Thursday, January 15, 2015

My Article "వినోదానికి పోతే.. ఊబకాయం..!!! " ( Vinodaniki Pote Ubhakaayam) in Today's (13.01.2015) Andhrabhoomi Daily in Bhoomika's Main-feature~~ Rani Sandhya

వినోదానికి పోతే.. ఊబకాయం..!
-రాణి సంధ్య aranisandhya777@gmail.com 13/01/2015

Online Link:
http://www.andhrabhoomi.net/content/entertainment-0

థియేటర్‌కు వెళ్లి సినిమా చూసిన ప్రతిసారీ వినోదంతో పాటు కొవ్వును కూడా మనం కొని తెచ్చుకుంటున్నామా..?
మనకి ఇష్టం ఉన్నా, లేకున్నా సినిమా చూస్తూ అనవసరమైన చెత్తను తింటున్నామా..?
పిల్లలైనా, పెద్దలైనా కాలక్షేపం కోసమో, అప్ప టికప్పుడు ఆకలి తీర్చుకోవడం కోసమో - జంక్ ఫుడ్డే శరణ్యమా..?
రెస్టారెంట్‌కి వెళ్లినా.. ఏదైనా ఫంక్షన్‌కు హాజరైనా- అక్కడ లభించే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు సినిమా థియేటర్‌లో మాత్రం ఎందుకు అం దుబాటులో ఉంచరు..?
మనం మామూలుగా ఏదైనా హోటల్‌కి వెళ్లినా రకరకాల ఆహార పదార్థాలు మనకు అందుబాటులో ఉంటాయి. అందులో పండ్లు, పచ్చికూరగాయ ముక్కలు ఆకలి తీర్చడంతో పాటు మన ఆరోగ్యానికీ మేలు చేస్తాయ. ఉపవాస దీక్షలు చేసేవారికి, పథ్యం (డైటింగ్) పాటించే వారికి పండ్లు, మొలకలు, పచ్చికూరగాయ ముక్కలు అవసరం. అలాగే ఏ పెళ్లికి వెళ్లినా, ఎలాంటి పార్టీలలో అయినా సరే, బిజినెస్ మీటింగ్‌ల్లో అయినా సరే అన్ని పదార్థాలతో పాటు పండ్లు, పచ్చికూరగాయ ముక్కలు (సలాడ్) తప్పనిసరిగా వడ్డిస్తారు. మరి సినిమా థియేటర్లలోనే ఈ సౌకర్యం ఎందుకు లేదు? తాజా పండ్ల రసాలు, పండ్ల ముక్కలు, కూరగాయ ముక్కలు థియేటర్లలో ఎందుకు అమ్మరు? మల్టిప్లెక్సుల్లో ముందుగా ఆర్డర్ ఇస్తే స్నాక్స్, డ్రింక్స్ మన సీటు వద్దకు వచ్చినట్టే ఇవి కూడా అమ్మడానికి పెడితే ఏంటి నష్టం..? ఇది ఆలోచించవలసిన విషయమే కదా!
పండ్ల ముక్కలకి, కూరగాయ ముక్కలకి, తాజా పండ్ల రసాలకీ సినిమా థియేటర్ అనువైన మార్కెట్ స్థలం కాదా? అన్ని తినుబండారాలతో పాటూ ఇవి కూడా సినిమా థియేటర్లలో అవసరం అని ఎవరూ భావించడం లేదా? సినిమా చూసే రెండున్నర గంటల సమయానికి ఇలాంటివి ఒకప్పుడైతే అవసరం లేదనే చెప్పొచ్చు. కానీ రోజులు మారాయి. జీవన విధానం మారింది. అవసరాలు మారుతున్నాయి. డైటింగ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఏర్పడింది. ఎక్కడున్నా, ఏమి తిన్నా ఆహారంపై జాగ్రత్త అనివార్యం. సినిమాకి వెళితే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇంటర్వెల్ కోసమే ఎదురుచూస్తారు. చాలామంది జంక్ ఫుడ్డే ఇష్టపడ్డా.. కచ్చితంగా పథ్యం చేసేవారు కూడా ఉంటారు. ఇలాంటివారు సినిమాకి వెళితే అక్కడ వారు తినదగిన ఆహారం పండ్లు, కూరగాయలు లభిస్తే వారు మానసిక ఉల్లాసం పొందడమే కాదు, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది. థియేటర్లలో పలు రకాల స్టాల్స్ పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్న యాజమాన్యాలు ఈ విషయమై సానుకూలత వ్యక్తం చేస్తే బాగుంటుంది. వందలకు వందలు ఖర్చు పెట్టి చిరుతిళ్ళు తినేవారు ఉన్నారు.
ఆహార నియమాలు పాటించే వారు కూడా అదే డబ్బు వెచ్చించి మంచి ఆహారం కొనేందుకు వెనకాడరు.
అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ప్రతి శని, ఆదివారాలు కుటుంబ సభ్యులంతా కలిసి సినిమాలకి వెళ్ళటం ఆనవాయతీగా మారింది. పెద్దవారికి ఆరోగ్య రీత్యా, మిగతావారికి డైటింగ్ రీత్యా మేలైన ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాలి. జంక్‌ఫుడ్‌కు అలవాటుపడ్డ పిల్లలు అధిక బరువుతో, అందవికారంగా మారడం చూస్తూనే ఉన్నాం. పిల్లల్లో జంక్‌ఫుడ్ అలవాటును మాన్పించాలంటే సినిమా థియేటర్లలోనూ పలు రకాల పండ్లతో తయారు చేసే సలాడ్లు, రసాలు అందుబాటులో ఉంచాలి. అన్ని వర్గాల జీవనశైలికి అనుగుణంగా రెస్టారెంట్లలో మెనూ మార్చినపుడు, థియేటర్లు కూడా స్టాల్స్‌ను మార్చడం మనం చూశాం. ఒకప్పుడు టీ, కాఫీ, సమోసా, చిప్స్, పఫ్స్, కూల్‌డ్రింక్స్‌కే పరిమితమైన థియేటర్లో నేడు వాటర్ బాటిళ్లు, పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, స్వీట్‌కార్న్, చికెన్ స్నాక్స్ కూడా లభిస్తున్నాయ. మరి ఆరోగ్యానికి అత్యవసరమైన పండ్లు, కూరగాయల సలాడ్లు, పండ్ల రసాలను అందుబాటులోకి తెస్తే తప్పేమిటి? ముందుగానే డబ్బులు తీసుకుని తయారుచేస్తే రిస్క్ ఏముంది? సాండ్విచ్‌లు అందుబాటులో ఉంటున్నా ఇప్పుడు వైద్యులు బ్రెడ్ కూడా తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. వీటి రుచులను ఆస్వాదిస్తూ సినిమా చూడడం ఎంతో ఆనందం కదా!
అయితే, కొన్ని నగరాల్లో మల్టీఫ్లెక్స్ థియేటర్లలో బ్రెడ్ సాండ్వి చ్ వంటివి అమ్ముతున్నారు. ఆరోగ్యవంతమైన కీరా దోసకాయ, క్యారెట్ ముక్కలు లేకుండానే వాటిని అమ్ముతున్నారు. చవకగా ఏవి దొరికితే అవి పెట్టి అధిక ధరలకు అమ్ముతున్నారు. ప్రేక్షకుడికి ఆ సమయానికి ఏది దొరికినా అవసరం కాబట్టి తీసుకోక తప్పదు. పైగా బయటి నుంచి తినుబండారాలు తీసుకుని రావడం నిషేధం కావడంతో లోపల ఏం దొరికినా తీసుకోవాల్సిందే. కాగా, ఎక్కువ శాతం ప్రేక్షకులు ఫాస్ట్‌ఫుడ్‌నే ఇష్టపడతారని, సలాడ్లు, జ్యూసులు ఎక్కువగా అమ్ముడుపోవని స్టాల్స్ యజమానులు చెబుతుంటారు. సినిమా చూస్తూ ఆరోగ్యం కాపాడుకోవడం మంచిదేనని, ఆహార నియమాలు పాటించేవారికి సలాడ్లు, జ్యూసులు చాలా ఉపయోగకరమని ప్రేక్షకులు కూడా అంటున్నారు. నచ్చిన పదార్థాలను అందుబాటులోకి తెస్తే డిమాండ్ తప్పక ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్థులకి, ఇంటికి లేదా రెస్టారెంట్‌కి వెళ్ళే సమయం లేక డైరెక్టుగా సినిమాలకి వెళ్ళేవారికి, సెకండ్ షో సినిమాలు చూసేవారికి జంక్‌ఫుడ్ బదులు మంచి ఆరోగ్యవంతమైన ఆహారం అందుబాటులో ఉండాలి. కుటుంబం మొత్తం సినిమాకి వెళ్తే కాస్త వయసు పైబడ్డ వారికి ఏమీ కొని ఇవ్వలేని పరిస్థితి నేడు ఎదురవుతోంది. ఆరోగ్య రీత్యా పెద్దవారికి జంక్‌ఫుడ్ ఓ సమస్యే. అలాంటివారికి పండ్లు కూరగాయల సలాడ్లు, రసాలు బాగా ఉపయోగపడతాయి. ఉపవాసదీక్షలు చేసేవారికి థియేటర్‌కి వెళ్ళి ఏం తినాలనే టెన్షన్ ఉండదు. ఇలా అన్ని వయసుల వారికి ఆరోగ్యం, ఆనందం రెండూ లభిస్తాయి. ఉప్పు శాతం అధికంగా ఉండే పాప్‌కార్న్, చిప్స్ వంటి చిరుతిళ్లు ఏ వయసు వారికీ మంచివి కావు. పోషక విలువలున్న ఆహార పదార్థాలను తినాలని ప్రచారం చేయడం కాదు, వాటిని అందు బాటులోకి తేవాలి. సినీ థియేటర్ యాజ మాన్యాలు ఈ విషయంపై దృష్టిపెడితే ప్రేక్షకుడికి ఆరోగ్యం, ఆనందం కూడా లభిస్తుంది.