Wednesday, October 2, 2013

  • My Article "ఆంటీ..అని పిలవొద్దు ప్లీజ్..!" published in Today's (02.10.13) Andhrabhoomi Daily in Bhoomika's Mainfeature~~ Rani Sandhya

    To Read Online follow this Link : http://www.andhrabhoomi.net/content/aunty
     

  • -రాణి సంధ్య aranisandhya777@gmail.com
  • 02/10/2013
‘ఆంటీ’ అని పిలిస్తే ఎంతమంది మహిళలు ఇష్టపడతారు? ఇది అంత త్వరగా తేలే సంగతీ కాదు, అలా అని అంత పెద్ద విషయమూ కాదు. నేటి ఆధునిక అమ్మాయిలు,అబ్బాయిలు ఆడవారు కనిపిస్తే చాలు వయసును సైతం చూడకుండా ఆంటీ అనే బిరుదు అంటించేస్తారు. ఇది చాలామంది ఆడవారికి మింగుడుపడని వి షయమనే చెప్పాలి. ఐదేళ్ల బాలుడి నుంచి మొదలుపెడితే కుర్రాళ్లు, నడివయస్కులు కూడా ఈ పదాన్ని అవలీలగా వాడేస్తుంటారు. ఇద్దరు ఆంటీలు మాట్లాడుకుంటున్నారని చెప్పడానికీ, ఇద్దరు మహిళలు మాట్లాడుకుంటున్నారని చెప్పడానికీ తేడా లేదా? ఊరు, పేరు తెలియక పోతేపోనీ, అంతమాత్రాన ఆంటీ అనే ఎందుకు అనాలి? మర్యాదగా ‘మేడమ్’ అని పిలవవచ్చుగా..? చదువుకున్న వారు, చదువులేనివారు అందరూ సులువుగా పిలిచే పదం ‘ఆంటీ’.
ఉదయం లేచిన దగ్గరనుంచి మహిళలు ఎంతోమందిని చూస్తుంటారు. అన్ని వర్గాల వారూ మహిళను పలకరిం చేందుకు వాడే పదం ఆంటీ. టైలర్ దగ్గరికి వెళ్తే ఆంటీ.. కిరాణా దుకాణానికి వెళ్తే ఆంటీ... చుట్టాలు, స్నేహితులు, పక్కింటివాళ్లు, అపరిచితులు అందరూ మహిళలను పలకరించే పదం ఆంటీ. సినిమాకి వెళితే అక్కడ టికెట్లు ఇచ్చేవారు, చిప్స్ అమ్ముకునే వారు.. ఎవరు ఆంటీ అని పిలిచినా మహిళలు పలకాల్సిందే. ఇక వేరే దారేది..?
ఎందుకిలా..? ఇంగ్లీషులో ఆంటీ అంటే- తెలుగులో అర్థం అత్తయ్య అని చెబుతారు. అత్తయ్య అనే పిలుపులోని తీయదనం ఆంటీలో ఎక్కడుంది? పైగా చాలామంది ఆడవారికి ఆ ఆంటీ అనే పదమే నచ్చదు. దానికి కారణం- ఆ మధ్య వచ్చిన ఆంటీ అనే సినిమా అని, ఆ సినిమాలో ఆంటీ అనే దృక్పథం ఆడవారికి అస్సలు నచ్చలేదని గొంతెత్తి చాటాలనుకుంటారు చాలామంది ఆడవాళ్లు. ఇలా అనిపించినపుడు నేను కొంతమందిని ప్రశ్నించగా వారు కూడా ఇదే భావన తెలియజేసారు. ఒక మహిళ ఇలా తన అభిప్రాయం ఇలా చెప్పారు. ‘అసలు ఆ ఆంటీ అనే పదమే చాలా జుగుప్సగా అనిపిస్తుంది’!
సరే.. తప్పేముందిలే.. అని కాసేపు అనుకుంటే, ఆంటీ అని పిలవడానికి, పిలిపించుకోవడానికి ఏదైనా వయసు కొలమానం ఉందా? ఉంటే ఇద్దరి మధ్య వయసు తేడా కనీసం పదిహేను ఇరవై ఏళ్లు ఉండాలా వద్దా? అవతలి వారు వయసు తేడా లేకుండా అపుడే పెళ్లయిన వారు కనిపిస్తే చాలు ఆంటీ అంటారు. కాస్త బొద్దుగా, లావుగా వుంటే పెళ్లయినా, కాకున్నా ఆంటీ అనే అంటారు. ఇది ఆడవారికి ఒక మానసిక యాతనే అని చెప్పొచ్చు. వద్దంటే ఇంకా పరిహసిస్తారు.
ఆ పదాన్ని అష్ట వంకర్లు తిప్పి వ్యంగ్యానికి, హాస్యానికి వెటకారానికి కొందరు ఉపయోగిస్తారు. ఇక ఇంటర్నెట్‌లో ఆంటీ అని కొడితే చాలు- వేల రకాల బూతు సైట్లు తెరుచుకుంటాయి. ఇది మరింత బాధాకరమైన విషయం. ఆంటీ అంటేనే బూతు పదం అని భావిస్తున్నారు కొంతమంది మహిళలు. చాలామంది ఆ పదాన్ని అసహ్యించుకుంటామని చెబుతారు. ఈ సమస్య చాలా జటిలమైనది . మమ్మల్ని ఆంటీ అని పిలవద్దు అని చెప్పలేరు మహిళలు. అలా అని ఆ పిలుపుని భరించలేరు కూడా. సరే చెప్తే పిలవడం మానేస్తారు కదా అని అనుకుంటే ఎంతమందికి చెప్పగలరు. ఉదయం లేచిన దగ్గరనుంచి ఎంతోమందిని కలుస్తాం. అలా పిలిచిన ప్రతి ఒకరికి చెప్పాలంటే కూడా విసుగే మరి. మధ్యలో మొహమాటం అనే ముసుగు కూడా ఉంటుందిగా.
మిమ్మల్ని ఎవరైనా ఆంటీ అని పిలిస్తే మీరెలా స్పందిస్తారు..?- అని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని అయిన మహిళని ప్రశ్నించగా...‘నాకు వరసకు కోడలో, అల్లుడో అయితేనో లేదా నాకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉండి, మా కుటుంబంలో కలిసిపోయిన వారి పిల్లలు పిలిస్తేనో నేను సంతోషంగా పలుకుతా. కానీ బయటివారు, అసలు పరిచయం లేనివారు ఏదో ఒక అవసరానికి ఐదు నిముషాలు కనిపిస్తే ఆంటీ అని పిలిస్తే మాత్రం చాలా ఎబ్బెట్టుగా, అసహ్యంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఈ విషయంలో వాగ్వివాదం కూడా జరిగింది. మనం గట్టిగా మాట్లాడితే మానసిక పరిపక్వత లేదు, అనుకూల దృక్పథం (పాజిటివ్ థింకింగ్) లేదు అంటారు’- అని వివరించారు.
ఒక గృహిణిని అడిగితే- ‘మా పక్కింటి వారు ఆహ్వానిస్తే నేను వారి పాప పుట్టిన రోజు పండగకు వెళ్లాను. ఆంటీ భోంచేసి వెళ్లండని ఆ పాప అంది. అంతే నా మనస్సు చివుక్కుమంది. అక్కడ ఒక్క నిముషం కూడా నిలవాలనిపించలేదు. మా బాబు కన్నా వారి పాప ఐదేళ్లు చిన్న. అంత మాత్రాన నేను వయసు మళ్లిన దానిలా కనిపిస్తున్నానా? అనిపించింది. చాలా కోపం కూడా వచ్చింది. అసలు వారికి సంస్కారం ఉందా? అని అడగాలనిపించింది. నువ్వు నాకన్నా చాలా పెద్ద అని మొహం మీదే చెప్పినట్టు అనిపించింది. ఇక ఆ తరువాత ఆవిడ ఎప్పుడు కలిసినా నేను మనస్ఫూర్తిగా మాట్లాడలేదు. అదేదో శత్రువుని చూ సిన భావన నాకు’ అని చెప్పుకొచ్చారు.
నేటి కాలంలో ఆంటీ అనే పిలుపు మర్యాదకు చిహ్నం కాదు. నేటి మహిళ ఆ పదాన్ని విభిన్న కోణంలో చూస్తోంది. ఆ పిలుపు మానసికంగా మనుషులని దూరం చేస్తున్నది. ఎలాంటి పరిచయం లేకపోతే ‘మేడం’ అనే పదం ఉత్తమమైనది అని నేటి మహిళ భావిస్తున్నది. ఈ పోటీ ప్రపంచంలో ఆడ, మగ యవ్వనంగా కనిపించాలి. యువతలో కలిసిపోవాలని తమను తాము ఎంతో ప్రయాసపడి తీర్చి దిద్దుకుంటున్నారు. నేడు భార్యాభర్తలు, అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ములు అందరూ ఒకరినొకరు పేర్లతోనే సంబోధించుకుంటున్నారు. ఇది నేటి సినిమాల్లో కూడా మనం చూస్తున్నాం. హాయిగా నువ్వు, నేను ఒక్కటే అనే భావన కోసం. నీకు, నాకు వయసులో తేడాలేదని చెప్పడం కోసం పేర్లతో పిలుచుకుంటున్నాం. మన భావాలు కలుస్తాయి, మన ఆలోచనలు ఒక్కటే అని కూడా చెప్పకనే చెబుతాయి. అలాంటిది ముక్కు మొహం తెలియని వారు ఎదురుపడి ఆంటీ అంటే భరించడం కష్టమే. ఆ పిలుపు వెంటనే వయసు తేడాని గుర్తు చేస్తుంది. అలాగే, ముఖ్యంగా మగవారు పిలిస్తే కొందరు మహిళలకు జుగుస్సాకరంగానూ అనిపిస్తుంది.
ముందుగా మనం తెలుసుకోవాల్సినవి ముఖ్యంగా మూడు విషయాలు. ఇవి ఆడవారికి, మగవారికి వర్తిస్తాయ.
1. నా పిల్లలు నీ పిల్లల వయసు కావచ్చు లేదా కొంచెం తేడా ఉండొచ్చు. అయినా మనం మొదటిసారి కలిస్తే, తరువాత కలిసి పనిచేయవలసి వస్తే నేను నీకు ఆంటీని కాను, ఒకరిని ఒకరు పేర్లతో పిలుచుకోవడం ఉత్తమం.
2. నా కొడుకు లేదా కూతురుది నీ వయసే కావచ్చు లేదా నీకన్నా పెద్ద వయసే కావచ్చు. మనం మొదటిసారిగా కలిస్తే నువ్వు నన్ను ఆంటీ అని పిలిస్తే నాకు నచ్చదు. ఆ అవసరం లేదు, పేరు తెలుసుకుని పేరుకు ‘గారు’ చేర్చి పిలిస్తే సంతోషం.
3. నువ్వు నాకు చిన్నతనం నుంచి తెలియదు, నిన్ను చూడడం ఇదే మొదటిసారి. వయసు తేడాతో సంబంధం లేదు. ఎలా సంబోధించాలో తెలియకపోతే అడిగి తెలుసుకో, నీకు నీవుగా ఊహించుకుని ఆంటీ అని పిలవద్దు. ఇదీ నేటి మహిళల ఆలోచనా సరళి.
ఆంటీ అనే పిలుపుని కుటుంబ సభ్యులకి మాత్రమే నియంత్రిస్తే చాలా సంతోషమని మహిళలు భావిస్తున్నారు. ఇక ఫేస్‌బుక్‌లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ గ్రూప్స్‌లో ఇది సర్వసాధారణం అయింది. ఫ్రెండ్‌గా కలుపుకోగానే ‘ఆంటీ’ అనేస్తారు. కేవలం ఇలా పిలిచినందుకే రోజూ ఎంతోమందిని ఫేస్ బుక్‌లో మహిళలు వారిని బ్లాక్ చేస్తారని తెలిస్తే నిజంగానే వింతగా అనిపిస్తుంది. కానీ- ఇది నమ్మాల్సిన సత్యం. ఫేస్‌బుక్ అంటేనే ఫ్రెండ్షిప్ మరి. అలా ఫ్రెండ్ అయ్యాక అక్కా, చెల్లీ, ఆంటీ అంటే మహిళలకు అది చిరాకు కలిగించే విషయమని అందరూ గమనించాలి. మన భావాలు, ఆలోచనలు తెలుసుకోవడానికి, పంచుకోవడానికే మాత్రమే ఫేస్‌బుక్. అంతే కానీ చుట్టరికాలు కలుపుకోవడానికి కాదని వారు తెలుసుకోవాలి.
మనం రైళ్లలో, బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా కనిపించిన ప్రతి వారిని ఆంటీ, అంకుల్ అని కాకుండా మేడం, సార్ అని పిలుచుకుంటే వారు వెంటనే స్పందిస్తారు. కావాల్సిన సహాయం త్వరగా చేస్తారు. తిరిగి ఎక్కడైనా కనిపించినా మళ్లీ మాట్లాడతారు. మర్యాదలకు సంబంధించిన ఈ విషయాలను నేటి యువత గమనించి మసులుకుంటే మంచిది.

No comments:

Post a Comment