This Article is about "SILENT ABUSE"....
My Article "నిశ్శబ్దం తో సమరం సాహసమే !!!" in Today's (05.11.2014) Andhrabhoomi Daily in Bhoomika's Main-feature~~
Rani Sandhya
To Read-Online Link:
http://www.andhrabhoomi.net/content/sahasam
నిశ్శబ్దంతో సమరం.. సాహసమే!
--రాణి సంధ్య
--05/11/2014
మీరు ఏం మాట్లాడినా అవతలివారు పట్టించుకోవడం లేదా..?
మంచీచెడు రెంటికీ
ఇతరుల నుంచి స్పందన లేదా..?
మీ స్నేహితుల జాబితాలో మీ పేరు ఎప్పుడూ
ఉండదా..?
సన్నిహితులు మిమ్మల్ని వెలి వేస్తున్నారా..?
నలుగురిలో మీకెప్పుడూ
ప్రాధాన్యత లేదా.. ?
మీరు కలవాలనుకున్నప్పటికీ అవతలివారు ‘సరే.. సరే..’
అంటూ దాటవేస్తున్నారా... ?
మనసులో ఏముందో చెప్పనీయకుండా కేవలం ఊహలకే
మిమ్మల్ని నిర్బంధించారా..?
... అయితే మీకు తెలియకుండానే మీరు ‘్భవ దూషణ’ (ఎమోషనల్ అబ్యూజ్) అనే
బహిష్కరణకు నిశ్శబ్దంగా గురవుతున్నారని చెప్పొచ్చు. దాని పేరే ‘సైలెంట్
ట్రీట్మెంట్’. ఓస్ట్రసిజం అంటే బహిష్కరించటం, తప్పించడం, వదలిపెట్టడం,
నిర్లక్ష్యం చేయడం, పట్టించుకోకపోవడం. దీనే్న ఒకప్పుడు సంఘ బహిష్కరణ
అనేవారు. నేటి సమాజంలో పూర్తి ఐకమత్యం లేదు, ఉమ్మడి కుటుంబాలు లేవు.
అందువల్ల సంఘ బహిష్కరణకు నేడు తావు లేదు. కానీ- దీంట్లోంచి పుట్టిందే-
‘సైలెంట్ ట్రీట్మెంట్’. ఇద్దరు స్నేహితుల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య
ఒకరిని ఇంకొకరు పూర్తి స్పృహలో ఉద్దేశపూర్వకంగా పట్టించుకోకపోవడం అనే
పద్ధతి నేడు వ్యాపిస్తోంది. దీనిని ‘్భయంకర నిశ్శబ్దం’ అని చెప్పొచ్చు.
ఒకరినొకరు బహిష్కరించుకోవటం వేరు. కానీ- ఇక్కడ బహిష్కరించటం అనేది ఒక వైపు
నుండే జరగడం ప్రమాదకరం. ముఖ్యంగా ఇది ఆడా మగా మధ్య అంటే ప్రేమికులమధ్య లేదా
భార్య భర్తలమధ్య లేదా సన్నిహిత మిత్రుల మధ్య జరగడం విచారకరం. ఇది చాలా
సులభంగా నెమ్మదిగా అవతలివారిని నరకంలోకి నెట్టేయడం వంటిది. మానసికంగా
అవతలివారిమీద పైచేయి సాధించాలని తపించేవారు, తమపై ఎలాంటి నింద బురద పడకుండా
అవతలివారిని అశాంతికి గురిచేసి వారిని మానసికంగా కుంగదీసి తమ ఆధీనంలో
ఉంచుకునే ప్రక్రియ ఇది. ఛీకొట్టకుండా చెండాడడం, పో అనకుండా పొగపెట్టడమే ఈ
‘సైలెంట్ ట్రీట్మెంట్’. ఇది ఒక మైండ్‌గేమ్.
దీని గురించి చాలామందికి తెలియక పోవచ్చు. ఉదాహరణకి పనిమనిషి కూడా ఈ సైలెంట్
ట్రీట్మెంట్ ఉపయోగించొచ్చు. ఎదురుగా నిలుచుని మనమేం చెప్తున్నా
పట్టించుకోకుండా తన పని తాను చేసుకుని పోతూ ఉంటుంది. చెప్పేవారికి ఆవేశం
వచ్చి అరుస్తూ ఉంటారు. అయినా పనిమనిషికి చీమ కుట్టినట్లు కూడా ఉండదు.
అరచినవారికి ఆయాసం నోరు నొప్పి తప్ప ఇంకేం మిగలవు. పనిమనిషిమీద కావొచ్చు,
మొగుడిమీద కావొచ్చు- కోపంతో అరిస్తే కాస్త మనసులో ఆవేశాన్ని ఎప్పటిదప్పుడు
వెళ్లగక్కొచ్చు. దీని ప్రభావం తీవ్రత దగ్గరగా ఉంటూ రోజూ మొహాలు
చూసుకునేవారిలో కన్నా- దూరంగా ఉంటూ ఫోన్లలో పలకరించుకునే వారిలో కాస్త
ఎక్కువ అని చెప్పొచ్చు. అత్తమామలు దూరంగా ఎక్కడో ఉన్నప్పుడు తమ కొడుకు లేదా
కోడలు చెప్పిన బాధలు, కష్టాలు విని వౌనంగా ఉండటం లేదా విన్న ప్రతిసారీ
ముక్తసరిగా ‘ఔనా..! సరే.. సరే..!’ అని అనడం తప్ప- ఎలాంటి ఓదార్పు మాటలు
కాని చేతలు కాని చేయకపోవడం కూడా భావదూషణ అని చెప్పొచ్చు. ఆన్‌లైన్‌లో
పరిచయాలు పెరుగుతున్న నేటి కాలంలో ‘సైలెంట్ ట్రీట్మెంట్’ కొందరి జీవితాల్లో
అల్లకల్లోలం సృష్టించవచ్చు. సన్నిహతులు పట్టించుకోవడం లేదని కొందరు
ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇది కూడా ఓ కారణం.
ఆన్‌లైన్లో ఫోన్ నెంబరు తీసుకోవటం, సరదాగా మాట్లాడుకోవడం, మంచి
స్నేహితులవడం, తరువాత ఏవో చిన్న చిన్న మనస్పర్థలు రావడం ఒకవైపు నుండి
ఉన్నట్టుండి మాటలు ఆగిపోతాయి. పొరబాటున వారు ఫోన్లో చిక్కినా తమకు ఇబ్బంది
కలిగేది మాట్లాడితే వెంటనే కాల్ కట్ అయిపోతుంది. ఆ నిశ్శబ్దాన్ని
ఇటువైపువారు మొదట్లో పట్టించుకోకుండా సరదాగా మెస్సేజ్‌లు ఇస్తూ తమ వంతు
బాధ్యతగా సంబంధం కొనసాగిస్తూ ఉంటారు. కనీసం క్షేమ సమాచారాలకు కూడా సమధానం
ఉండదు. మెస్సేజ్ చేసినా ఫోన్ చేసినా నిశ్శబ్దమే సమాధానం. పైగా ఎప్పుడో
ఒకసారి గట్టిగా రెట్టించి అడిగితే ‘ఇపుడు బిజీ.. తరువాత ఫోన్ చేస్తా’ అని
చిన్న సమాధానం వస్తూ ఉండటం చూసి నిజమే అని మీరు నమ్మి, బంధం అనే
చక్రవ్యూహంలో పూర్తిగా మునిగిపోతారు. కానీ- అవతలివారు తప్పించుకోవడానికి
చెప్పిన అబద్ధం ‘బిజీ’ అని ఆ తర్వాత తెలిసినా నిర్లక్ష్యం, అలసత్వం, బంధం
పట్ల బాధ్యతా రాహిత్యం, అపనమ్మకం కలిగిస్తున్నా ఒకప్పటి తీపి జ్ఞాపకాలు
వెన్నాడుతూ ఉంటే- ఆ సాన్నిహిత్యం మళ్లీ కావాలని కోరుకునే మనసు చాలా సులభంగా
పెద్ద తప్పులను కూడా క్షమిస్తుంది. ఇప్పుడున్న మెస్సేజ్ అప్లికేషన్స్‌లో
ఎవరు, ఎప్పుడు ఆన్‌లైన్‌లోకి వచ్చి వెళ్లారు? అనేది కచ్చితంగా చూపిస్తుంది.
మెస్సేజ్ చేస్తే చూసారా? లేదా? అని కూడా చెప్తుంది. ఇక ఇది మరీ మానసికంగా
మనిషిని చిత్రవధ చేసే సమాచారం. మనం మెస్సేజ్ చేస్తే అవతలి వారు ఆన్‌లైన్‌లో
ఉండి చూడకపోవడం, చూసినా సమాధానం చెప్పకపోవడంతో భయంకరమైన బాధని, కన్నీరుని
మిగులుస్తుంది. ఈ నిశ్శబ్దంలో ఏ రహస్యం దాగి వుందో నిజంగా బంధం కొనసాగించే
వారికి కూడా తెలియదు. సందిగ్ధంలో మిమ్మల్ని తోసేసి అవతలివారు ఆనందిస్తూ
ఉంటారు. దూరంగా ఉన్నందున అరచుకోవడాలు, పరస్పరం నిందించుకోవడాలు ఉండవు. ఏమి
జరుగుతుందో తెలియదు. నిర్లక్ష్యానికి కారణం ఏంటో తెలీదు.
ఇది మొదటి ఘట్టం మాత్రమే. ఇంత జరిగినా వారు నోరు మెదపరు. ఒక్క మాట కూడా
అనరు. ఇది శారీరక హింసకన్నా భయంకరంగా ఉంటుంది. అవతలివారి నుండి వీరు నిజంగా
కోరేది మణిమాణిక్యాలు కాదు, పిసరంత ప్రేమని, ఆప్యాయతని, అనురాగాన్ని,
ఓదార్పుని, భద్రతని, ఒక పొగడ్తను, నలుగురితోపాటు గౌరవాన్ని మాత్రమే
ఆశిస్తారు. కానీ అనూహ్యంగా వీరిని నిశ్శబ్దంగా తిరస్కరిస్తూ అవమానిస్తూ
ఉంటారు. ఇది భరించలేనివారు కొన్నిసార్లు మెస్సేజుల్లోనే నిలదీస్తూ ఉంటారు.
అయినా సమాధానం ఉండదు. అలా నిశ్శబ్దంగా మానసిక వ్యధకు గురిచేసే వ్యక్తీకీ
మనసు లేదా? అంటే అది పచ్చి అబద్ధం. వారు తమ భావావేశాన్ని అదుపులో
ఉంచుకుంటూ, పూర్తిగా తమ భావోద్వేగాలను ఒక వ్యక్తికోసం మాత్రమే స్విచ్‌ఆఫ్
చేసుకుంటారని చెప్పొచ్చు. ఆ బహిష్కరణ తిరస్కరణ కేవలం ఒక వ్యక్తి కోసం
మాత్రమే. అదే వారి టార్గెట్. ఇక రెండో ఘట్టంలో అన్నీ ఆలోచనలు, అవకాశాలు,
అనుభూతులూ మన ఊహకే వదిలేస్తారు. అసలు ఈ మనిషి మనకు తెలిసినవారేనా? అని
అనుమానం కలిగేలా వ్యవహరిస్తూ ఉంటారు. అయనా ఆ బంధాన్ని వదలలేక తమ
భావావేశాలను కొందరు మెస్సేజుల రూపంలో పంపిస్తుంటారు. ఇలా భార్యాభర్తలమధ్య
కూడా జరగొచ్చు.
కొత్తగా పెళ్ళైన దంపతులు ఏడాది తిరగకుండానే ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో గొడవలు
పడ్డారు. భార్య వేరు కాపురం అంది. భర్త ఒప్పుకోనందున భార్య పుట్టింటికీ
వచ్చేసింది. తల్లిలేని ఆ అమ్మాయికి తండ్రే అన్నీ. ఎవరికి బాధలు
చెప్పుకోవాలో కూడా తెలియదు. భర్తవైపు నుండి ఆశావహ స్పందన లేదు. ఫోన్ తీసినా
భర్త నుంచి ఒకటే మాట- వేరు కాపురం అంటే రానని. దాంతో విసిగిపోయిన ఆ
భార్య తన కోపాన్ని బాధని మెస్సేజుల రూపంలో పంపిస్తుంది. ఉమ్మడి కుటుంబంలో
ఉండలేనని ఎన్నిసార్లు ఆమె సరైన కారణాలు వివరించినా భర్త నుంచి స్పందన
ఉండదు. దాంపత్య బంధం ఎంతో బాగుంటుందని కలలు కన్న ఆమెకు నిరాశే మిగులుతుంది.
తాను పుట్టింట్లో ఉండిపోవడానికి బంధుమిత్రులు ఆరాలు తీస్తుంటే ఆమె
ఏడుస్తుంది. భర్త చూపించే వౌనం తనను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే,
నిద్రాహారాలు మాని ఆలోచనలతో సతమతవౌతూ తను ఏం మాట్లాడుతుందో తెలియని
స్థితిలో భర్తకు తన భావాలన్నీ మెస్సేజుల రూపంలో పంపుతుంది. ఆ మెస్సేజులన్నీ
తెలిసినవారికి ఆ భర్త చూపించి తానే బాధితుడినని వారి నుంచి సానుభూతి
పొందుతూ, ఆమెని అందరిలో చులకన చేస్తాడు. భార్యే తనను మెస్సేజులతో చిత్రవధ
చేస్తుందని ప్రచారం చేస్తాడు. అందరూ అమ్మాయిదే తప్పు అని ఓ నిర్థారణకు
వస్తారు. ఆమెకు నీతులు, సూక్తులు చెప్తూ సర్దుకుపొమ్మని, పద్ధతి
మార్చుకోమని చెబుతారు. దీంతో తీవ్ర మానసిక వ్యధ, అవమానం తట్టుకోలేక ఆమె
ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. అందులోనూ విఫలమైతే- భర్త దగ్గరికి వెళ్లి
గొడవ చేసి, ఇదేం న్యాయం? అని నిలదీస్తుంది. అయినా సరే నోరు మెదపని ఆ భర్త
నిశ్శబ్దంగా ఆమె ఆవేశాన్ని, కోపాన్ని రికార్డు చేసి మళ్లీ అందరి ముందు
ఆమెని దోషిగా చిత్రీకరిస్తాడు. ఆమెని కోర్టుకీడ్చి విడాకులు కావాలని
డిమాండ్ చేస్తాడు. కానీ- ఎవ్వరికీ ఇది ఆ భర్తదే తప్పు అని అనిపించలేదు.
అతడి వౌనం వెనుక దాగి ఉన్నది- మోసపూరిత నిశ్శబ్దం అని ఎవరూ గ్రహించరు.
నిజానికి అతను చేసింది భావధూషణ. ఆ భర్త ఒక నేరం చేసినట్టే లెక్క. శారీరకంగా
కొట్టి, హింసిస్తేనే నేరం అనే భావనలో మన సమాజం ఉంది. కానీ- ఇలా వౌనంగా
ఉండడం, నిశ్శబ్దంగా తిరస్కరించటం, ఇతరుల భావావేశాలకి స్పందించకపోవడం కూడా
ఒక నేరమని, అది అవతలి వారి మానసిక శాంతికి ప్రమాదకరమని మనం గ్రహించాలి.
ఇలాంటి వ్యక్తులు సంఘంలో చాలామందే ఉంటారు. అందరి ముందు తాము ఉన్నత భావాలు,
సున్నిత మనస్తత్వం కలిగిన వారిలా వ్యవహరిస్తూ ఉంటారు. చాటుగా అవతలి వ్యక్తి
మనోభావాలతో ఆడుకుంటూ ఉంటారు. బాధితులనే నేరస్తులుగా చూపెడుతూ ఉంటారు.
అందుకే చాలామంది బాధితులు నిజాలను నిరూపించలేక కుమిలిపోతూ ఉంటారు. ముఖ్యంగా
మనం అందరం నేర్చుకోవలసింది, ఇతరులకి నేర్పాల్సింది- నిశ్శబ్దంతో సమరం చాలా
ప్రమాదకరం అని, అలాంటి సాహసం చేయొద్దని. ఎవరో చెప్పే చెడు సలహాలను నమ్మడం
అంటే కష్టాలను కోరితెచ్చుకున్నట్టే. తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ
నీరు కావనే సామెత ఊరికే పుట్టలేదు. ఇది ముమ్మాటికీ అక్షర సత్యం.