Saturday, June 28, 2014

My Article "సవాళ్ల దారిలో సాధికారతే లక్ష్యం.." about DWCRA groups published in today's (28.06.14) Adhrabhoomi Daily in Bhoomika Main feature ~~ Rani Sandhya
 
Online Link: http://www.andhrabhoomi.net/content/main-feature-21

సవాళ్ల దారిలో సాధికారతే లక్ష్యం..

  • -రాణి సంధ్య
  • 28/06/2014
వాళ్లలో చదువుకున్నవారు తక్కువ... చదువుకోవాలనే ఆశ ఉన్నా అందుకు అవకాశం లేనివారు ఎక్కువ...
వారు కనీస వసతులు కోరుకోవటం కూడా అత్యాశే... బతుకు బండి నడిపేందుకు నిత్యం కాయకష్టం చేస్తూ వారు కాలంతో పోటీ పడుతుంటారు...
అయినా మాకేం తక్కువ? మేమూ లీడర్లమే..! అంటూ డ్వాక్రా సంఘాలను తమ శక్తికొలదీ చేయూతనిస్తూ ముందుకు నడిపిస్తున్నారు... వారంతా సాధారణ మహిళలే..!
హైదరాబాద్ నగరంలోని కర్మన్‌ఘాట్‌కు చెందిన డ్వాక్రా సంఘాల నేతలు 34 మంది ప్రతి నెలా క్రమం తప్పక కలుసుకుంటారు. అప్పులు, వడ్డీలు, వసూళ్లు ఇలా లెక్కలు చూసుకుని కష్టాలు చెప్పకుని భవిష్యత్ కార్యాచరణ గురించి వారు తీర్మానించుకుంటారు. ఒక్కొక్కరి కింద పదిమంది సభ్యులు కాగా మొత్తం 340 మందికి వారు నేతృత్వం వహిస్తున్నారు. 34 మంది నేతలకు ఏడేళ్లుగా ఇద్దరు మహిళలు దారిచూపిస్తున్నారు. వారే- గండ్లూరి జానకి, హనుమాయమ్మ. ఈ ఇద్దరి పర్యవేక్షణలో చెరి నలభై సంఘాలు ఉన్నాయి.
మహిళలంతా కలిసి ఒక ఆశయ సాధన కోసం కట్టుబడి ఉన్నారు. వారి సమయపాలన, సిద్ధాంతాలు అందరికీ ఆదర్శమే. వారి మీటింగుల్లో జిలుగువెలుగులుండవు, టైంపాస్ స్నేహాలుండవు, తినుబండారాలు, కాఫీ టిఫిన్లు అసలే వుండవు. వారు కలుసుకునేందుకు సొంత స్థలం కూడా లేదు. దగ్గరలో ఉన్న గుడి లేదా పార్కులో ఏడాదికోసారి వీరందరికీ వసతి కల్పించాలంటే పెద్ద కష్టం అంటున్నారు మహిళా నేతలు. హనుమాయమ్మ చదువుకోలేదు కానీ వ్యవహారం చేయగలదు. ఆమెకు గండ్లూరి జానకి చేయూతనిస్తూ గత ఏడేళ్లుగా కలిసి మెలిసి ఎనభై సంఘాలను నడిపిస్తున్నారు. జానకి చదువు, వ్యవహారం రెండింటిలోనూ మేటి. బ్యాంకు లావాదేవీలు చూసుకుంటూ, గ్రామసర్పంచ్‌తో కలిసి పనిచేస్తూ ఎన్ని సమస్యలు ఎదురైనా డ్వాక్రా సంఘాలను నడిపిస్తూ ఆనందాన్ని, తృప్తిని ఆస్వాదిస్తున్నారు.
దేశంలో 1982-83లో డ్వాక్రా సంఘాలు మొదలైనప్పటి నుంచి ఎంతోమంది మహిళలు బ్యాంకుల ద్వారా పావలా వడ్డీ రుణాలు పొందారు. ఎన్ని డ్వాక్రా సంఘాలు వెలిసినా వాటిలోని మహిళలకు గుర్తింపు తక్కువే. వారి ఆర్థిక స్థాయిలో కాని, జీవన విధానంలో కానీ పెద్దగా మార్పులు లేవు. ప్రభుత్వము చెప్పేదొకటి, చేసేదొకటి అనే మాటను నిజం చేస్తూ ఇప్పుడు పావలా వడ్డీ కాస్తా రూపాయి వడ్డీగా మారింది. సంఘాలు స్థాపించిన మొదట పావలా వడ్డీకే రుణాలిచ్చినా, తరువాత దాన్ని రూపాయి వడ్డీగా మార్చేసారని మహిళలు చెబుతున్నారు. తమకు రుణ మాఫీలు అక్కర్లేదని, పావలా వడ్డీకే రుణాలిస్తే చాలంటున్నారు మహిళా నేతలు. గండ్లూరి జానకి ‘క్రాంతి’ పేరుతో 2007న డ్వ్రాక్రా సంఘం స్థాపించగా, హనుమాయమ్మ ‘సమైక్య గణపతి’ పేరుతో స్థాపించారు. ఈ సంఘాలు రుణావసరాలున్న మహిళలను కష్టకాలంలో ఆదుకుంటున్నాయి.
నాయకత్వ లక్షణాలు నిజానికి ఎవరి సొంతం కాదు. చదువుకుని బట్టో, నడిపించే సంఘాన్ని బట్టో వాటిని నిర్ణయించలేము. ఈ సంఘాల్లో నియమ నిబంధనలు ఎంత ముఖ్యమో వీరు ఆచరించి చూపిస్తున్నారు. వార్షిక సభ్యత్వ రుసుము వంద రూపాయలే అయినా, సభకు ఆలస్యంగా వస్తే అపరాధ రుసుము వసూలు చేస్తూ, ఆ మొత్తాన్ని కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ఉపయోగిస్తున్నారు. సమాజ సేవ కూడా మిళితమైతే నలుగురికి సాయపడినట్టు ఉంటుందని, ఓ మహిళకు రెండు మూత్రపిండాలు పాడైపోతే ఆమెకి నగదు ఇచ్చి అవసరానికి ఆదుకున్నారు. తమ సమావేశాలకు వసతి కల్పిస్తున్న గుడికి ఐదు వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. జానకి ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను సంఘం సభ్యుల కోసం నిర్వహించారు. ప్రతి సమావేశంలో అందరూ తమను తాము పరిచయం చేసుకుని తమ గురించి తెలియజేయాలి. ఈ పద్ధతి నూతన సభ్యులకు చక్కటి అవగాహన కల్పిస్తుంది. పరస్పరం అభిప్రాయాలను పంచుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి నూతనోత్సాహాన్ని కలిగిస్తుందని వారి నమ్మకం.
డ్వాక్రా సంఘాలు మహిళల అభ్యున్నతికి చిహ్నంగా నిలుస్తున్నాయ. ఇవి చాలాకాలంగా పని చేస్తున్నా పూర్తి స్థాయలో మహిళల ఆర్థిక కష్టాలను నిలువరించలేకపోతున్నారు. మైక్రో ఫైనాన్సు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వృద్ధాప్య పెన్షను వంటివి కొంత చేయూతనిస్తున్నా ఇంకా ప్రగతి బాటకి వీరు దూరమే. నెలకి వంద పొదుపు చేస్తూ వీరు తమ ఆర్థిక భారాన్ని తామే బాధ్యతగా పంచుకుంటున్నారు. ఆర్థిక అవసరాలే వీరందరినీ ఒక్కటిగా కలిపింది, నిలిపింది. ఇంత చేసినా వీరికి తాగునీరు, సొంత ఇళ్లు వంటివి కలగానే మిగిలాయి.
ఒకరా ఇద్దరా..? 34 సంఘాలంటే 340 మంది సభ్యులు..! ఎవరైనా సరే తీసుకున్న అసలుకు ఒక్క నెలలో వడ్డీ ఎగ్గొడితే? అసలుకే ఎసురు వస్తే? పదుల సంఖ్యలో ఉన్నా ఫర్వాలేదు కానీ వందల సంఖ్యలో ఎగ్గొట్టేవారు ఉంటే సంఘాల పరిస్థితి ఏంటి? ఇలాంటి సంఘటనలు కూడా ఎదుర్కొన్నామని, మీటింగులకు రాని మహిళల ఇంటికి వెళ్లి వాకబు చేస్తే వారు ఊరు విడిచి వెళ్లినట్లు, లేదా అకస్మాత్తుగా కొందరు జబ్బు పడడం, రుణం తీసుకున్న మహిళ చనిపోవడం.. ఇంట్లో భర్త లేదా అత్తమామల సాధింపులు, అనుమానాలు.. ఇలా ఎన్నో సమస్యలు చూసామని, కొన్ని తమ పరిధిలో ఉన్నా లేకున్నా తామే బాధ్యత వహించాల్సిందేనని జానకి చెబుతున్నారు. గత ఏడేళ్లలో ఇలాంటి సవాళ్లనెన్నో ఎదుర్కొన్నామని, బ్యాంకులకు తామే జవాబుదారి అని అందుకే చాలా జాగ్రత్తగా సభ్యులని ఎన్నుకోవటం, వారి పూర్తి వివరాలు కనుక్కోవటం, ఎప్పుడైనా అనుకోని సమస్య వస్తే ఆర్థిక భారం ఎక్కువైనా భరించేలా తమని తాము ముందే సిద్ధం చేసుకుంటామని ఆమె చెప్పారు. ఈ బాధ్యత కేవలం సభ్యుల మధ్య మాట సర్దుబాటు వరకే పరిమితం. డ్వాక్రా సంఘాలు తామున్న ప్రాంతంలో డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ దీపాలు లాంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళతారు. పిల్లల చదువులు, వారికి ఉచితంగా పుస్తకాల పంపిణీ లాంటి సమాజ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాయి. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ, బ్యాంకులు, డ్వాక్రా సంఘాల సభ్యులు ఇలా అందరూ కలిసి ఒకరికొకరు సహకరించుకుంటేనే అభివృద్ధి సాధ్యం. అభిప్రాయ భేదాలున్నా అవసరాలు వాటిని అధిగమించేలా చేస్తాయని ఈ మహిళలను చూసి అర్థం చేసుకోవచ్చు. ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా సభ్యులకు ఎలాంటి కష్టం రాకుండా చూడడం డ్వాక్రా నేతల ముఖ్యమైన బాధ్యత.
జాతిపిత మహాత్మాగాంధీ తన ఆత్మకథలో- ‘‘ఏ సంఘానికైనా తప్పులు లేని లెక్కలే ప్రాణం.. లెక్కలు సరిగా లేకపోతే సంఘానికి పెద్ద అపకీర్తి వస్తుంది. లెక్కల్ని సరిగాను, శుద్ధంగాను ఉంచకపోతే సత్యాన్ని రక్షించలేము’’ అని పేర్కొన్నారు. మరి అలాంటి లెక్కలు చూసే బాధ్యత డ్వాక్రా సంఘాల సభ్యులదే. ప్రతి సంఘంలో ముగ్గురు సభ్యులు ఈ లెక్కలు, జమాఖర్చులు రిజిస్టరు, సంరక్షణ, రుణాలు- వడ్డీలు చూసే బాధ్యతను తీసుకుంటారు. వీరు ఏ చిన్న తప్పు చేసినా ఆ తప్పును సంఘం సభ్యులందరూ పంచుకుని సరి చేయవలసిందే. నిజానికి ఈ సంఘాల నిర్వహణ ఒక వ్యాపార సంస్థను నడిపినట్టే లెక్క. ఈ బాధ్యత ఓ అకౌంటెంట్, ఓ వ్యాపారి చేసే పనికన్నా తక్కువేం కాదు.
డ్వాక్రా సంఘాల ద్వారా తాము గొప్పగా బాగుపడింది లేకున్నా, స్వశక్తిపై నమ్మకంతో ఏదో ఒకటి సాధించాలనే తపనతో, నలుగురికి సాయపడాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నారు వీరు. సంపన్న మహిళలు క్లబ్బుల చుట్టూ, పబ్బుల చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేస్తుంటే, వీరు మాత్రం ఆ డబ్బు కోసమే బృందాలుగా ఏర్పడి ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. ఈ మహిళలు నిజంగానే స్ఫూర్తి ప్రదాతలు. ముఖ్యంగా మధ్య తరగతి మహిళలకు వీరు ఎంతో ఆదర్శప్రాయులు. ఉచితంగా డబ్బు ఇస్తామని ఎర వేసి, ఎంతోమందిని నిలువునా ముంచేసిన మల్టీ లెవల్ మార్కెటింగ్ సంస్థల వైపు కాకుండా, ప్రభుత్వమిచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని నెమ్మదిగానైనా పురోగతిని సాధించే ప్రయ త్నం ఈ మహిళలది. వీరి అడుగులు చిన్నవే కానీ- చిరకాలం నిలిచిపోయే ఘన చరిత్రకు అవి గట్టి పునాదులు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు మరిన్ని సంక్షేమ పథకాలను, ప్రో త్సాహాలను ఇవ్వాల్సిన తరుణం ఇది.