Tuesday, April 21, 2026

 

శీర్షిక: ఆడవాళ్ళూ మీకు జోహార్లు!!

రచన : ఏ. సంథ్యారాణి సిరిప్రగడ(రాణి సంధ్య)  

గమనిక: ఈ కథ నా స్వీయ రచన  

ఆడవాళ్ళూ మీకు జోహార్లు!!

"మీరు పాడటం బాగున్నా లేకున్నా, మీకు పాడాలనిపిస్తే పాడండి. ఇది కూడా ఒక వ్యాయామం. ఊపిరితిత్తులకి మంచి ఎక్సర్సైజ్ కాబట్టి ఎవడో వెక్కిరించాడని పాడటం ఆపేయకండి. పాడటం అనేది మీ ఒత్తిడిని సడలిస్తుంది, అంటే మీ బాడీ కే కాదు బ్రెయిన్ కి కూడా. నేను పాడేటప్పుడు ఒకటే అనుకుంటాను, ఇప్పుడు నేను ఎలాంటి పోటీలకైతే వెళ్ళడం లేదు, నా గొంతు చాలా బాగుండాల్సిన అవసరం లేదు, నేను సినిమాలలో పాటలు పాడడానికి వెళ్ళడం లేదు, చక్కగా పాడుతున్నానో లేదా చూసుకోవడానికి. నాకు పాడటం ఇష్టం కాబట్టి

పాడుతాను! పైగా ఒక ప్రశాంతత మనకి. ఇష్టమైన పనులు చేస్తే ఖచ్చితంగా మనం ఆనందంగా ఉంటాం. సో మన మైండ్ పీస్ కోసం, బాడీ స్ట్రెస్ రిలీజ్ కోసం, మన ఆనందం కోసం పాడాలి అంతే! పాడింది నా ప్రొఫైల్ లో నేను పెట్టుకుంటా, నచ్చకపోతే పక్క నుంచి వెళ్ళిపోవాలి! దాన్ని వెక్కిరించాల్సిన పనిలేదు." అంటూ జుంబా క్లాస్ ముగించింది మల్లిక.

అందరూ చప్పట్లు కొడుతూ, ఆమె చెప్పింది ఆమోదిస్తున్నట్టుగా చిరునవ్వులు చిందిస్తూ... 'హమ్మయ్య ఈరోజుకి ఎక్సర్సైజ్ సరిపోయింది' అనుకుంటూ క్లాస్ నుంచి బయటికి వచ్చేసారు.

మల్లిక ఒక జుంబా ట్రైనర్. ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు క్లాసెస్ తీసుకుంటూనే ఉంటుంది. ఆమె ట్రైనింగ్ అంటే స్టూడెంట్స్ కి చాలా ఇష్టం! ప్రత్యేకంగా

పెళ్ళి అయిన వాళ్ళు, పిల్లల తల్లులు ఎక్కువగా ఆమె క్లాసు ఇష్టపడుతూ ఉంటారు. కేవలం జుంబా క్లాసే కాకుండా ఎన్నో మంచి మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ మాటలు చెప్తూ ఉంటుంది. చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది!

రోజూ ఇంటికి రాగానే మల్లికని పలకరించి, "డిన్నర్ రెడీగా ఉంది, త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి రా! నీకు ఇష్టమైన కర్రీ చేశాను" అంటూ చెప్తుంది ఆమె వదిన పల్లవి. వదిన చూపించే ప్రేమకి, అభిమానానికి మల్లిక ఎప్పుడూ ఫిదా అయిపోతూ ఉంటుంది.

"మల్లి! వచ్చావానే" మంచం పైన కూర్చుని టీవీ చూస్తూ అడిగింది మల్లిక వాళ్ళ అమ్మ సుమతి.

"వచ్చాగాని!! ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? నా పేరునలా ముక్కలు చెక్కలు చేసి పిలవద్దనీ! నా పేరు మల్లిక. పూర్తి పేరుతో

'మల్లిక' అని పిలువు!" గట్టిగా చెప్పింది మల్లిక.

"సరేలేవే! నీకు పేరు పెట్టింది నేను! ముద్దుగా 'మల్లి' అని పిలిస్తే ఏం పోయింది నీకు" అంది సుమతి మూతి తిప్పుతూ... రాగాలు తీస్తూ.

"మల్లికా! ఈ వాదన రోజు ఉండేదేగా. పద, త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి రా. ఇప్పటికే చాలా లేట్ అయింది." అంది పల్లవి.

మల్లిక లోపలికి వెళ్ళగానే, టీవీ సీరియల్స్ చూడడంలో నిమగ్నమయింది సుమతి.

ఇంతలో మెయిన్ బెడ్ రూమ్ లో నుంచి ఆమె భర్త జగదీష్ నుంచి ఫోన్ వచ్చింది సుమతికి."హలో" అంది సుమతి.

"ఎందుకే దాన్ని ఏడిపిస్తావు? ఇంటికి రాగానే! నీ పని నువ్వు చేసుకోరాదు. ఆ టీవీ సీరియల్స్ చూస్తున్నావుగా! పొద్దున్నుంచి కష్టపడి రాత్రికి

ఇంటికి వస్తుంది, రాగానే దాన్ని ఏదో అంటావ్. కాస్త దాన్ని ప్రశాంతంగా భోజనం చేసి పడుకోనీ! మళ్ళీ పొద్దున్నే ఉరకాలి 5 గంటలకి." అన్నాడు జగదీష్.

"ఓ!! నువ్వు ఇంకా పడుకోలేదా జగదీష్ మాస్టారు! నాకేమన్నా దాన్ని ఏడిపించడం సరదానా ఏమిటి? పొద్దున వెళ్తుంది, రాత్రికి వస్తుంది. మధ్యలో ఫోన్ మాట్లాడడానికి కూడా దానికి టైం ఉండదు. ఏదో కొద్దిసేపు దాంతో మాట్లాడాలి అనిపిస్తుంది. ఆ పేచీలో అయినా, వాదనలో అయినా దాంతో మాట్లాడినట్టు ఉంటుంది కదా! రోజు తిన్నావా! పన్నావా! అని మాత్రమే అడుగుతే ఏ బాగుంటుంది!" అంది సుమతి రాగాలు తీస్తూ... మూతి తిప్పుతూ!.

"ఏడ్చినట్టే ఉంది. నువ్వూ, నీ తిక్క ఆలోచన! ముద్దుగా దగ్గర కూర్చోబెట్టుకుని నాలుగు ప్రేమ

మాటలు మాట్లాడరాదే!! ఇదేం పద్ధతి!" ఆశ్చర్యంగా అన్నాడు జగదీష్.

"బాగుంది! నీకు తెలియదా ఏంటి? దాన్ని ప్రేమగా దగ్గరకు తీసుకున్నా చిరాకు పడుతుంది, చిటపటలాడుతుంది. 'అమ్మ నేను పెద్దదాన్ని అయ్యాను నా గురించి ఆలోచించక్కర్లేదు! ఈ ప్రేమ దోమ అన్ని పక్కన పెట్టు. హాయిగా తిని పడుకో, టీవీ చూడు' అని నీతి బోధలు చేస్తుంది. షీ ఇస్ సో ప్రాక్టికల్. నాట్ ఎమోషనల్." అంది సుమతి.

"అవునే! దాని ప్రేమ అంతా చిరాకులో, కోపం లోనే ఉంటుంది! పిచ్చిది దాని గురించి, దాని జీవితం గురించి ఆలోచించట్లేదు. మన గురించి మాత్రమే ఆలోచిస్తుంది. కష్టపడుతుంది. ఏమిచ్చినా దాని రుణం తీర్చుకోలేం మనం!" జగదీష్ ఇలా అంటుండగానే, "ఏంటీ! మీ ఇద్దరూ ఇంకా పడుకోలేదా! ఆయన అక్కడ

రూమ్ లోంచి, నువ్వు ఇక్కడ హాల్లోంచి! ఎంతసేపు ఫోన్లో మాట్లాడుకుంటారు? నాలుగు రోజులు అవగానే రీఛార్జ్ అయిపోయింది అంటూ గోల మొదలెడతారు. ఒక దగ్గర కలిసి కూర్చుని, కలిసి టీవీ చూస్తూ, కలిసి మాట్లాడుకోవచ్చు కదా!" భోజనం చేసి వస్తూనే తల్లిదండ్రులని ఉద్దేశించి అరిచింది మల్లిక.

మల్లిక గొంతు వినగానే ఇద్దరు ఫోన్ పెట్టేశారు!!

అత్తమామలకు ఇద్దరికీ గ్లాసులో పాలు తీసుకొస్తూ "ఇద్దరూ కలిసి చూసే ప్రోగ్రాం లేవన్నా ఉంటే కదా మల్లికా టీవీలో! ఒకరికి న్యూస్, క్రికెట్ కావాలి, ఇంకొకరికి సీరియల్స్, సినిమాలు కావాలి. అందుకే కదా బెడ్ రూమ్ లో కూడా ఒక టీవి పెట్టించాము." అంటూ అత్తమామలిద్దరికీ పాలు అందించింది పల్లవి.

"వదిన, రేపు రాత్రి నేను డిన్నర్ చేయను. నా

ఫ్రెండ్ సారిక కూతురు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంది. రాగానే తయారయ్యి డిన్నర్ కి అక్కడికే వెళుతున్నాను." చెప్పింది మల్లిక.

"అలాగే మల్లికా!" అంటూనే, "మల్లికా పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలి, లాస్ట్ డేట్ దగ్గరికి వస్తోంది. వీలైనంత త్వరగా డబ్బు అరేంజ్ చేయాలి." అంది పల్లవి.

"సరే వదినా. వీలైనంత త్వరగా అరేంజ్ చేస్తా." అంటూ పడుకోడానికి తన రూమ్ లోకి వెళ్ళింది మల్లిక.

 ఎంగేజ్మెంట్ ఫంక్షన్ భారీ ఎత్తున జరుగుతోంది! ఫ్లవర్ బొకే తీసుకొని మల్లిక స్టేజ్ ఎక్కి తన స్నేహితురాలిని కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ, కాబోయే పెళ్ళి కూతురికి బొకే అందించి కిందికి దిగింది.

భోజనం హాల్ కి వచ్చింది మల్లిక. ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. మల్లిక సింపుల్గా పప్పన్నం, అప్పడాలు, వడియాలు, ఆవకాయ, కాస్త బిర్యానీ, 'కద్దు కా కీర్' స్వీట్ ప్లేట్లో వేసుకొని భోజనం ముగించింది. ఐస్క్రీం, గులాబ్ జామ్ కాంబినేషన్ తింటూంది. ఇంతలో తన కాలేజ్ ఫ్రెండ్స్ ముగ్గురు ఒక టేబుల్ దగ్గర కూర్చుని తింటున్నారు. తనని పిలిచేసరికి అటు వెళ్ళింది మల్లిక.

చాలా ఏళ్ళ తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసే సరికి మంచి-చెడు మాట్లాడుకుని, సెల్ఫీలు తీసుకుని, ఎంతో ఆనందంగా కాసేపు గడిపారు. ఇద్దరు స్నేహితులు లేటవుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. అక్కడ తన క్లోజ్ ఫ్రెండ్ సరిత మాత్రమే ఉంది.

"ఏంటి మల్లికా! మన స్నేహితులందరిలో, నీకు తప్ప అందరికీ పెళ్ళిళ్ళు అయి, పిల్లలు పుట్టి,

వాళ్ళ చదువులు కూడా అయిపోవస్తున్నాయి. సారిక కూతురుకి పెళ్ళి కూడా అవుతోంది. నువ్వు మాత్రం ఇంకా ఒంటరిగానే ఉన్నావ్!" అంది సరిత.

"హా... అవును! నేను ఒంటరిగానే ఉండాలనుకుంటున్నాను. మీరు పెళ్ళిళ్ళు చేసుకుని సంతోషంగా ఉన్నారు. నేను చేసుకోకుండా సంతోషంగా ఉన్నాను. అంతే తేడా!" అంది మల్లిక.

"ఏంటే ఒంటరిగా ఎందుకు ఉండాలి అనుకుంటున్నావు? ఇంతకుముందు కూడా చాలా సార్లు అడిగాను నిన్ను, నువ్వు అసలు కొంపదీసి ఆ టైపా?" అడిగింది సరిత.

ఇద్దరి మధ్య సీరియస్ గా సంభాషణ మొదలైంది!

"ఆ టైపా? అంటే?"

"అదే లెస్బియన్ టైప్ ఆ?"

"అలాంటిదేమీ లేదు."

"మరెందుకు ఒంటరిగా ఉండాలనుకుంటున్నావ్? లవ్ ఫెయిల్యూరా?"

"లేదు!"

"మరెందుకే?"

సమాధానం చెప్పకుండా మల్లిక మౌనంగా ఉంది!

"సారీ మల్లికా నిన్నేమైనా బాధపెట్టి ఉంటే! జస్ట్ అవుట్ అఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నా. అందరం పెళ్ళిళ్ళు చేసుకున్నాము కదా నువ్వు మాత్రం ఇలా ఒంటరిగా ఉండేసరికి కొంచెం బాధగా ఉంది."

"హే ఇట్స్ ఓకే! నేను ఒంటరిగా ఉండడానికి నా కారణాలు నాకు ఉన్నాయి. కానీ అవి మీకు

నచ్చుతాయో లేదో, నీకే కాదు మా ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా ఎన్నోసార్లు చెప్పినా వాళ్ళు విభేదించారు. అందుకే నేను చెప్పడానికి ఇష్టపడను."

"సరే మల్లికా నీ ఇష్టం. నీ అభిప్రాయాన్ని తప్పకుండా గౌరవిస్తాను. నీకు చెప్పాలనిపిస్తే చెప్పు."

"నీకు తెలుసు సరిత... కాలేజీలో నన్ను దగ్గరుండి చూసావు. నువ్వే చాలాసార్లు అన్నావు 'మల్లికా నువ్వు ఇండిపెండెంట్ ఉమెన్ వి, ఎవ్వరి మీద ఆధారపడవు' అని. నిజమే! చాలామంది ఆడవాళ్ళలో ఈ క్వాలిటీ ఉంటుంది. కానీ ఆ పర్సనాలిటీ పెళ్ళి మీద ప్రభావం చూపదునుకుంటా వాళ్ళకి. పెళ్ళి చేసుకుని కూడా వాళ్ళ పర్సనాలిటీని కాపాడుకుంటారు. అలాగే నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ ఆడ-మగ సమానత్వం

గురించి కవితలు రాసేదాన్ని, స్పీచ్ లు ఇచ్చేదాన్ని. కానీ ఏ రోజు ఆ సమానత్వం నా జీవితంలో, నా కుటుంబంలో కనపడలేదు ముఖ్యంగా పెళ్ళి తర్వాత భార్య ఖచ్చితంగా రోజూ వంట చేయాలి, ఇంటి పనులు చేయాలి. ఈ విషయం మా ఇంట్లో చిన్నప్పటి నుంచే నేను చూస్తున్నాను."

సరిత సిరియస్ గా వింటోంది!!

"మా అమ్మ ఎంతో కష్టపడేది. పొద్దున్నే లేస్తే సాయంత్రం వరకు అందరికీ ఇష్టమైన వంటలు, ఇంటి పనులు చేస్తూ, రాత్రికి అందరూ పడుకున్న తర్వాత తను నిద్రపోయేది. ఏ తల్లికి/భార్యకి మాత్రమే ఈ బాధ్యత ఉందా!? ఆవిడకి అస్సలు రెస్ట్ దొరికేది కాదు. మా నాన్న కి ఆదివారం ఒక సెలవు వచ్చేది, సెకండ్ సాటర్డే ఒక సెలవు వచ్చేది, పండుగలకు సెలవు వచ్చేది. మరి ఆడవాళ్ళకి మాత్రం

అసలు వంటకి, పనికి సెలవే లేదు. ఉద్యోగం చేసే ఆడవాళ్ళు కూడా ఈ వంట, ఇంటి పనుల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఏ అంత ఖచ్చితంగా ఆడవాళ్ళు వంట చేయాలని ఎక్కడ రాసుంది చట్టంలో! ఇది నన్ను చిన్నప్పటినుంచీ చాలా బాధపెట్టే విషయం. మా అమ్మని చూసేదాన్ని ఆవిడ ఎంత కష్టపడేదో, ఆ తరువాత మా వదిన ఉద్యోగం 'వర్క్ ఫ్రం హోం' చేస్తున్నా, పాపం పొద్దున్న లేస్తే వంట, ఇంటి పనులు, మా అమ్మ నాన్నను, నన్ను చూసుకోవటం, మా అన్నయ్య, పిల్లలను చూసుకోవటం ఎంతో పని. కనీసం వారంలో రెండు రోజులైనా ఆడవాళ్లకు ఒక సెలవు అంటూ ఉండాలి కదా! మగవాళ్ళు బాధ్యతలు పంచుకుని అన్ని పనులు చేసుకోవాలి. భర్తలు వండి పెడితే తినటం, అలాగే పిల్లలకు కూడా తల్లిని కూర్చోబెట్టి వంట చేయడం, వడ్డించడం, ఇంటి పనులు చేసుకోవడం నేర్పించాలి కదా. ఆడవాళ్ళు కూడా సంతోషంగా ఒక రోజంతా

హాయిగా రెస్ట్ తీసుకోవాలి. మన సమాజం ఎందుకు ఇలా లేదు? ఇలా ఎందుకు నేర్పించట్లేదు అందరికీ? నావల్ల కాదు సరిత. ఇలా పొద్దున్నే లేస్తే అన్ని బాధ్యతలు నేనే చూసుకోవడం, ఒక భార్యగా, తల్లిగా వదినగా, చెల్లిగా ఇవన్నీ నేను మోయలేను. తెలిసి తెలిసీ నిప్పుల్లో దూకుతామా చెప్పు."

"హా... అయిపోయిందా నీ సుదీర్ఘమైన స్పీచ్! అంటే నువ్వు పెళ్ళి చేసుకోక పోవడానికి ఇదే నా కారణం! ఇది చాలా సిల్లీ విషయమే! నిజంగా నీకు ఇంటి పనులు, వంట పనులు చేయడం ఇష్టం లేకపోతే హాయిగా ఉద్యోగం చేస్తున్నావు కదా, ఒక మనిషిని పెట్టుకో! వంటకు, ఇంటి పనులకు ఒక మనిషిని పెట్టుకుని నువ్వు వచ్చేవరకు అన్ని రెడీగా చేసి టేబుల్ మీద పెట్టాలి. ఇక సమస్య ఏముంది?"

"బాగుంది సరితా! నువ్వు చెప్పేది చాలా

బాగుంది కానీ మేము మరీ అంత సంపన్నులం కాదు. వచ్చే జీతం ఇంటికి సరిపోతుంది కాబట్టి ఇంకో మనిషిని పెట్టుకునే అంత స్తోమత నాకు లేదు. మా ఇంట్లో ఎన్నో సంబంధాలు చూసారు నాకు. వచ్చిన ప్రతీ పెళ్ళి కొడుక్కి నా మనసులో మాట చెప్పాను. కచ్చితంగా నాకు రెండు రోజులు రెస్ట్ ఉండాలి అని కూడా చెప్పాను. కానీ పెళ్ళిచూపులకి వచ్చిన మగవాళ్ళు ఎవరూ కూడా దానికి ఒప్పుకోలేదు. అందుకే నా ప్రశాంతమైన జీవితంలోకి పెళ్ళి అనేది లేకుంటేనే బాగుంటుంది అని నేను నిర్ణయం తీసుకున్నా."

"హ్మ్..." నిట్టూర్చింది సరిత

"పైగా మా అన్న వదిన ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్నా వాళ్ళు చేసే చిన్న ఉద్యోగాలకి, జీతం కూడా చిన్నదే! మా అమ్మానాన్న నీ, పిల్లల్ని పోషించడానికి ఆ జీతాలు సరిపోవు

కాబట్టి, నా జీతం కూడా ఆ సంసారాన్ని మోయడానికి కాంట్రిబ్యూట్ చేస్తున్న. నాకు ఈ లైఫ్ బానే ఉంది. ముసలితనం గురించి తరువాత ఆలోచిద్దాం. ఇప్పుడే ఆలోచించి భయపడాల్సిన అవసరం లేదు. ఒకే సరిత! ఇప్పటికే చాలా లేట్ అయింది. నేను ఎన్నో విషయాలు నీకు చెప్పాను. ఇక వెళ్దాం పద. మా ఇంట్లో వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బై."

"బై" అంటూ సరిత కూడా లేచింది.

"హలొ మేడం.." అంటూ పక్క టేబుల్ నుంచి ఒక వ్యక్తి లేచి మల్లిక దగ్గరకొచ్చాడు!

"నా పేరు కళ్యాణ్. నేను ఒక రైటర్ ని. మీ సంభాషనంతా విన్నాను. మీరు చెప్పింది చాలా నిజం. సమాజంలో మీరు చెప్పిన మార్పు తప్పకుండా రావాలి. మీకు అభ్యంతరము

లేకపొతే, మీరు చెప్పిన విషయాలు నా రాబోయే పుస్తకం లో రాయాలనుకుంటున్నా!"

"మీ ఇష్టం! రాసుకోండి! ఇంతకీ మీ పుస్తకం పేరెంటి?"

"ఆడవాళ్ళూ... మీకు జోహార్లు!!"

___సమాప్తం


No comments:

Post a Comment