలు నాకు ఉన్నాయి. కానీ అవి మీకు

నచ్చుతాయో లేదో, నీకే కాదు మా ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా ఎన్నోసార్లు చెప్పినా వాళ్ళు విభేదించారు. అందుకే నేను చెప్పడానికి ఇష్టపడను."

"సరే మల్లికా నీ ఇష్టం. నీ అభిప్రాయాన్ని తప్పకుండా గౌరవిస్తాను. నీకు చెప్పాలనిపిస్తే చెప్పు."

"నీకు తెలుసు సరిత... కాలేజీలో నన్ను దగ్గరుండి చూసావు. నువ్వే చాలాసార్లు అన్నావు 'మల్లికా నువ్వు ఇండిపెండెంట్ ఉమెన్ వి, ఎవ్వరి మీద ఆధారపడవు' అని. నిజమే! చాలామంది ఆడవాళ్ళలో ఈ క్వాలిటీ ఉంటుంది. కానీ ఆ పర్సనాలిటీ పెళ్ళి మీద ప్రభావం చూపదునుకుంటా వాళ్ళకి. పెళ్ళి చేసుకుని కూడా వాళ్ళ పర్సనాలిటీని కాపాడుకుంటారు. అలాగే నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ ఆడ-మగ సమానత్వం

గురించి కవితలు రాసేదాన్ని, స్పీచ్ లు ఇచ్చేదాన్ని. కానీ ఏ రోజు ఆ సమానత్వం నా జీవితంలో, నా కుటుంబంలో కనపడలేదు ముఖ్యంగా పెళ్ళి తర్వాత భార్య ఖచ్చితంగా రోజూ వంట చేయాలి, ఇంటి పనులు చేయాలి. ఈ విషయం మా ఇంట్లో చిన్నప్పటి నుంచే నేను చూస్తున్నాను."

సరిత సిరియస్ గా వింటోంది!!

"మా అమ్మ ఎంతో కష్టపడేది. పొద్దున్నే లేస్తే సాయంత్రం వరకు అందరికీ ఇష్టమైన వంటలు, ఇంటి పనులు చేస్తూ, రాత్రికి అందరూ పడుకున్న తర్వాత తను నిద్రపోయేది. ఏ తల్లికి/భార్యకి మాత్రమే ఈ బాధ్యత ఉందా!? ఆవిడకి అస్సలు రెస్ట్ దొరికేది కాదు. మా నాన్న కి ఆదివారం ఒక సెలవు వచ్చేది, సెకండ్ సాటర్డే ఒక సెలవు వచ్చేది, పండుగలకు సెలవు వచ్చేది. మరి ఆడవాళ్ళకి మాత్రం

అసలు వంటకి, పనికి సెలవే లేదు. ఉద్యోగం చేసే ఆడవాళ్ళు కూడా ఈ వంట, ఇంటి పనుల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఏ అంత ఖచ్చితంగా ఆడవాళ్ళు వంట చేయాలని ఎక్కడ రాసుంది చట్టంలో! ఇది నన్ను చిన్నప్పటినుంచీ చాలా బాధపెట్టే విషయం. మా అమ్మని చూసేదాన్ని ఆవిడ ఎంత కష్టపడేదో, ఆ తరువాత మా వదిన ఉద్యోగం 'వర్క్ ఫ్రం హోం' చేస్తున్నా, పాపం పొద్దున్న లేస్తే వంట, ఇంటి పనులు, మా అమ్మ నాన్నను, నన్ను చూసుకోవటం, మా అన్నయ్య, పిల్లలను చూసుకోవటం ఎంతో పని. కనీసం వారంలో రెండు రోజులైనా ఆడవాళ్లకు ఒక సెలవు అంటూ ఉండాలి కదా! మగవాళ్ళు బాధ్యతలు పంచుకుని అన్ని పనులు చేసుకోవాలి. భర్తలు వండి పెడితే తినటం, అలాగే పిల్లలకు కూడా తల్లిని కూర్చోబెట్టి వంట చేయడం, వడ్డించడం, ఇంటి పనులు చేసుకోవడం నేర్పించాలి కదా. ఆడవాళ్ళు కూడా సంతోషంగా ఒక రోజంతా

హాయిగా రెస్ట్ తీసుకోవాలి. మన సమాజం ఎందుకు ఇలా లేదు? ఇలా ఎందుకు నేర్పించట్లేదు అందరికీ? నావల్ల కాదు సరిత. ఇలా పొద్దున్నే లేస్తే అన్ని బాధ్యతలు నేనే చూసుకోవడం, ఒక భార్యగా, తల్లిగా వదినగా, చెల్లిగా ఇవన్నీ నేను మోయలేను. తెలిసి తెలిసీ నిప్పుల్లో దూకుతామా చెప్పు."

"హా... అయిపోయిందా నీ సుదీర్ఘమైన స్పీచ్! అంటే నువ్వు పెళ్ళి చేసుకోక పోవడానికి ఇదే నా కారణం! ఇది చాలా సిల్లీ విషయమే! నిజంగా నీకు ఇంటి పనులు, వంట పనులు చేయడం ఇష్టం లేకపోతే హాయిగా ఉద్యోగం చేస్తున్నావు కదా, ఒక మనిషిని పెట్టుకో! వంటకు, ఇంటి పనులకు ఒక మనిషిని పెట్టుకుని నువ్వు వచ్చేవరకు అన్ని రెడీగా చేసి టేబుల్ మీద పెట్టాలి. ఇక సమస్య ఏముంది?"

"బాగుంది సరితా! నువ్వు చెప్పేది చాలా

బాగుంది కానీ మేము మరీ అంత సంపన్నులం కాదు. వచ్చే జీతం ఇంటికి సరిపోతుంది కాబట్టి ఇంకో మనిషిని పెట్టుకునే అంత స్తోమత నాకు లేదు. మా ఇంట్లో ఎన్నో సంబంధాలు చూసారు నాకు. వచ్చిన ప్రతీ పెళ్ళి కొడుక్కి నా మనసులో మాట చెప్పాను. కచ్చితంగా నాకు రెండు రోజులు రెస్ట్ ఉండాలి అని కూడా చెప్పాను. కానీ పెళ్ళిచూపులకి వచ్చిన మగవాళ్ళు ఎవరూ కూడా దానికి ఒప్పుకోలేదు. అందుకే నా ప్రశాంతమైన జీవితంలోకి పెళ్ళి అనేది లేకుంటేనే బాగుంటుంది అని నేను నిర్ణయం తీసుకున్నా."

"హ్మ్..." నిట్టూర్చింది సరిత

"పైగా మా అన్న వదిన ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్నా వాళ్ళు చేసే చిన్న ఉద్యోగాలకి, జీతం కూడా చిన్నదే! మా అమ్మానాన్న నీ, పిల్లల్ని పోషించడానికి ఆ జీతాలు సరిపోవు

కాబట్టి, నా జీతం కూడా ఆ సంసారాన్ని మోయడానికి కాంట్రిబ్యూట్ చేస్తున్న. నాకు ఈ లైఫ్ బానే ఉంది. ముసలితనం గురించి తరువాత ఆలోచిద్దాం. ఇప్పుడే ఆలోచించి భయపడాల్సిన అవసరం లేదు. ఒకే సరిత! ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను ఎన్నో విషయాలు నీకు చెప్పాను. ఇక వెళ్దాం పద. మా ఇంట్లో వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బై."

"బై" అంటూ సరిత కూడా లేచింది.

"హలొ మేడం.." అంటూ పక్క టేబుల్ నుంచి ఒక వ్యక్తి లేచి మల్లిక దగ్గరకొచ్చాడు!

"నా పేరు కళ్యాణ్. నేను ఒక రైటర్ ని. మీ సంభాషనంతా విన్నాను. మీరు చెప్పింది చాలా నిజం. సమాజంలో మీరు చెప్పిన మార్పు తప్పకుండా రావాలి. మీకు అభ్యంతరము

లేకపొతే, మీరు చెప్పిన విషయాలు నా రాబోయే పుస్తకం లో రాయాలనుకుంటున్నా!"

"మీ ఇష్టం! రాసుకోండి! ఇంతకీ మీ పుస్తకం పేరెంటి?"

"ఆడవాళ్ళూ... మీకు జోహార్లు!!"

___సమాప్తం


Thursday, May 2, 2024

ముద్దు!!!

 కథ: ముద్దు

వ్రాసిన వారు : సంధ్యా రాణి సిరిప్రగడ(రాణి సంధ్య)  

గమనిక: ఈ కథ నా స్వీయ రచన  

జోరుగా వర్షం .. చదువుకుంటున్నదల్లా , పుస్తకం పక్కకు పెట్టి , ఒక్క ఉదుటన పరిగెత్తిన్ది మధుర ! వర్షం లో తడవడం , ఎగరటం , దుంకటం , నృత్యం చెయ్యటం , తరువాత జలుబు జ్వరం తో అవస్థ పడటం ఈ అమ్మాయికి అలవాటే , మళ్ళీ ఒక్క ఉదుటన లోపలికి పరిగెత్తాలనుకుంది .. జారింది , కిందపడింది . పైన పెంట్ హౌస్ నుంచి చూస్తున్న మోహన్ ఆలోచించకుండా కిందికి దూకేసాడు !!! మధుర ని ఎత్తుకుని రూఫ్ గార్డెన్ నించి అమె రూమ్ లోకి తీసుకెళ్లి పరుపుపై కూర్చో బెట్టాడు . ఎందుకలా పరిగెత్తావు ? అడిగాడు మోహన్. నీళ్ళున్నాయి జారుతుంది కదా . మీరు పైన ఉన్నారని నాకు తెలియదు, మీరు అక్కడ నిలుచోవడం చూడగానే భయం వేసింది . అందుకే . బెదురుగా చూస్తూ చెప్పింది మధుర. ఎందుకు భయం ? నువ్వు వర్షంలో సరదాగా ఆనందిస్తుంటే చూస్తున్నా ! చెప్పాడు మోహన్ . సరే ఇంక పడుకో , టైం పన్నేడైంది. అంటు కదిలాడు . ఓహ్ , మీకేం అనిపించట్లేదా ? అడిగింది. ఏమనిపించాలి ? అడిగాడు . అంటే అర్ధరాత్రి ఒంటరిగా , వర్షంలో తడిసిన బట్టల్లో నేను , ఫైగా నన్ను తాకారు కదా , ఫీలింగ్స్ ఏమీ లేవా ? అడిగింది. ఏమీ లేవు ! సూటిగా చెప్పాడు . ఆశ్చర్యపోయింది మధుర. అదేంటి ముద్దు కూడా పెట్టుకోవాలనిపించట్లేదా ! లేదు . ఎందుకు ? నేను అందంగా లేనా ? ఉన్నావు ! ఉంటే ? సినిమాల్లో చూపించేవన్నీ నిజం కావు . అలా అనుకోకు. నువ్వు చిన్న పిల్లవి , ఇలాంటివి మైండ్లో నుంచి తీసెయ్యి. నేను చిన్నపిల్లలా కనిపిస్తున్నానా ? నాకు సెవెంటీన్ కంప్లీట్ అయ్యి ఎయిటీన్ వచ్చాయి మొన్ననే. అయినా నాకు చిన్న పిల్లవే, నీకు నాకు ఏడేండ్లు తేడా ఉంది . చూడూ , ఇప్పటి వరకు నీ రూంలో ఉండి మాట్లాడడమే తప్పు , ఈ టైంలో , బట్టలు మార్చుకుని పడుకో ఇంక. మీరు నన్ను పైనుంచి చూడడం కూడా తప్పే మరి, పైగా సిగరెట్ తాగుతూ , ఈ విషయం మా నాన్నకు చెప్పలేదు మీరు, రెంటుకు వచ్చినపుడు. ఆహ్ , నేను ఎప్పుడు ఇంట్లో తాగను , అందుకె చెప్పలేదు ఎదో వర్షం పడేసరికి , ఆపుకోలేక పోయాను . ఇంకో విషయం , నెను బెడఁరూంలోకి వచ్చి చూడలేదు, రూఫ్ గార్డెను , ఓపెన్గా ఉన్న ప్లేస్ , ఎవరికైనా కనబడుతుంది. ఎవరూ చూడొద్దు అనుకుంటే, లోపలే డాన్స్ చేసుకోవాలి. ఇంక నెను వెళ్తున్నా. ఆహ్ఆ .... , మధుర ఒక అరుపు ! వెళ్తున్న వాడల్లా వెనక్కి తిరిగి.. ఏమైంది ? అడిగాడు మోహన్ . కాలు బెణికినట్టుంది , నోప్పి , కదల్చలేక పోతున్నా ! అయ్యో , ఏదైనా పెయిన్ బాం ఉంటె రాసుకో , పెయిన్ కిల్లర్ ఉంటె వేసుకో . మార్నింగ్ వరకు తగ్గిపోతుంది .

కాలు కదలట్లేదు , ఎలా ? ఒకపని చెయి, పక్క రూంలొ మీ అక్క ఉంది కదా , ఫొన్ చేసి ఆమెను రమ్మను , ఆమె చూసుకుంటుంది . ఆమ్మో అక్క నా !!! ఆమె మంచి నిద్రలో ఉండి ఉంటుంది , ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే అంతె , పెద్ద గోల . అసలు వర్షంలో బయటి కి ఎందుకు వెళ్ళావ్ అంటూ క్లాస్ మొదలుపెడుతుంది. అసలే నొప్పి, మళ్ళీ ఆమెను కూడా భరించటం చాలా కష్టం . నా వల్ల కాదు . కొంచం మీరు హెల్ఫ్ చెయండి ప్లీజ్ . హ్మ్ , నాకు తప్పదా , సరే ఎక్కడున్నాయి మందులు ? త్వరగా చెప్పు . ముందు నేను బట్టలు మార్చుకోవాలి , నన్ను నా వార్డరోబ్ దెగ్గిరకి తీసుకెళ్లండి , లేదంటే సర్ది , దగ్గు పట్టుకుంటాయి . అర్ధరాత్రి నాకీ బాదేంటి అసలు, నేను బయటికొచ్చి నిను చూడకున్నా బాగుండేది , మధుర ని ఎత్తుకుంటూ అన్నాడు మోహన్ . 

ఆమెని వార్డరోబ్ దెగ్గిర దించి , త్వరగా మార్చుకో, నేను బయట వెయిట్ చేస్త , అవ్వగానే పిలువు , మందులిచ్చి వెళ్ళిపోతా. చాలా లేట్ అయ్యింది, సమస్య అవుతుంది. ఒకే ఒకే . జస్ట్ ఫైవ్ మినిట్స్ ! అంది మధుర. మోహన్ బయట రూఫగార్డెన్ లో నిలుచున్నాడు. వర్షం బాగా జోరుగా పడుతుంది . ఇంకొ సిగరెట్ తాగితే బాగుండు అనిపిస్తుంది మోహన్ కి , కానీ అల్రెడీ డామేజ్ జరిగింది . మధుర చూసేసింది , ఇన్నాళ్లు అందరు పడుకున్నాక అర్థరాత్రి, ఎపుడో అలా ఒకటి రెండు అంతే . అది కూడా రూంలో . ఇప్పుడు మధుర వాళ్ళ నాన్నకి చెప్పేస్తే అంతే , అంతేనా ! వాళ్ళ అక్కకి తెలిస్తే ఇల్లు పీకి పందిరి వేసేస్తుంది . వచ్చే రోజే చెప్పింది, తనకి సిగరెట్ , అల్కోహాల్ , నాన్వెజ్ అసహ్యం అని, ఆ అలవాటుంటే ఇల్లు రెంటుకి ఇవ్వమని. ఎట్టి పరిస్థితిలో అవి ఇంట్లొకి రావొద్దని . అలాంటి అలవాటున్న స్నేహితులు కూడా రావొద్దని , ఇలా సవాలక్ష కండీషన్స్ పెట్టింది. ఆ అలావాట్లున్నా సరే ఇంట్లొ ఉండేది తక్కువే కదా అని ఒప్పేసుకున్నాడు . పైగా వాల్ల అమ్మ కి మోహన్ ఒక ఫామిలీ ఇంట్లోనే ఉండాలని , ఎక్కడో అబ్బాయిలతో రూమ్ షేర్ చేస్కోవడం ఇష్టం లేదు . పైగా ఇక్కడ వాళ్ల నాన్న ఫ్రెండ్ రెకమండేషన్ తో ఉంటున్నాడు. బ్రేక్ ఫాస్ట్ , డిన్నర్ కూడా ఇక్కడే . మధుర వాల్ల అమ్మగారు రోజూ పైకి పంపిస్తారు. మధుర ఈ విషయం ఎవ్వరితో చెప్పకుండా చూసుకోవాలి . ఇక్కడ తెలిస్తే నే కాదు , ఇలా దోరికిపోయానని వాళ్ల ఇంట్లొ తెలిసినా అనవసరంగా సమస్య , మాట ఇచ్చినపుడు జాగర్తగా ఉండాలి కదా అని పడతాయి. మోహన్ అంటూ అరుపు. అప్పుడు కానీ ఈ లోకం లోకి రాలేదు మోహన్ . లొపలికి వెళ్ళాడు . మధుర పింక్ నైటీ లో నిజంగానే మధురంగా కనిపించింది. ఇన్నాళ్లు పెద్దగా గమనించలేదు డ్యూటీలో పడి. హలో , లేట్ అవుతుంది అన్నారు , పిలిస్తే రారేంటి అసలు ? హా , చెప్పు ఎక్కడున్నాయి ఆయింట్మెంట్ , టాబ్లెట్. మధురని ఎత్తుకుని మళ్ళీ బెడ్ పై కూర్చో బెట్టాడు. మెడిసిన్ బాక్స్ ఉన్న షెల్ఫ్ చూపించింది మధుర. ఆయింట్మెంట్ , పెయిన్ కిల్లర్ తీసుకొచ్చి మధురకి ఇచ్చి , పక్కనే ఉన్న వాటర్ బాటిల్ కూడా ఇచ్చి , ఓకే , ఇంక నేను వెళ్తున్నా . ఆయింట్మెంటు నువ్వు రాసుకో , అన్నాడు . ఏంచెప్పాలో తెలియక సరే అంది మధుర. ఒక సెకండ్లో మళ్ళీ వచ్చాడు మోహన్ . చూడూ ఎప్పుడు ఇంట్లొ తాగను , అందుకే సిగరెట్ అలవాటున్నా చెప్పలేదు . ఈరోజు వర్షంలో 

కాస్త టెంప్ట్ అయ్యా. సో ప్లీజ్ ఈ విషయం మనిద్దరి మధ్యలో ఉండనీ . ఇంకెప్పుడు ఇంట్లొ తాగాను అన్నాడు . వర్షంలో టెంప్ట్ అయ్యి సిగరెట్ తాగాలనిపించింది , మరి నన్ను చూస్తే మాత్రం టెంప్ట్ కాలేదు , ముద్దు ఇవ్వాలనిపించలేదా ?? మళ్ళీ ముద్దు టాపిక్ తీసుకొచ్చింది మధుర. 


మధుర ! మళ్ళీ ఈ టాపిక్ తీసావు కాబట్టి చెప్తున్న . ముందుగా , వర్షం పడగానే సిగెరెట్ కి నేను టెంప్టు అవడం, వర్షంలో తడవడానికి , గంతులేయడానికి నువ్వు టెంప్టు అవడం , ఈ రెండు యాదృచ్చికంగా జరిగినా ఈ విషయంలో మనం ఎవరికి హాని చెయ్యట్లేదు , ఎవరినీ బాధ పెట్టట్లేదు , మన ఆనందం కోసం , మనకోసం మనం, అవసరమయితే మనం చేసుకున్న ప్రామిస్లు కూడా గాలికొదిలేస్తాం . కానీ ముద్దు అలా కాదు , ఇద్దరి అంగీకారం తో , ఒకరంటే ఒకరికి ఇష్టం తో ,మనసుల కలయిక తో ప్రేమను తెలియచేసే ఒక ప్రకృతి వరం . ఈ రోజుల్లొ ముద్దు ని మలినం చేస్తున్నారు కొంతమంది . ముద్దు పెట్టుకున్న తరువాత సంతోషంతో తన్మయత్వం పొందాలి కానీ , భయంతో బాధ పడడం , తప్పు చేశామని తల్లడిల్లిపోవడం జరగకూడదు . ముద్దంటే ఐస్క్రీమ్ తిన్నంత ఈజీ అయిపొయింది. కానీ .. హలో .. ఆమె గట్టిగా అరిచేసరికి ఇంకా ఎదో చెప్పాలనుకున్నవాడల్లా , టక్కున నోరుమూసుకున్నాడు, కానీ.. తో ఆపేసాడు !! ఏంటి ఈ అర్థరాత్రి నాకు ముద్దు క్లాసు ? బస్సు స్టాపుల్లో , బస్సుల్లో , కాలేజీ దేగ్గరా నన్ను తినేసేలా చూస్తుంటారు . మీరెందుకు అలా కాదు అని నాకు డవుట్ . అందుకే అడుగుతున్నా ..!!! ఆవేశంగా చెప్పింది మధుర ! ఎంచెప్పలో తెలియక గుడ్లప్పగించి చూస్తున్న మోహన్ ని నవ్వాపుకుంటూ ..సరే ఈ అయింట్మెంట్ రాసి వెళ్లండి , సిగరెట్ విషయం మన మధ్యలోనే ఉంటుంది. నో ప్రాబ్లం అంది . తప్పదన్నట్టు అయిష్టంగానే అయింట్మెంట్ తీసుకొని కాలుపై రాయడానికి వంగాడు , అంతే ఒక్కసారిగా తనపైకి లాక్కుని పెదాలపై ముద్దు పెట్టేసుకుంది మధుర !! ఈ హఠాత్పరిణామానికి , చెతిలో అయింట్మెంట్ కిందపడింది . మోహన్ పూర్తిగా మధురపై వాలిపోయాడు !!! ఒక్క క్షణం ఉపిరి ఆడకుండా అవస్థపడ్డారు ఇద్దరు. మెల్లగా సర్దుకుని లేచి , నువ్వు చేసిన పనేం బాలేదు మధుర అన్నాడు . పర్వాలేదు ! అంది నవ్వూతూ . నీకు నవ్వులాటగా ఉందా ? నాకు చాలా ఇబ్బంది గా ఉంది . చిన్నపిల్లవి , ఇలా ప్రవర్తించొచ్చా ? ఎందుకు ఇబ్బంది ? మీరు చేయలేని సాహసం నేను చేసాను సంతోషించండి ! చిన్న పిల్లా అని తప్పించుకుంటున్నారు . నేనంటే మీకిష్టం లేకపొతే అంత పయనుంచి హఠాత్తుగా ఎందుకు కింది కి దూకారు ? నేను డాన్స చేస్తూంటే ఎందుకు కళ్ళార్పకుండా చూస్తున్నారు ?? నేను గమనించాను మీ కళ్ళల్లో ఆనందం , నాకోసమే కదా పరిగెత్తుకుంటూ వచ్చి రూంలోకి తీసుకొచ్చారు. కానీ సంకోచిస్తున్నారు చిన్న పిల్ల అని చెప్పి. మీరు రెంట్ కి వచ్చిన రోజే మీరు నాకు బాగా నచ్చారు ! ఐ లవ్ యు మొహన్ !! కాని మీరెప్పుడు బిజి బిజి ! మాట్లాడే సమయమే దొరకలేదు. అందుకే ఈ అవకాశం వదులుకోదల్చుకోలేదు , నేనేం తప్పు అని ఫీల్ అవటం లేదు , మీరు చెప్పారుగా ఇందాక ఒక తన్మయత్వమ్ !!! అలాగే ఉంది నాకు. ఎందుకంటే మనస్ఫూర్తిగా మిమ్ముల్ని ప్రేమిస్తున్నా , ధైర్యంగా మా ఇంట్లొ చెప్పి పెళ్లి చేసుకుంటా ! ఏంటి , ఎం మాట్లాడరు ? ప్లీజ్ ఒకే చెప్పండి ! ఎం మాట్లాడాను ? నువ్వు షాకుల మీద షాకులు ఇస్తున్నావు. నువ్వు చెప్పింది నిజమే , నాకు నువ్వంటే ఇష్టం ఉంది కానీ మీ ఇంట్లొ సిగరెట్ , అల్కోహల్ , నాన్వెజ్ అలవాట్లు లేని టేనంట్ కావాలన్నారు , ఇక అల్లుడినేలా ఒప్పుకుంటారు ? అందుకే గంట నుంచి నువ్వు అడుగుతున్నావు టెంప్ట్ అవ్వట్లేదా అని , అయ్యాను కానీ కంట్రోల్ చేసుకున్నా ఎందుకంటే ఆ అలవాట్లు అన్ని నాకున్నాయి బట్ అతిగా మాత్రం కాదు. అబద్దం చెప్పి రెంట్ కి దిగాను , పెళ్ళి మాత్రమ్ చేసుకోలేను. పయిగా నీ చదువు ఇంకా పూర్తి కాలేదు , అందుకె నేను తొందరపడలేదు .   

మా ఇంట్లో పెళ్లి గురించి నెను ఒప్పిస్తా . అది నాకొదిలేయండి . ముందు మా అక్క పెళ్లి అవ్వాలి , తరువత మా నాన్న తో మాట్లాడుతా. ఒక నీ ఇష్టం బట్ అప్పటి వరకు నువ్వు ఈ ముద్దు చేష్టలు మానేయాలి . ఇక నేను ఇక్కడ ఉండలేను, ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోతా. నీ చదువైపోయాకా పెళ్లిచేసుకుందాం , అప్పటివరకు ఇద్దరం వెయిట్ చెయాలి. అన్నాడు మోహన్ . సరే బట్ ఒక ముద్దిస్తే నే !!! మధురంగా నవ్వూతూ మోహన్ ని అల్లేసుకుంది మధుర !!! 

Friday, August 25, 2023

వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందు కోవమ్మ

 వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందు కోవమ్మ

మా ఇంటి వేల్పు నీవమ్మ , నా కల్పవల్లి రావమ్మ

మనసార దీవెనీవమ్మ, మమ్మేలు తల్లి రావమ్మా ॥ 2 ॥

వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందు కోవమ్మ

చరణం : 1

అతివల మనసునెరిగి , ఐదవ తనము నోసిగి

ముత్తైదు భాగ్యమిచ్చే , మురిపాల నోము నోచి

వరలక్ష్మి దేవి వ్రతము, వరముల నొసగే తరుణం ॥ 2॥ ॥వరలక్ష్మి దేవి ॥

చరణం : 2

 భక్తి వేల్లువలలోన, భావన లహరివి నీవు

మంగళ రూపిణి రావే, మా బంగారు తల్లి నీవే

నీ పాద సేవ భాగ్యముగా, తరియించు మేము ఎల్లపుడూ ॥ 2 ॥ ॥వరలక్ష్మి దేవి ॥

చరణం: 3

వరలక్ష్మి దేవి సిరి జల్లు, మా ఇంట నిలిచి వర్ధిల్లు,

మమ్మేలు తల్లి హరివిల్లు, నీ వ్రతముల విరిజల్లు

నీ పాద సేవే పదివేలు , మా ఇంట అలరు మురిపాలు ॥ 2॥ ॥ వరలక్ష్మి దేవి ॥

చరణం: 4

అందాల దేవి నీవే, శింగారి సిరుల పంట,

వరలక్ష్మి నోము నోచి, భాగ్యాలు పొందు నంట

వరముల నొసగే తల్లి, పూచినా పున్నాగ మల్లి ॥ 2॥ ॥ వరలక్ష్మి దేవి ॥

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి

 ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ||


 ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవునీవు 

 ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి


 || ఎట్లా నిన్నెత్తు ||


 పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి 

 పూవులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై 

 కలహంస నడకలతోటి ఘల్లుఘల్లుమని నడిచేతల్లి 

|| ఎట్లా నిన్నెత్తు ||


వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయమువుండుము తల్లి

సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణాకల్గి

ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి

ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము అయిదవతనములిచ్చే తల్లి 

|| ఎట్లా నిన్నెత్తు ||


నవరత్నాల నీ నగుమోమె తల్లి వరలక్ష్మీ తల్లి కనకరాసుల కళ్యాణి

కుసుమ కోమల సౌందర్యరాశి లోకపావని శ్రీ వరలక్ష్మీ 

శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి

|| ఎట్లా నిన్నెత్తు ||

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా

 శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా

శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా

శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా


జగముల చిరు నగముల పరిపాలించే జననీ

అనయము మము కనికరమున కాపాడే జననీ

జగముల చిరు నగముల పరిపాలించే జననీ

అనయము మము కనికరమున కాపాడే జననీ

మనసే నీ వసమై, స్మరణే జీవనమై

మనసే నీ వసమై, స్మరణే జీవనమై

మాయని వరమీయవె పరమేశ్వరి మంగళ నాయకి

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా


అందరికన్నా చక్కని తల్లికి --- సూర్యహారతి,

అందలేలే చల్లని తల్లికి --- చంద్రహారతి

రవ్వల తళుకుల కలలా జ్యోతుల --- కర్పూరహారతి

సకల నిగమ వినుత చరణ --- శాశ్వత మంగళ హారతి


శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామదా

శ్రీ గిరి నిలయా గిరామయ సర్వ మంగళా

శ్రీ లలితా శివ జ్యోతి సర్వ కామద

శ్రీ మహాలక్ష్మి శ్రీ వరలక్ష్మి

 శ్రీ  మహాలక్ష్మి శ్రీ వరలక్ష్మి  

శ్రీ రమణి  శ్రీధర  పత్ని  ..

శ్రీ మహాలక్ష్మి శ్రీ వరలక్ష్మి ...


ఇంటింటికీ రావె ఇంతిరోనికై  ..

ఇంతులందరు ఎదురు  చూసేనే ..


శంకరా వందిత కనకధారావార్షిత ..

చారుమతిపూజిత .. సిరిసంపద ప్రదాత ..


శ్రావణమాసమున నోములు సేయగా ..

మా మానసమున సుందర నిలయవై ..

కుందనపు బొమ్మా అమ్మా రావే ..


కదంబ మాలల నవ విధి పూజల ..

పాయసం భక్ష్యాలు నీకు అర్పింతు ..

దీవించగా రావే మాణిక్య మానస .. 


శ్రీ  మహాలక్ష్మి శ్రీ వరలక్ష్మి  

శ్రీ రమణి  శ్రీధర  పత్ని  ..

శ్రీ మహాలక్ష్మి శ్రీ వరలక్ష్మి ...


Wednesday, May 31, 2023

 నాకంటూ ఎవరూ లేరు ..

కోపం ఆవేశం తప్ప !


నన్ను ప్రేమించేవాళ్ళు లేరు ..

నేను నా స్వార్ధం తప్ప !


నా చుట్టూ తిరిగేవాళ్లు లేరు ..

నేనూ నా ఒంటరితనం తప్ప !


నా మదిని గెలిచేవారు లేరు ..

నేను నా ఆశలు  తప్ప !


చివరి మజిలీ కై ఎదురు చూపు ..

చిలిపి నవ్వు తో ముగింపు !


--SR


#mywriting