Thursday, January 23, 2014

My Article "Shramadanam...Vellivirise chaitanyam...!" published in Today's (07.01.14) Andhrabhoomi Daily in Bhoomika~~ Rani Sandhya

శ్రమదానం.. వెల్లివిరిసే చైతన్యం
-రాణి సంధ్య 07/01/2014

Online Link: http://www.andhrabhoomi.net/content/shrama
...
రోజూ లక్షలాదిమంది హైదరాబాద్ నగర రోడ్లపై ప్రయాణిస్తుంటారు. కాని మనకెవ్వరికి రోడ్డుపై ఉన్న గుంతలు పెద్ద ఇబ్బందిగా అనిపించదు, అసలు వాటివలన దారినపోయేవాళ్లకి కలిగే ఇబ్బంది, జరిగే ప్రమాదాలు కనిపించవు. మామూలుగా గుంతలు ప్రమాదాలకి హేతువుగా మారుతుంటే వర్షపునీరు నిండి అవి మృత్యువు ఒడికి చేరుస్తున్నాయి.

అసలు ఈ గుంతలు పూడ్చి ప్రమాదాలను ఆపేస్తే??- ఈ ఆలోచన ఓ వ్యక్తిని చైతన్యపరిచింది. ముందుకి నడిపించింది. రైల్వే ఉద్యోగిగా విరమణ పొందాక తిరిగి ఇన్ఫోటెక్‌లో ఉద్యోగరీత్యా హైదరాబాదు వచ్చారు కాట్నం బాలగంగాధర తిలక్. ఉద్యోగంలో చేరడానికి వెళ్తున్న మొదటి రోజే ఆయనకు హైదరాబాదు రోడ్లు తమ గజిబిజి గతుకుల ప్రతాపాన్ని చవి చూపించాయి. హైదర్షాకోట్ సమీపంలో వర్షంనీరు నిండిన గుంతలతో స్వాగతం పలికాయి. సర్దుకుపోయే లోపే పక్కనే వెళ్తున్న బడి పిల్లలపై బురద నీరు చిమ్మడంతో పాపం వాళ్లు బిక్క మొహాలు వేసి సిగ్గుతో అక్కడినుంచి పరుగు తీశారు. ఈ సంఘటన ఆయన్ని చాలా బాధించింది. అదే రోజు గతుకుల రోడ్డు మూలంగానే ఇద్దరు యువకులు ప్రమాదానికిగురి అవ్వడం ఆయన్ని మరింత కృంగదీసింది. ఆ రోజే ఆయన దృఢంగా నిర్ణయించుకున్నారు- ఈ గుంతలని తానే స్వయంగా పూడ్చాలని. దాంతో తర్వాత రోజు పదివేలుపట్టి స్వయంగా ఆరు లారీల మొరం (మట్టి) తెప్పించి 300 ఎంటిఎస్ రోడ్డు మొత్తం గుంతలు పూడ్చారు. అది చూసి బడి పిల్లలు సంతోషంతో ధన్యవాదాలు తెలపడం ఆయనకు చాలా తృప్తిని, విశ్వాసాన్ని కలిగించింది.
ఈ సంఘటన జరిగి నాలుగేళ్లు గడిచింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్విరామంగా ఎక్కడ ఏ రోడ్డుపైన గుంతలు కనిపించగానే ఒక పార, పలుగు, రెండు గంపలు, గన్నీ బ్యాగులలో మిక్స్చరు కారులో తీసుకుని వెళ్లి తన భార్య సహాయంతో గుంతలు పూడ్చేవారు.

లక్ష రూపాయల జీతంతో చేసే ఉద్యోగం కూడా ఆయనకు ఈ సేవను మించిన సంతృప్తిని ఇవ్వలేదు. దాంతో తన సమయాన్ని మొత్తం శ్రమదానానికే కేటాయించడానికి నిర్ణయించుకుని ఉద్యోగం వదిలేసి తనకొచ్చే పెన్షన్ డబ్బుతో నిర్వహించారు. మొదటి రెండేళ్ళు తన సొంత డబ్బుతో గడిచినా, మెల్లమెల్లగా డబ్బుకు ఇబ్బందవ్వడంతో రోడ్డు ప్రక్కన మున్సిపాలిటీ వారి లారీలోంచి డాంబరు మిక్స్చరు తీసుకెళ్లడం, వారు అడ్డుకోవడం, తరువాత కమిషనర్ సహాయంతో రెండేళ్లుగా సాఫీగా నిర్వహించారు. అయితే ఈమధ్యే కమిషనరు మారటం, కొత్త కమిషనర్‌కూడా తనకు సహాయం కొనసాగిస్తాననడం తనకు చాలా ఆనందం కలిగించిందని చెప్పారు తిలక్. తనకంటూ ఒక సహాయ బృందం కూడా లేకుండా ఇప్పటివరకు దిల్‌సుక్‌నగర్, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, మలక్‌పేట, రాయదుర్గం, మెహదీపట్నం, నానక్‌రాంగూడా, బోయిన్‌పల్లి, సనత్‌నగర్, బాలానగర్, ఇలా నగరమంతా తిరిగి నాలుగేళ్లలో మొత్తం 762 గుంతలు పూడ్చారు. మొదట్లో తను ఒక్కడే వెళ్లి ఇలా చేయడం ప్రజలు వింతగా చూసే వారని, ఎవరో మున్సిపాలిటీ వ్యక్తీ అనుకోని పట్టించుకునేవారు కాదని, సహాయానికి కూడా ముందుకొచ్చేవారు కాదని తెలిపారు. కొంచెం లోతుగా ఆలోచించగా తానూ చేస్తుంది తనకే తెలుస్తుంది కాని మిగతావారికి అర్థం కావట్లేదు అని గమనించి ‘శ్రమదానం’ అనే బోర్డు పెట్టడంతో ప్రజలు బాగా స్పందించి తనతోపాటు శ్రమిస్తున్నారని, వారిలో ఆడ మగ చిన్నా పెద్దా తేడా లేకుండా, చదువుతో సంబంధం లేకుండా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నుంచి రోజు కూలీల వరకు ప్రతి ఒక్కరు ఇప్పుడు ముందుకొచ్చి శ్రమదానంలో పాల్గొంటున్నారని వివరించారు తిలక్.

తనకు ఎవరూ సహాయానికి రాని సమయంలో ఆ దేవుడే మనిషి రూపంలో వచ్చి సాయపడ్డాడని ప్రగాఢంగా విశ్వసిస్తారు తిలక్. ఒక రోజు ఎవరు లేక తను ఒంటరిగా రోడ్డు పూడుస్తున్నప్పుడు, పైగా అత్యవసరంగా పెళ్లికి కూడా వెళ్లాల్సిన సమయంలో ఇద్దరు వ్యక్తులు తమకు తాముగా వచ్చి సాయపడ్డారని, అందువలన తన పని చాలా సులువుగా, తొందరగా అయిపోయిందని, వారు వెళ్తున్నప్పుడు పేర్లు అడగగా ఒకరు బసవయ్యా అని ఇంకొకరు శివయ్యా అని, పైగా మేము ఒకే చోట నివసిస్తామని చెప్పటంతో తానూ చాలా ఆశ్చర్యపోయానని, ఈ సంఘటనతో తనలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపిందని, తానూ నిర్విరామంగా కృషి చేయడానికి అదే కారణం అని చెప్పారు.

తల్లిదండ్రులు లోకమాన్యుడి పేరు పెట్టగా ఆ పేరుని ఆయన నిజంగానే సార్థకం చేసుకున్నారు. అరవై ఐదు ఏళ్ళు నిండినా కూడా ఆయన చురుకుగా నవ యువకుడిలా పనిచేస్తారు. అదే ఉత్సాహం అదే సామర్థ్యం అదే నిరాడంబరత. తానూ చేసిన సేవకు గుర్తింపుగా 2013లో ప్రభుత్వం నుండి ఉగాది పురస్కారం, జస్టిస్ చంద్రశేఖర్‌గారి చేతుల మీదుగా సన్మానం పొందారు.

ముంబై పూనె వంటి నగరాల్లో గుంతలు ఏర్పడితే ఫిర్యాదు చేయడానికి హెల్ప్‌లైన్లు ఉన్నాయి. హైదరాబాదుకి ఆ సౌకర్యం లేదు కాని తిలక్ గారికి ఫోన్ చేసినా ఈమెయిల్ చేసినా ఆయన వెంటనే స్పందిస్తారు. ఎంతదూరమైనా ప్రయాణించి గుంతలు పూడుస్తారు. ‘‘దేశానికి యువత మూలాధారం, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కూలీ అయినా ఉద్యోగి అయినా వ్యాపారస్తుడైనా వారి వారి కుటుంబాలను పోషించుకుంటూ దేశంపై భారాన్ని తగ్గిస్తున్నారు, దేశానికి ఆదాయం పెంపొందిస్తున్నారు. వారిని రక్షించుకోవాలి’’- ఇదే ఆయన లక్ష్యం!

No comments:

Post a Comment