Wednesday, November 18, 2015

My Article published in Andrabhoomi Daily Bhoomika Mainfeature:

‘అవార్డుల వాపస్’తో అసలు సమస్య వెనక్కి..-రాణిసంధ్య aranisandhya777@ gmail.com
‘అసహనం’.. ఈ మాటను మన దైనందిన జీవితంలో అప్పుడప్పుడూ వింటూ ఉంటాం. దాన్ని పారద్రోలడానికి ప్రయత్నిస్తూ- ‘ఇది షరామామూలే’ అని భావిస్తూ సర్దుకుంటూ బతికేస్తుంటాం. ఇదంతా వ్యక్తిగత జీవితాల్లో అసహనానికి సంబంధించిన వ్యవహారం. నేడు ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ‘అసహనం’ అనే పదం వినిపిస్తుండడం కొంత విచిత్రంగా, మరి కొంత విడ్డూరంగా అనిపిస్తుంది. అది కూడా మహాపండితుల నుండి, వివిధ రంగాల్లో నిష్ణాతుల నుంచి వినటం కొంత ఆశ్చర్యమే. పండితులకు, మేధావులకు అసహనం రాదనీ, ఉండకూడదనీ కాదు. కానీ, వారు అది బహిరంగంగా ప్రదర్శించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించడం ధర్మమా? అని పామరులకు సైతం సందేహం కలుగుతోంది. అసహనానికి సాక్ష్యంగా కొందరు తమ జాతీయ అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నామంటూ ప్రకటించడం నిజంగా అవసరమా? అంతగా వారి మనోభావాలు దెబ్బతింటే పరిష్కార మార్గాలు లేవా? గడిచిన దశాబ్దాలలో కనీవినీ ఎరుగని అసహనం, దాన్ని చూపించే నిరసన మార్గం రెండూ కొత్తవే! దేశంలో ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు ఎన్నో మారాయి. అన్ని ప్రభుత్వాల హయాంలోనూ ఏదో ఒక లోపం, నిరంకుశ పరిపాలన, నిలకడ లేమి, అధిక ధరలు, పేదల ఇక్కట్లు, అవినీతి, లంచగొండితనం, ఆశ్రీత పక్షపాతం, భద్రతా వైఫల్యాలు, ఉగ్రవాద దాడులు, మత కల్లోలాలు, ప్రాంతీయ విభేదాలు, జాతి విద్వేషాలు, హత్యలు, అఘాయిత్యాలు, ఊచకోతలు, నిర్భయ ఉదంతాలు ఎనె్నన్నో! ఇలాంటి సమస్యలపై ఎప్పుడూ చలించని పండితులు, సాహిత్య జ్ఞానులు, ప్రఖ్యాత కళాకారులు ఇప్పుడే ఎందుకు గళం విప్పారు? ఇప్పుడే ఎందుకు వారు నిరసన బహిరంగంగా తెలియజేస్తున్నారు? సామాన్యుల కష్టాలను ఏనాడూ ప్రశ్నించని వీరు, తమ సాహిత్య కుటుంబంలో ఒక వ్యక్తికి అవమానం జరగగానే- అందరికీ ఆ నొప్పి తెలిసిందా!
ప్రభుత్వం ఇచ్చే జాతీయ గౌరవ పురస్కారాలలో సామాన్యుని కష్టం దాగి ఉందని వీరికి తెలియదా? మరి ఆ సామాన్య ప్రజలు ఏం చేశారు? కళాకారులను, సాహితీవేత్తలను సామాన్య ప్రజలు ఎప్పుడూ తమ గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు. వారి అభిమానమే తమను అందలం ఎక్కిస్తుందని నిష్ణాతులైనవారు మరిచారా? బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కూడా తన పురస్కారాలను తిరిగి ఇయ్యడానికి వెనుకాడనని అనడం బాధాకరమే. ఈ ‘పురస్కారాల తిరస్కారం’ సామాన్యులను అవమానించినట్టే! వారి అభిమానాన్ని కాలదన్నినట్టే అనే చిన్న విషయం వీరు ఆలోచించలేదా? ఇదేనా వారి పాండిత్యం!
పండితులంటే ఎవరికీ, దేనికీ చలించని వారు, దృఢ చిత్తులు, కర్మబద్ధులు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రబోధించింది నిజం కాదా? సామాన్య ప్రజలకంటే ఒక మెట్టుకన్నా పైనే ఆలోచిస్తూ, క్రియాశీల దక్షతతో వారి రచనల ద్వారా, కళల ద్వారా, వారి జ్ఞానార్జన ద్వారా పండితులుగా పేరొంది, ప్రభుత్వంచే పురస్కారాలు అందుకున్న వీరు- ప్రభుత్వ పురస్కారం అంటే ప్రజల అభిమానం అని గుర్తించరా? పద్మశ్రీలు, పద్మభూషణ్‌లు, పద్మ విభూషణ్‌లు, సాహిత్య అకాడమీ పురస్కారాలు ప్రజల అభిమానం దాటకుండా రాలేవు అని వీరు గ్రహించలేరా? మరి ప్రభుత్వం మీది కోపంతో గౌరవ పురస్కారాలు తిరిగి ఇచ్చేయడం ఎంతవరకు న్యాయం? కళాకారుల్లో అన్ని మతాల వారు, అన్ని జాతుల వారు ఉన్నట్టే, అభిమానుల్లో కూడా అన్ని మతాల, జాతుల వారు వున్నారని సాహిత్యజ్ఞానులు తెలుసుకుంటే సంతోషం. ఒక మతం వారినో, ఒక జాతివారినో సంతృప్తి పరచడం కోసం ఈ పురస్కారాలను తిరిగి ఇచ్చేయడం భావ్యం కాదు. మహిళల మనోభావాలతో ఆడుకునే మృగాలు, అత్యాచారాలు, ఆపై హత్యలు చేసి ఎందరో కిరాతకులు దర్జాగా తిరుగుతుంటే ఏమాత్రం ప్రశ్నించని ఈ పండితులు తమ మతస్తుల మీద దాడి జరిగిందని, తమ జాతి వారికి అవమానం జరిగిందని ప్రశ్నించడం సబబా? ఇలా అలక వహించడం, అసహనం పేరుతో అవార్డులు తిరిగి ఇచ్చేయడం పండిత చర్యగా అనిపించడం లేదు.
నిజానికి సాహిత్య అకాడమీ గౌరవ పురస్కారాలు పొందినవారు అవి పొందినప్పటి కంటే పురస్కారాలు తిరిగి ఇచ్చేసినపుడే ఎక్కువ ప్రచారంలో ఉన్నారు. ఇదీ మన ప్రసార మాధ్యమాల పుణ్యమే. మంచి జరిగినపుడు ఒకసారి ప్రచారం చేసి, చెడు జరిగినపుడు మాత్రం పదే పదే ఆ దుస్సంఘటనలు చూపించి సామాన్య జనాలనే కాకుండా పండితులని కూడా ప్రేరేపిస్తున్నారు. నిష్ణాతులైనవారు ప్రజలను చైతన్యపరచాలే తప్ప, జాతీయ పురస్కారాలను తిరిగి ఇవ్వడం ద్వారా కాదు. రాబోయే తరం రచయితలకి మార్గం చూపించే వీరే దారి తప్పుతున్నారేమో అన్పిస్తుంది.
జాతీయ స్థాయిలో తమ కష్టాన్నీ, శ్రమని గుర్తించి, కళలను పోషించే సదుద్దేశంతో తమకు పురస్కారాలు ఇస్తే అవి కేవలం ఒకటి, రెండు సంఘటనలకి మతంతో ముడిపెట్టి తిరిగి ఇచ్చేయడం నిజంగానే దురదృష్టం. వీరి చర్యలు భవిష్యత్తు తరం రచయితలపై, కళాకారులపై పడితే ఎంత ప్రమాదమో వీరు ఆలోచించరా? ప్రభుత్వం కూడా పురస్కారాలు ఇచ్చేముందు - గ్రహీతలు ఏ మతం, ఏ జాతి అని తెలిసే కదా ఇచ్చారు. తమ మతాన్ని, జాతిని, కులాన్ని గౌరవించే పురస్కారాలు ఇచ్చారన్న తర్కాన్ని వీరు అర్థం చేసుకోవాలి. పురస్కారాలను పదికాలాల పాటు పదిలపరచుకోవాలే తప్ప భావోద్వేగాలతో వాటిని వాపసు చేయడం సమంజసం కాదు. వాదనలు, చర్చల ద్వారా తమ మనోభావాలను వెల్లడించాలే తప్ప అవార్డులను వెనక్కి ఇవ్వడంలో ఔచిత్యం ఉందా?