Tuesday, March 17, 2015

మౌనం వీడితేనే మహిళకు న్యాయం-రాణిసంధ్య aranisandhya777@gmail.com -17/03/2015 
online Link: http://www.andhrabhoomi.net/content/mahila-6
 
అతివలకు భద్రత, సమాన అవకాశాలు, సాధికారత,కనీస హక్కులంటూ ఏడాది పొడవునా ఎడతెగని చర్చలు జరుగుతూనే ఉంటాయి.. అత్యాచారాలు, లైంగిక వేధింపులు అంతం కావాలంటూ ఆసేతుహిమాచలం నిరసన సెగలు ఎగసి పడుతూనే ఉంటాయి.. ‘మహిళా దినోత్సవం’ అంటూ ఏడాదికోసారి అట్టహాసంగా సభలు, సమావేశాలు జరుపుతూ నేతలు ఘనమైన ప్రకటనలు గుప్పిస్తూనే ఉంటారు.. అయినా పరిస్థితి షరా మామూలే.. లైంగిక హింస నిరోధానికి చట్టాలెన్ని చేసినా అత్యాచారాల జోరు తగ్గడం లేదు.. రేప్ కేసుల్లో నిందితులకు శిక్షలు అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు.. అయితే- పరిస్థితులు ఇంత దీనంగా ఉన్నప్పటికీ బాధిత మహిళలు ఎంతమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు ధైర్యం చెబుతున్నారు. మహిళలు న్యాయపోరాటం చేయాల్సిందే. ఇష్టం ఉన్నా లేకున్నా పోలీస్ స్టేషన్ తలుపులు తట్టాల్సిందే. లైంగిక వేధింపులు, గృహహింస, మానసిక వేదన, ఆస్తిపంపకాల్లో వివాదాలు, భర్త నుంచి భరణం తదితర విషయాల్లో బాధిత మహిళలకు న్యాయం చేసేందుకు ఇప్పటికే చట్టాల్లో ఎన్నో కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నాయి. వాటిపై అవగాహన పెంచుకుని సాంత్వన పొందేందుకు మహిళలే ముందడుగు వేయాల్సి ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన న్యాయ సంరక్షణ చర్యలు, అందుకోసం ఏర్పాటైన సంస్థల గురించి మహిళలు అవగాహన పెంచుకుంటే ఉపశమనం పొందవచ్చని హైదరాబాద్‌కు చెందిన సీనియర్ న్యాయవాది సివిఎల్ నరసింహారావు సూచిస్తున్నారు. చట్టాల గురించి తెలుసుకుంటే న్యాయ సహాయం పొందడం అంతకష్టమేమీ కాదని ఆయన పలు విషయాలను తెలిపారు.
మన దేశంలోనే కాదు, ఏ దేశంలో నివసిస్తున్న భారతీయ మహిళలైనా తమకు ఎలాంటి అన్యాయం జరిగినా ‘జాతీయ మహిళా కమిషన్’కు, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖకు, ఎన్.ఆర్.ఐ సెల్‌కు గానీ ఫిర్యాదు చేయవచ్చు. తమ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, తమకు జరిగిన అన్యాయం గురించి లిఖిత పూర్వకంగా, పోస్టు ద్వారా లేదా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు పంపవచ్చు. రాష్ట్రాల్లో ఏర్పాటనై మహిళా కమిషన్‌ను కూడా సంప్రదించవచ్చు. కుటుంబ కలహాలకు సంబంధించి ప్రభుత్వం చాలా చోట్ల ఉచిత ఫ్యామిలీ కౌనె్సలింగ్ సెంటర్లను ఏర్పాటుచేసింది. కోర్టులలో, పోలీస్ స్టేషన్‌లలో ఇవి ఉంటాయి. భార్యాభర్తలకు, అవసరమైతే కుటుంబ సభ్యులకు ఈ కేంద్రాల్లో కౌనె్సలింగ్ ఇస్తారు. ఆస్తి తగాదాలకు సంబంధించి సంబంధిత రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్‌డిఒ)ను అవసరమైతే జిల్లా కలెక్టర్‌ని సంప్రదించాలి. మహిళల ఫిర్యాదులపె కలెక్టర్ వద్ద ప్రత్యేకంగా ఒక మహిళా సూపర్‌వైజర్ పనిచేస్తారు. ఇక గృహహింసకు గురయ్యే మహిళల కోసం ప్రభుత్వం ప్రతి జిల్లాలో ‘ప్రొటెక్షన్ ఆఫీసర్స్’ని నియమించింది. వారు జిల్లా మేజిస్ట్రేట్ వద్ద సహాయకులుగా మహిళల రక్షణ కోసం పనిచేస్తూ, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తారు. ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఉద్యోగాల్లో 90 శాతం వరకూ మహిళలనే నియమిస్తారు. ఫిర్యాదులు తీసుకోవడం, వాటిపై సాక్ష్యాలను సేకరించడం, వైద్య సదుపాయాలు సమకూర్చడం, సర్వీస్ ప్రొవైడర్స్ లిస్టు తయారుచేయడం, పీడిత మహిళలకు వసతి కల్పించడం వంటి విధులను ప్రొటెక్షన్ ఆఫీసర్లు నిర్వహిస్తారు.
మహిళా హక్కుల సంరక్షణ కోసం పనిచేసే ఏ రిజిస్టర్డ్ సంస్థలైనా, స్వచ్ఛంద సంస్థలైనా ‘సర్వీస్ ప్రొవైడర్స్’గా సేవలందించేందుకు ప్రభుత్వం వద్ద తమ సంస్థ పేరు నమోదు చేసుకోవచ్చు. వీరు ప్రొటెక్షన్ ఆఫీసర్స్ చేసే అన్ని బాధ్యతలు నిర్వహించవచ్చు. మహిళల ఫిర్యాదులను వివరిస్తూ మేజిస్ట్రేట్‌కి దరఖాస్తు పంపించాలి. సర్వీస్ ప్రొవైడర్స్‌కి ఎలాంటి నేర చరిత్ర కానీ, కేసులతో సంబంధం కానీ ఉండకూడదు. అలాగే, మహిళలు పనిచేసే సంస్థలు, కార్యాలయాలు చిన్నవైనా, పెద్దవైనా అక్కడ లైంగిక వేధింపుల ఫిర్యాదులకు కౌనె్సలింగ్ సెల్‌తోపాటు కంప్లైంట్ సెల్ కూడా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ సెల్‌లో తప్పనిసరిగా మూడు వంతుల మంది సభ్యులు మహిళలే అయ ఉండాలి. అన్ని సంస్థలు ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ (ఎన్‌జిఓ)తో తప్పనిసరిగా అనుసంధానమై ఉండాలి. ఆ ఎన్‌జిఓలు తరచూ ఉద్యోగస్థులకి మానసిక నిపుణులతో చర్చలు, సలహాలు, సంప్రదింపులు జరుపుతూ వారి మానసిక పరిపక్వతకి, మానసికోల్లాసానికి తోడ్పడాలి.
ఆధునిక కాలంలో నాగరికత పెరిగిం దని మనం ఎంతగా సం బరపడుతున్నా, మహిళలు మాత్రం పలు రూపాల్లో ‘ఈవ్ టీజింగ్’ ఎదుర్కొంటున్నారు. ఆకతా యల వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు జంకుతుంటారు. దీన్ని అలుసుగా తీసుకుని నేరగాళ్లు మరింతగా రెచ్చిపోతుంటారు. ఈవ్ టీజింగ్‌ని కట్టడి చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ‘షీ టీమ్స్’ని ఏర్పాటుచేసింది. రోడ్లపై, బస్టాపుల్లో, బస్సుల్లో నిరంతరం నిఘా ఉంచడం ద్వారా, ‘డయల్ 100’ ద్వారా వచ్చే ఫిర్యాదులపై స్పందించి ఆకతాయలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన ఆకతాయలకు వారి కుటుంబ సభ్యుల ముందే కౌనె్సలింగ్ ఇస్తారు. బాధిత మహిళలు ‘షీ టీమ్స్’కు కొరియర్, రిజిస్టర్డ్ పోస్ట్, ఈ-మెయిల్, వాట్సప్, ఎస్‌ఎంఎస్, ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందించవచ్చు. సమాచారం ఇచ్చినవారి వివరాలు, బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతారు. నేరస్థులు రెండోసారి పట్టుబడితే ‘సెక్సువల్ హెరాస్‌మెంట్’ నేరంగా పరిగణించి‘నిర్భయ’ చట్టం కింద విచారిస్తారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి చర్యల గురించి ప్రసార మాధ్యమాలు కూడా విస్తృత ప్రచారం చేయాల్సి ఉంది. తగినంత ప్రచారం జరిగినపుడే ఇలాంటి సేవలు ఉన్నాయని, వాటి ఉపయోగం గురించి బాధిత మహిళలకు తెలుస్తుంది. నిందితుల గురించి సమాచారం అందిస్తే సాక్షి సంతకం పెట్టాలని, పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరగాలని చాలామంది భయపడతారు. ఇలాంటి భయాలు అనవరమని స్వచ్ఛంద సంస్థలు, అధికారులు ధైర్యం చెప్పాలి.
ఆడవారు రాత్రి సమయంలోనైనా ఒంటరిగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు, సరాసరి ఇన్స్‌పెక్టర్‌ని కానీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ని గాని కలవొచ్చు. చట్టప్రకారం కంప్లైంట్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి చర్య తీసుకోకపోతే, పైఆఫీసర్‌కి ఫిర్యాదు చేయొచ్చు. కోర్టులో కేసు నడిపించడానికి ఖర్చులు చాలానే అవుతాయి. ఖర్చులకు డబ్బు లేదనుకుంటే ఉచిత న్యాయ సేవలు అందించే ‘జాతీయ న్యాయ సేవల అధికార సంస్థ’ని సంప్రదించొచ్చు. జాతీయ న్యాయ సేవల అధికార సంస్థ అధికారులు మహిళలకు, పిల్లలకు, ఎస్టీ,ఎస్సీ, పారిశ్రామిక పనివారు, మానవ రవాణా బాధితులు, ఆర్థిక, శారీరక బలహీనులకు అన్ని ఖర్చులు తామే భరించి సేవలు అందిస్తారు. వీలైనంత త్వరగా కేసు ముగిస్తారు. వీటికి సంబంధించిన వివరాలను సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్‌కోర్టు, స్థానిక అధికారుల నుండి పొందవచ్చు. కోర్టు వాయదాలతో కాలం వృథా అవుతోందని భావించేవారికి సత్వర న్యాయం అందించేందుకు జాతీయ న్యాయసేవల అధికార సంస్థ ‘లోక్ అదాలత్’లను ఏర్పాటు చేసింది.
చట్టాలను సరైన విధంగా ఉపయోగించుకోవడం ప్రజల చేతులలోనే ఉంది. అహంతో పంతాలు, పట్టింపులకి పోయి చాలామంది భార్యాభర్తలు, కుటుంబాలు చిన్న చిన్న సమస్యలకు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు, ముఖ్యంగా 498ఎ సెక్షన్‌ని కొందరు తప్పుగా ఉపయోగిస్తున్నారు. శారీరక హింసకి మాత్రమే 498ఎ పెట్టాలని, ఏదైనా అగౌరవం, అవమానం, మానసిక హింస వంటివి అయితే వాటికి సాక్ష్యాలు కావాలని తెలుసుకోవాలి. కోర్టులో నిరూపించలేని ఆరోపణలకు 498ఎ చెల్లుబాటు కాదని గ్రహించాలి. ఎలాంటి కేసు అయనా- తొంభై రోజుల్లో ఛార్జ్‌షీట్ ఫైల్ చేయాలని చట్టం చెబుతోంది. కోర్టుల్లో అప్పీళ్ళపై అప్పీళ్ళు లేకుండా, తొంభై రోజుల్లో విచారణలను ముగిస్తే అత్యాచారాలు, లైంగిక కేసులు చాలా వరకూ కొలిక్కివస్తాయ. నిందితులకు సత్వరం శిక్షలు అమలయ్యే అవకాశం ఉంటుంది. చట్టం ద్వారా న్యాయం పొందవచ్చనే భరోసా బాధిత మహిళల్లో కలుగుతుంది.

No comments:

Post a Comment